కరోనా నుంచి కోలుకున్న యువకుడు

ABN , First Publish Date - 2020-04-04T11:35:48+05:30 IST

జిల్లాలో తొలి కరోనా కేసును వైద్యులు విజయవంతంగా నయం చేశారు. ఆ యువకుడిని శుక్రవారం ఒంగోలులోని రిమ్స్‌ వైద్యశాల నుంచి డిశ్చార్జి చేశారు.

కరోనా నుంచి కోలుకున్న యువకుడు

ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి

మరో 14 రోజులు హౌస్‌ క్వారంటైన్‌లో   ఉండాలని సూచన


ఒంగోలు నగరం, ఏప్రిల్‌ 3 : జిల్లాలో తొలి కరోనా కేసును వైద్యులు విజయవంతంగా నయం చేశారు. ఆ యువకుడిని శుక్రవారం ఒంగోలులోని రిమ్స్‌ వైద్యశాల నుంచి డిశ్చార్జి చేశారు. లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న ఒంగోలుకు చెందిన యువకుడు గత నెలలో ఇంటికి వచ్చాడు. కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో గతనెల 16న రిమ్స్‌ ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు ఆ యువకుడి నుంచి స్వాబ్‌ తీసి పరీక్షల కోసం తిరుపతి పంపించారు. ఈ నెల 18వ తేదీన పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అప్పటి నుంచి శుక్రవారం వరకూ ఆ యువకుడిని రిమ్స్‌లోని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స  చేశారు.  అతను పూర్తిగా కోలుకోవడంతో రిమ్స్‌ వైద్యులు రెండ్రోజుల క్రితం మరోసారి అతని స్వాబ్‌ను సేకరించి పరీక్షల కోసం విజయవాడ పంపించారు. అందులో ఫలితం నెగిటివ్‌ అని తేలింది. ఆమేరకు గురువారం సమాచారం వచ్చింది.


దీంతో యువకుడిని శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మరో 14 రోజులు గృహ నిర్భంధంలోనే ఉండాలని ఒంగోలు రిమ్స్‌ వైద్యశాలలో యువకుడికి చికిత్స అందించిన డాక్టర్‌ రిచర్డ్స్‌ సూచించారు. పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న యువకుడు రిమ్స్‌ వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీరాములు, డిఫ్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్టారెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్‌ వేణుగోపాలరెడ్డి పూర్తిగా కోలుకున్న యువకుడికి అభినందనలు తెలిపారు.  


భయం వద్దు.. ధైర్యమే మందు!.. రిమ్స్‌ వైద్యుల సేవలు భేష్‌ ఫ ‘ఆంధ్రజ్యోతి’తో కరోనా విజేత


ఒంగోలు నగరం, ఏప్రిల్‌ 3 : ‘కరోనా లక్షణాలు కనిపించటంతోనే కలవరపడిపోతున్నాం. ప్రాణాలు పోతాయని భీతిల్లుతున్నాం. కానీ ధైర్యంగా ఉండి, వైద్యం చేయించుకుంటే ఆ వైరస్‌ను ఎదుర్కోవచ్చు. అనుమానం వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్తే మన ప్రాణాలు కాపాడుకోవడంతోపాటు, ఇతరులకు మేలు చేసిన వాళ్లం అవుతాం. నేను కూడా అలాగే వ్యవహరించాను. ఇప్పుడు ఆ మహమ్మారిని జయించాను’ అని కరోనా పాజిటివ్‌గా నమోదై చికిత్స అనంతరం కోలుకుని గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఒంగోలు యువకుడు అన్నారు. 15 రోజులపాటు వైద్యశాలలో ఉండి డిశ్చార్జి అయిన 23 ఏళ్ల యువకుడు తన అనుభవాలను ఆంధ్రజ్యోతికి తెలిపారు.


ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న నేను గత నెల 10వతేదీన అక్కడి నుంచి బయల్దేరి 12వతేదీన ఒంగోలు వచ్చాను. నాలుగు రోజుల తర్వాత జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే రిమ్స్‌ వైద్యులను సంప్రదించాను. వారు నన్ను వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు తరలించి పరీక్షలు నిర్వహించారు. గత నెల 18న నాకు పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. ఒక్క రోజు కాస్తంత ఆందోళనకు గురయ్యాను. అయితే వైద్యులు మనోధైర్యం కల్పించారు.  మందులు, ఆహారం సమయానికి ఇస్తూ చికిత్స అందించారు. కరోనా మనల్ని ఏమీ చేయదు. తగిన చికిత్స తీసుకుంటే కొద్ది రోజులకే సాధారణ స్థితికి రావచ్చు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలే కానీ కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించ కూడదు. అది ఆ వ్యక్తితోపాటు మన చుట్టుపక్కల ఉన్న మన వారికి, బంధువులకు, సమాజానికి చేటు  తెస్తుంది. కరోనా భయంకరమైన వ్యాధి కాదు. ప్రభుత్వం సూచించిన విధంగా భౌతిక దూరం పాటించటం ద్వారా వైరస్‌ నుంచి కాపాడుకోవచ్చు. ఇప్పటికే ఆ వైరస్‌ లక్షణాలు ఉన్నాయనుకునే వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. నేడు చేసిన పనే అదే. ఈ కారణంగానే నేను కొద్ది రోజులకే కోలుకున్నాను. మీరు కరోనా నియంత్రణలో మీ వంతు సహకారం అందించాలి. 

Updated Date - 2020-04-04T11:35:48+05:30 IST