Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jun 3 2021 @ 03:35AM

ప్రముఖ సంగీత విద్వాంసుడు పట్రాయని అస్తమయం

శతాధిక వయస్సులో కరోనాతో చెన్నైలో తుదిశ్వాస 

కర్ణాటక, హిందుస్థానీ సంగీత రీతుల ఔపోసన

తమిళనాడు సర్కారు నుంచి కలైమామణి అవార్డు

ఏపీ ప్రభుత్వం నుంచి ఘంటసాల పురస్కారం


చెన్నై, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సంగీత విద్వాంసుడు, ఘంటసాల స్వర సహచరుడు, ఆయన సంగీత గురువు పట్రాయని సీతారామశాస్త్రి కుమారుడు పట్రాయని సంగీతరావు (101) ఇకలేరు. శతాధికుడైనా ఆరోగ్యంతో కాలం గడుపుతున్న పట్రాయని ఇటీవల కరోనా సోకడంతో అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. గురువారం అంత్యక్రియలు జరుగుతాయని ఆయన చిన్నకుమారుడు వేణుగోపాలకృష్ణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కర్ణాటక, హిందుస్థానీ సంగీతరీతుల్ని ఔపోసన పట్టిన పట్రాయని.. హార్మోనియం, వీణ, వయోలిన్‌ వాయిద్యాల్లో మహాదిట్ట. గాత్రం పరంగానూ అపార ప్రతిభాపాటవాలు చూపారు.


ఆయన అసలు పేరు పట్రాయని వేంకట నరసింహమూర్తి. అయితే సంగీతజ్ఞుల కుటుంబానికి చెందిన తన బిడ్డ తప్పకుండా సంగీత విద్వాంసుడు అవుతాడన్న నమ్మకంతో మాతృమూర్తి మంగమ్మ.. ఆయన్ను సంగీతరావు అని పిలిచేవారు. తర్వాత ఆ పేరే ఆయనకు స్థిరపడింది. ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని ఆనవరం అగ్రహారం సంగీతరావు స్వస్థలం. విజయనగరం సంగీత కళాశాలలో 1938లో  ఘంటసాల-సంగీతరావుకు మధ్య స్నేహం కుదిరింది. ఇది ఘంటసాల పరమపదించే వరకూ కొనసాగింది. 1944 నుంచి కలివరం భూస్వామి గంగుల అప్పలనాయుడు వద్ద ఆరేళ్లపాటు ఆస్థాన గాయకుడిగా పట్రాయని పనిచేశారు. తర్వాత ఘంటసాల వద్ద చేరారు. ఘంటసాల తీసిన ‘పరోపకారి’ చిత్రంలో ‘పదండి తోసుకు.. పదండి ముందుకు..’ అనే పాటను పట్రాయనే పాడారు. రాజశ్రీ ప్రొడక్షన్స్‌కు చెందిన అన్ని చిత్రాలకు పట్రాయని పని చేశారు. ఘంటసాల ఆర్కెస్ట్రాలో పని చేశారు.


సీనియర్‌ నటీమణి కాంచన వంటివారికి సంగీతం నేర్పారు. వెంపటి చినసత్యం స్థాపించిన ‘కూచిపూడి అకాడమీ’లోనూ పని చేశారు. అనేక కూచిపూడి నాటకాలకు సంగీతం అందించారు. మల్లాది రామకృష్ణశాస్త్రి, ఆరుద్ర, ఆదిభట్ల నారాయణదాసు, గుడిపాటి వెంకటాచలం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆకొండ వెంకటశాస్త్రి, నండూరి రామ్మోహన్‌రావు, జరుక్‌ శాస్త్రి, యామిజాల పద్మనాభస్వామి వంటి మహామహులతో ఆయనకు సాహితీ సాన్నిహిత్యం వుంది. తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను ‘కలైమామణి’ అవార్డుతో సత్కరించింది. సంగీత నాటక అకాడమీ ‘ఠాగూర్‌’ పురస్కారం ప్రదానం చేసింది. ఏపీ ప్రభుత్వం ఆయన్ను ‘ఘంటసాల’ పురస్కారంతో సత్కరించింది. 


అన్‌లాక్‌ అప్పుడే వద్దు!:  ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ, జూన్‌ 2: సెకండ్‌ వేవ్‌ ఉధృతి క్రమంగా తగ్గుతున్న వేళ.. రాష్ట్రాలు ఆంక్షల సడలింపు ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఐసీఎంఆర్‌ సూచించింది. థర్డ్‌ వేవ్‌ ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రణాళికా బద్ధంగా ఆంక్షలు సడలించాలని కోరింది. అన్‌లాక్‌ చేసేందుకు ఏమాత్రం తొందర పడొద్దని సూచించారు. ఇందుకోసం ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ బలరామ్‌ భార్గవ ఓ మూడంచల విధానాన్ని ప్రతిపాదించారు. ఒక వారం సరాసరి పాజిటివిటీ రేటు 5ు కన్నా తక్కువ ఉండి, కరోనా ముప్పు అధికంగా ఉన్న జనాభాలో 70 శాతానికి మించి వ్యాక్సినేషన్‌ పూర్తయి ఉండి, ప్రజలంతా కరోనా మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తూ ఉన్న ప్రాంతాల్లో క్రమంగా ఆంక్షలు సడలించ వచ్చని చెప్పారు. జిల్లాల స్థాయిలో పరీక్షలు పెంచి, కట్టడి ప్రాంతాలు ఏర్పాటు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు.

Advertisement
Advertisement