కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాపై పట్టించుకోని ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-28T05:24:18+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా దక్కితే ప్రాజెక్ట్‌ను కేంద్రం పర్యవేక్షిస్తుందని, అందుకనే రాష్ట్ర ప్రభుత్వం జాతీయ హోదా కోసం ప్రయత్న చేయడం లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాపై పట్టించుకోని ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

- స్వలాభం కోసమే రీడిజైనింగ్‌

- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి


సుభాష్‌నగర్‌, జనవరి 27: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా దక్కితే ప్రాజెక్ట్‌ను కేంద్రం పర్యవేక్షిస్తుందని, అందుకనే రాష్ట్ర ప్రభుత్వం జాతీయ హోదా కోసం ప్రయత్న చేయడం లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదాకు కృషి చేయక పోవడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఫల్యం అనాలో ఉద్దేశ్యపూర్వకంగా వదులుకున్నాడని సందేహిం చాల్సి వస్తోందన్నారు. ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా దక్కితే ప్రాజెక్ట్‌ నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వానిదే ఉంటుందన్నారు. కేవలం వారి స్వలాభం కోసమే ప్రాజ్టెక్ట్‌ రీడిజైనింగ్‌ పనులను మెగా సంస్థకు అప్పగించారని ఆరోపించారు. కేంద్రం పర్యవేక్షిస్తే రీడిజైనింగ్‌ లోపాలు బయటపడతాయని ఆరోపించారు. జాతీయ హోదా దక్కితే లక్ష కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలేవని, అప్పులు చేయాల్సిన అవసరం ఏర్పడక పోయేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భవిష్యత్‌ తరాలను అప్పుల ఊబిలోకి నెట్టేసారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ హయాంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టారని తెలిపారు. తుమ్మడిహెట్టి, మేడిగడ్డలో నీరు ఎక్కువగా ఉన్నపుడు వాటిని రెండు టీఎంసీల నీటిని తరళించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందన్నారు. అది కూడా కేవలం వర్షాకాలంలో నీటిని తరళించేందుకు అనుమతి ఉందని, మూడు నెలలపాటు 180 టీఎంసీలు తరళించుకోవచ్చన్నారు. 65శాతం నీటి లభ్యత ఉన్నచోట ప్రాజెక్ట్‌ నిర్మించకుండా 35శాతం లభ్యత ఉన్నచోట నిర్మిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కోవడం సరికాదన్నారు. ఈ సమావేశంలో సిటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం, పద్మాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T05:24:18+05:30 IST