జోన్ల మార్పు ఇంకెన్నాళ్లకు?

ABN , First Publish Date - 2020-09-21T07:20:33+05:30 IST

హెచ్‌ఎండీఏ (హైదరాబాద్‌ మహానగర్‌ అభివృద్ధి సంస్థ) పాలన అంతా ఇష్టారాజ్యంగా సాగుతున్నది.

జోన్ల మార్పు ఇంకెన్నాళ్లకు?

ఇద్దరు మంత్రులు ఆదేశించినా కదలని హెచ్‌ఎండీఏ

ముగ్గురు కలెక్టర్లు లేఖలు రాసినా స్పందన కరువు 

మున్సిపాలిటీ మూడుసార్లు తీర్మానించినా అదే నిర్లక్ష్యం

ఇష్టారాజ్యంగా హెచ్‌ఎండీఏ తీరు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, సెప్టెంబరు 20 : హెచ్‌ఎండీఏ (హైదరాబాద్‌ మహానగర్‌ అభివృద్ధి సంస్థ) పాలన అంతా ఇష్టారాజ్యంగా సాగుతున్నది. కారణాలేమైనప్పటికీ తమ పాలన అంతా ప్రత్యేకమన్నట్టు హెచ్‌ఎండీఏ అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నది. హెచ్‌ఎండీఏ అంటే గ్రేటర్‌ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా చుట్టుపక్కల జిల్లాలోని పలు మండలాల వరకు విస్తరించి, అభివృద్ధి చేయ సంకల్పించింది. అయితే అభివృద్ధి మాటదేవుడెరుగుకాని జిల్లాలోకి విస్తరించిన ప్రాంతాల్లో జోన్ల విభజన పేరిట ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. జోన్ల పేరుతో హెచ్‌ఎండీఏ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వడం లేదు. దాంతో ప్రజలు పడుతున్న పాట్లను గుర్తించిన ఇద్దరు మంత్రులు చెప్పినా, ముగ్గురు కలెక్టర్లు లేఖలు రాసినా, సంగారెడ్డి మున్సిపాలిటీ మూడు సార్లు తీర్మానాలు చేసి పంపించినా బేఖాతరు చేస్తూ, జోన్లను మార్చకపోవడం గమనార్హం.


ఇద్దరు మంత్రులు చెప్పినా..

సంగారెడ్డి ప్రాతం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండడంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం 2031 వరకు చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి రూపొందించిన బృహత్‌ ప్రణాళికను ప్రభుత్వం 2013లో ఆమోదించింది. అయితే ఈ బృహత్‌ ప్రణాళికలో సంగారెడ్డి పట్టణంలోని ప్రాంతాలను నివాస, వాణిజ్య, మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్లు, వంద ఫీట్ల రోడ్ల ఏర్పాటును పేర్కొన్నారు. ముఖ్యంగా వందఫీట్ల రోడ్ల ఏర్పాటుతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్లు ప్రజాజీవనానికి అనుకూలంగా లేవని, వీటిని మార్చాలని సంగారెడ్డి మున్సిపాలిటీ మూడుసార్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసి హెచ్‌ఎండీఏకు పంపించింది. అలాగే మున్సిపాలిటీ పాలకవర్గం కోరిక మేరకు ఈ జోన్లను మార్చాలని ఇద్దరు మంత్రులు కేటీ రామారావు, టి.హరీశ్‌రావు హెచ్‌ఎండీఎలకు సూచించారు. 2016 నుంచి ముగ్గురు కలెక్టర్లు మాణిక్కరాజ్‌ కన్నన్‌, డాక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుతో పాటు ప్రస్తుత కలెక్టర్‌ హన్మంతరావు కూడా జోన్లను సవరించాలని హెచ్‌ఎండీఏకు లేఖలు రాశారు. ఈ వ్యవహరమంతా జరిగి ఐదేళ్లు కావస్తున్నా వీరి సూచనలు, సిఫారసులకు హెచ్‌ఎండీఏ ఏ మాత్రం స్పందించలేదు. జోన్లను మార్పు చేయడం లేదు.


మార్పు చేయాల్సిన జోన్లు

సంగారెడ్డిలో మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్లుగా ఉన్న బైపాస్‌ రోడ్డు, రెవెన్యూ కాలనీ, గొల్లగూడెం, ఐటీఐ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలే లేవు. ఇక్కడ సగానికి పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతాలను మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌ నుంచి రెసిడెన్షియల్‌ జోన్‌గా మార్చాల్సి ఉన్నది. జోన్‌ మార్పు చేయకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వడం లేదు. అంతేగాక ఖాళీ ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎ్‌సకు అనుమతించడం లేదు. దాంతో ఇళ్ల నిర్మాణాలను ప్లాట్లను కొనుగోలు చేసిన మధ్యతరగతి వారెందరో అష్టకష్టాలు పడుతున్నారు. అలాగే పెరీ అర్బన్‌ జోన్‌గా ఉన్న రాజంపేట, మల్కాపూర్‌ రోడ్లను, కమర్షియల్‌ జోన్లుగా ఉన్న కల్వకుంట, శాంతినగర్‌, చాణక్యపురి కాలనీ, నారాయణరెడ్డి కాలనీ, సంజీవనగర్‌లను రెసిడెన్షియల్‌ జోన్లుగా మార్చాలన్న ప్రతి పాదనలు హెచ్‌ఎండీఏ వద్ద ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ఇక బృహత్‌ ప్రణాళికలో పేర్కొన్నట్టు సంగారెడ్డిలో 60 ఫీట్ల రోడ్డు ఉన్న కల్వకుంట, చిమ్నాపూర్‌, ఐఐటీ రోడ్డును వందఫీట్లుగా మారిస్తే మున్సిపల్‌ అనుమతితో కట్టుకున్న వందల సంఖ్యలో ఇళ్లను కూలగొట్టాల్సి వస్తుంది. అలాగే మంజీర పైపులైన్‌ రోడ్డు, ఐటీఐ, గొల్లగూడెం, పాత కంది వరకు ఉన్న 60 ఫీట్ల రోడ్డును 100 ఫీట్లుగా విస్తరిస్తే ఆయా ప్రాంతాల్లోని ఇల్లును కూల్చివేయాలి. 

Updated Date - 2020-09-21T07:20:33+05:30 IST