Abn logo
Apr 17 2021 @ 00:25AM

పొదుపు సంఘంలో నిధుల గోల్‌మాల్‌

రూ. 7లక్షలు స్వాహా 

ఆందోళనలో 750మంది సభ్యులు

హుజూరాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 16: కూలీ నాలీ చేసి పైస పైస పొదుపు చేసుకునేందుకు గ్రామస్థులందరు కలిసి సంఘం ఏర్పాటు చేసుకుంటే క్యాషియర్‌     రూ.7.20లక్షలు స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుమ్మనపల్లి గ్రామంలో 1998లో కిసాన్‌ పొదుపు సంఘాన్ని గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్నారు. సంఘంలో ప్రస్తుతం 750మంది సభ్యులతో రూ. 2కోట్లతో లావాదేవిలు జరుగుతున్నాయి. ప్రతి నెల పాలకవర్గం సమావేశం నిర్వహించుకొని సంఘం సభ్యులకు అప్పులు ఇస్తారు. సంవత్సరానికి ఒక్కసారి సాధారణ మహాసభ నిర్వహించి ఆదాయ, వ్యయాల గురించి నివేదికను చదివి వినిపిస్తారు. అయితే హుజూరాబాద్‌, జమ్మికుంట, కమలాపూర్‌ మండలంలోని 19 సంఘాలు శాతవాహన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ప్రతి నెల 30న సమితి నుంచి సంఘంకు ఒక ఆడిటర్‌ వచ్చి లావాదేవిలు పరిశీలిస్తారు. తుమ్మనపల్లి సంఘంలో రూ.7.20లక్షలు ఎలా స్వాహా జరిగిందనే విషయం ఎవ రికి తెలియలేదు. నాలుగు రోజుల క్రితం సంఘం క్యాషియర్‌ గరుదాసు గిరి అనారోగ్యానికి గురికావడంతో హైద్రాబాద్‌ ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘ బాధ్యతలు అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌రెడ్డి చూసుకోవడానికి సంఘ కార్యాలయానికి వె ళ్లాడు. కొందరు సభ్యులు డబ్బులు కట్టడానికి వచ్చారు. రాజేశ్వర్‌రెడ్డి అనే సభ్యుడు ప్రతి నెల  చెల్లిస్తుండగా అతడిపై అప్పు ఉందని అధ్యక్షుడు చెప్పగా సదరు సభ్యుడు కంగుతిన్నాడు. నాకు అప్పు లేదని, నేను పొదుపు మాత్రమే చేస్తున్నానని చెప్పగా, ఈ విషయం సమితికి ఫిర్యాదు చేశాడు. స్పందించిన సమితి ఆడిటర్లు వచ్చి రికార్డులను పరిశీలించగా మరో 12మంది సభ్యుల పేర్ల మీద క్యాషియర్‌ రూ. 7.20 లక్షలు తీసుకున్నట్లు సమితి ఆడిటర్లు నిర్ధారణ చేశారు. దీంతో సంఘ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement
Advertisement