వెంటాడుతున్న కరోనా

ABN , First Publish Date - 2020-06-04T10:14:27+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తాజా కేసులు నగరం నుంచి సోకుతున్నవే ఎక్కువ

వెంటాడుతున్న కరోనా

ఉమ్మడి జిల్లాలో వేగంగా కేసుల ఉధృతి

గ్రీన్‌జిల్లా యాదాద్రిలో నాలుగు నమోదు

హైదరాబాద్‌ నగరం నుంచే వైరస్‌ వ్యాప్తి 

తాజాగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌ కేసులు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐదు యాక్టివ్‌ కేసులు


ఉమ్మడి నల్లగొండ జిల్లావాసులను కరోనా వెంటాడుతోంది. లాక్‌డౌన్‌ కాలంలో స్తబ్దుగా ఉన్న వైరస్‌ సడలింపు అనంతరం విజృంభిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా  ఇప్పటి  వరకు 105కేసులు నమో దవగా 98మంది ఆస్పత్రి చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఐదుగురు యాక్టివ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఇద్దరు పాజిటివ్‌ రోగులు మృతిచెందారు. రోజురోజుకు పెరుగుతున్న యాక్టివ్‌ల సంఖ్యతో ప్రజలు భయాందోళకు గురవుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి, యాదాద్రి / నల్లగొండ అర్బన్‌)

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తాజా కేసులు నగరం నుంచి సోకుతున్నవే ఎక్కువ. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు పాజిటివ్‌ కేసులు హైదరాబాద్‌ నగరంలో వైద్యానికి వెళ్లగా అక్కడే సోకినట్టుగా భావిస్తున్నారు. మరొకరికి హైదరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌ నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఎస్‌.లింగోటానికి చెందిన దంపతులు కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం చేసి ఓయూలో చేరగా మే 30న భార్యకు కరోనా పాజిటివ్‌గా నమోదైంది. అదేవిధంగా రాజాపేట మండలం దూది వెంకటాపురానికి చెందిన గర్భిణి ప్రసూతి కోసం హైదరాబాద్‌ ఆస్పత్రికి వెళ్లగా ఆమెకు అక్కడే కరోనా సోకి ఈ నెల 1న మృతిచెందింది. ఆలేరు మండలం కొల్లూరుకు చెందిన మహిళ గుండె సంబంధిత వ్యాధి చికిత్సకు సికింద్రాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లగా బుధవారం కరోనా లక్షణాలు బయటపడ్డాయి. చౌటుప్పల్‌ మండల కేంద్రానికి చెందిన కూరగాయల హోల్‌సేల్‌ వ్యాపారికి జూన్‌ 2న కరోనా పాజిటివ్‌ వచ్చింది. వ్యాపారితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు కలిగిన 58మందిని గుర్తించి హోం క్వారెంటైన్‌ చేశారు. కూరగాయల మార్కెట్‌ను పూర్తిగా మూసివేశారు. ఆయన నివాస ప్రాంతం విద్యానగర్‌ను కంటైన్మంట్‌ జోన్‌గా ప్రకటించి ఆ వీధిలో జన సంచారంపై ఆంక్షలు విధించారు. కూరగాయల వ్యాపారికి పాజిటివ్‌తో పలువురు ఆందోళన చెందుతున్నారు. 


హోంక్వారంటైన్‌లో ఉండాలి

కరోనా పాజిటివ్‌ నిర్దారణ జరిగిన వ్యక్తులతో కాంటాక్టు గల వ్యక్తులు 14రోజులు హోం క్వారైంటైన్‌లో ఉండాలని, లక్షణాలు కనిపిస్తే వైద్య అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇతర రాష్ర్టానికి వెళ్లి వచ్చిన వ్యక్తికి మంగళవారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా ఏడు నెలల బాబుకు సైతం బుధవారం పాజిటివ్‌ నిర్దారణ జరిగింది. తిప్పర్తి మండలం పజ్జూరుకు చెందిన వ్యక్తికి ఇటీవల పాజిటివ్‌ నిర్దారణవగా రెండు గ్రామాలను కంటైన్మెంట్‌ చేశారు. సూర్యాపేట జిల్లా ఏపూరులో 4నెలల బాలుడు కరోనా పాజిటివ్‌తో మృతిచెందాడు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా వారం రోజుల్లో తిరిగి పాజిటివ్‌ కేసులు నిర్దారణ కావడం సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 


సడలింపుతోనే పాజిటివ్‌ల నమోదు

లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా వీధుల్లో జన సంచారం, వ్యాపార కార్యకలాపాలు, ప్రజా రవాణా సౌకర్యాలు యథాస్థితికి చేరుకున్నాయి. దీంతో ఏ వైపు నుంచి కరోనా మహమ్మారి ముప్పు పొంచివుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం గా వ్యవహరించవద్దని అధికారులు సూచిస్తున్నారు, భౌతిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రతతో ఎవరికి వారే మరిం త జాగ్రత్తగా మెదలాలని సూచిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు 16మంది కరోనా పాజిటివ్‌ రాగా వీరందరూ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారే. మరో 10మంది వలస కూలీలకు పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం గ్రామాల్లో సైతం పాజిటివ్‌ కేసులు నమోదవడం కలవరానికి గురి చేస్తోంది.


తాజాగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌

ఆలేరు రూరల్‌ : ఆలేరు మండలం కొల్లూరు గ్రామానికి చెందిన మహిళకు బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్దారణ జరిగింది. గ్రామానికి చెందిన 38ఏళ్ల మహిళ వారం రోజుల క్రితం సాయిగూడెంలో బంధువుల వివాహానికి హాజరైంది. అనంతరం ఛాతిలో నొప్పి ఉండడంతో మే28న సికింద్రాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆమెలో కరోనా లక్షణాలు ఉన్నాయని గమనించిన వై ద్యులు 30న గాంధీ ఆస్పత్రికి  తరలించగా పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో 7నెలల బాలుడికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది.   రెండురోజుల క్రితం బాలుడి తండ్రికి పాజిటివ్‌గా రాగా అధికారులు అప్రమత్తమై కుటుంబసభ్యులకు పరీక్షలు చేశారు. పరీక్షల్లో బాలుడికి పాజిటివ్‌ అని తేలింది.


ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం- డాక్టర్‌ సాంబశివరావు, డీఎంహెచ్‌వో 

కరోనా లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత ప్రజలు ఎంత మా త్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌లు ధరించాలి. భౌతిక దూరం పాటించడమే గాక చేతులు శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలి. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నప్పటికి, అందుకు అనుగుణంగా కాంటాక్టు గల వ్యక్తులను ప్రభుత్వ, హోంక్వారంటైన్‌ చేస్తూ నియంత్రణ చర్యలు చేపడుతున్నాం. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యాధికారులను సంప్రదించాలి. అనుమానితుల సమాచారం అందించాలి. 


Updated Date - 2020-06-04T10:14:27+05:30 IST