మహా తుఫాను

ABN , First Publish Date - 2021-05-20T09:49:41+05:30 IST

మహారాష్ట్ర సహా పలురాష్ట్రాల్లోనూ, మరీముఖ్యంగా గుజరాత్‌లోనూ పెను తుఫాను ‘తౌక్తే’ సృష్టించిన విధ్వంసం ఊహకు అందనిది. ఇళ్ళు, రహదారులు అనేక వ్యవస్థలను...

మహా తుఫాను

మహారాష్ట్ర సహా పలురాష్ట్రాల్లోనూ, మరీముఖ్యంగా గుజరాత్‌లోనూ పెను తుఫాను ‘తౌక్తే’ సృష్టించిన విధ్వంసం ఊహకు అందనిది. ఇళ్ళు, రహదారులు అనేక వ్యవస్థలను అది నాశనం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రంలో ఏరియల్‌ సర్వే చేసి తక్షణ సాయంగా వెయ్యికోట్లు ఇచ్చారు. రెండోవిడత కరోనాకు దేశం అతలాకుతలమైపోతున్న దశలో, పడమటితీర రాష్ట్రాలను ఈ తుఫాను వొణికించింది. విద్యుత్‌ వ్యవస్థలు దెబ్బతినడం వల్ల కొవిడ్‌ ఆసుపత్రులు తల్లడిల్లాయి. బంగాళాఖాతంలో ఇప్పుడు ఊపిరిపోసుకుంటున్న కొత్త తుఫాను ‘యాస్‌’ మరికొద్దిరోజుల్లోనే ఒడిశా, పశ్చిమబెంగాల్‌ను కుదిపేయబోతున్నదని హెచ్చరికలు వినబడుతున్నాయి.బంగాళాఖాతంతో పాటు అరేబియా సముద్రం కూడా తుఫాన్లకు మారుపేరుగా పరిణమిస్తున్నది.


పుట్టిన మూడు నాలుగురోజుల్లోనే ఉగ్రరూపాన్ని సంతరించుకొని, తీరందాటేలోగా తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిన తౌక్తే తుఫాను రాబోయేరోజుల్లో మనం మహమ్మారులతో పాటుగా ఎదుర్కోవలసిన మరో ప్రమాదాన్ని గుర్తుచేస్తున్నది. బంగాళాఖాతంలో కంటే అరేబియా సముద్రంలో తుఫాను పుట్టుకలు కాస్తంత తక్కువన్న అంచనాలు కూడా ఇప్పుడు తారుమారైనాయి. రుతుపవన కాలానికి సరిగ్గా ముందు ఏదో ఒక తుఫాను ఏర్పడి, ఒక రాష్ట్రాన్ని కచ్చితంగా ఎక్కువ దెబ్బతీస్తున్నది. అరేబియా సముద్రం దాదాపు ముప్పై డిగ్రీల సెల్సియస్‌ ఉండటం ఇందుకు కారణమని అంటున్నారు. గత ఏడాది మహారాష్ట్ర కరోనాపై పోరులో నిమగ్నమైనప్పుడు నిసర్గ తుఫాను అతలాకుతలం చేసింది. ముంబై ప్రమాదం అంచువరకూ వచ్చి కుదుటన పడ్డది. అదే కాలంలో బంగాళాఖాతం నుంచి ఆంఫన్‌ కమ్ముకొచ్చి పశ్చిమబెంగాల్‌ను దెబ్బకొట్టింది. నివర్‌ బారిన పడి పుదుచ్చేరి వొణికిపోయింది. ఇలా తూర్పు పడమరలు రెండువైపులనుంచీ తుఫానులు పుట్టుకొచ్చి తీరప్రాంత రాష్ట్రాలను కుదిపేస్తున్న స్థితి సహజంగా ఆందోళన కలిగించే అంశమే.


సముద్రజలాలు వేడెక్కడం, అందునా బంగాళాఖాతంకంటే వందేళ్ళక్రితం వరకూ ఓ రెండు డిగ్రీలు తక్కువే ఉండే అరేబియా సముద్రం కూడా క్రమంగా వేడెక్కి తుఫానులను సృష్టించడం భూతాపం విషయంలో మనం కనబరుస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలు ఏటా సగటున ఐదు తుఫాన్లను సృష్టిస్తాయని లెక్క. కానీ, ఇటీవల ఆ సంఖ్య పెరిగింది. అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫానుల సంఖ్యా హెచ్చింది. మొత్తంగా గత ఐదేళ్ళలో తుఫానులు ముప్పైశాతం హెచ్చాయని కూడా అంటున్నారు. బలమైన తుఫానులు సైతం వేగంగా బలహీనపడటమనే ధోరణి కూడా ఇటీవల మారిపోతున్నది. చాలా బలహీనంగా మొదలై, త్వరితంగా బలపడి, అధిక విధ్వంసం సృష్టించడం ఇటీవల ఎక్కువైంది. ప్రభుత్వాలకు ఇది కచ్చితంగా కొత్తసవాలే. తుఫాను చావుపుట్టుకలను పసిగట్టే విషయంలో మన పరిజ్ఞానాలు పనికిరాకుండాపోయే ప్రమాదం ఉంది. అంతరిక్షంలో ఎన్ని ఉపగ్రహాలున్నా, అవి ఎంతవిలువైన సమాచారాన్ని పంచుకున్నా మానవ ప్రయత్నానికంటూ కొంత సమయం అవసరం. ప్రజలను సకాలంలో హెచ్చరించడం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సముచితమైన ఏర్పాట్లు చేయడం వంటివి జరగాలంటే కచ్చితంగా కాస్త వ్యవధి ఉండాల్సిందే. మహమ్మారులతో పాటు మహాతుఫానులూ ముంచెత్తే ప్రమాదం ముందు ముందు మరింత ఉన్నది కనుక, మన పరిజ్ఞానానికీ, మనుగడ విధానానికీ కూడా మెరుగుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేరళనుంచి గుజరాత్‌ వరకూ వరుస రాష్ట్రాలను చుట్టుముట్టి, ప్రత్యక్షంగా పదుల సంఖ్యలోనూ, పరోక్షంగా వందలమందినీ బలితీసుకున్న ఈ తుఫాను కోట్లాది రూపాయల నష్టాన్ని కలుగచేయడమేకాక, వేలాదిమందిని నిరాశ్రయులను చేసింది, లక్షలాదిమందిని మరొకచోట తలదాచుకొనేట్టు చేసింది. కరోనా మహమ్మారి యావత్‌ప్రపంచాన్ని కుదిపేస్తున్నా, లక్షలమందిని పొట్టనబెట్టుకుంటున్నా, మనిషి తన స్వార్థాన్ని వీడలేదు. పర్యావరణ అనుకూల సాంకేతికతల బదిలీతో అన్నిదేశాలూ సంఘటితమై భూతాపాన్ని నియంత్రించడం, పర్యావరణహితంగా జీవించడం అవసరం.

Updated Date - 2021-05-20T09:49:41+05:30 IST