Advertisement
Advertisement
Abn logo
Advertisement

పొంచి ఉన్న ‘మూడో ముప్పు’!

- రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరిక జాబితాలో జిల్లా పేరు

- పొరుగు రాష్ర్టానికి కొనసాగుతున్న రాకపోకలు

- కొవిడ్‌ నిబంధనలపై పట్టింపు కరువు

- మరికొన్నాళ్ల పాటు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

- జిల్లాలో ప్రస్తుతం అదుపులోనే ఉన్న కరోనా కేసుల తీవ్రత

ఆదిలాబాద్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టిందనుకుంటున్న సమయంలోనే కొత్తగా ఒమిక్రాన్‌ వెరియంట్‌ ముప్పు ముంచుకొస్తున్నట్లు వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వెరియంట్‌ ఇతర దేశాల్లో వెలుగు చూడడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. మొదటి వేవ్‌తో కొంత భయమే కనిపించినా.. సెకండ్‌ వేవ్‌తో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఒకవేళా మూడో వేవ్‌ విరుచుకుపడితే ఏం జరుగుతుందోనన్న భయాందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 5లక్షల 35వేల 250 టెస్టులు చేయగా.. 16వేల 570 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 87 మంది మరణించినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుం ది. కానీ ఈ సంఖ్య 200లకు పైగానే ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే కరోనా కట్టడికి 5లక్షల 18వేల 900ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు. కానీ కొత్త వేరియంట్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం జరుగడంతో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో మళ్లీ జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది. అసలే చలికాలం కావడంతో పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయం జిల్లా వాసులను వెంటాడుతుంది. అయితే మరికొన్నాళ్ల పాటు అప్రమత్తంగా ఉంటేనే కొత్త వేరియంట్‌ల ముప్పుతప్పనుందని అధికారులు పేర్కొంటున్నారు.

వ్యాక్సినేషన్‌ మరింత వేగవంతం

కొత్త వేరియంట్‌ ముప్పు ఉందన్న సమాచారంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. ఇప్పటికే మైదాన ప్రాంతంలో దాదాపుగా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే దశలో కనిపిస్తున్న ఏజెన్సీ గ్రామాల్లోనే వ్యాక్సినేషన్‌కు అంతగా ఆధరణ కనిపించడం లేదు. సోమవారం రాష్ట్ర మంత్రి వర్గం ఒమిక్రాన్‌ వేరియంట్‌ పై చర్చించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా అధికారులను ఆదేశించింది.ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మహాబూబ్‌నగర్‌, నారాయణపేట, గద్వాల్‌ జిల్లాలతో పాటు జిల్లా పై ప్రత్యేకదృష్టిని సారించాలని ఆదేశించారు. ప్రభుత్వం తొలి హెచ్చరికలు చేసిన జిల్లాల జాబితాలో ఆదిలాబాద్‌ జిల్లా పేరు కూడా ఉండడంతో వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమవుతున్నారు. జిల్లా ఆసుపత్రితో పాటు అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సౌకర్యం,బెడ్ల ఏర్పాటు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. అవసరమైన వారందరికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను చేస్తున్నారు. 

పొరుగు రాష్ట్రం ముప్పే ఎక్కువ

జిల్లా సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రతోనే ముప్పు ఎక్కువగా పొంచి ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కరోనా పరిస్థితు లు తగ్గుముఖం పట్టడంతో రవాణా, రాకపోకలు యధావిధిగా సాగుతున్నాయి. నిత్యం మహారాష్ట్ర నుంచి ఎందరో మంది ప్రయాణికులు వైద్యం, వ్యాపారాలు, ఇతర అవసరాల నిమిత్తం జిల్లాకు వస్తూ పోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో ఒకరిద్దరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు జిల్లాలో వదంతులు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పత్తి సీజన్‌ కావడంతో రైతులు పంటను అమ్ముకునేందుకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు నిత్యం వెళ్లి వస్తున్నారు. అలాగే రైల్వే మార్గం గుండా వందలాది మంది కూలీలు జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు వస్తున్నారు. ముఖ్యంగా పాండ్రకవడ, చంద్రాపూర్‌,కిన్వట్‌, నాగ్‌పూర్‌, యవత్‌మాల్‌ లాంటి పట్టణాలకు జిల్లా మీదుగా ఎక్కువగా రాకపోకలు సాగుతున్నాయి. గతంలోను మహారాష్ట్ర నుంచే ఎక్కువ వైరస్‌ వ్యాప్తి జరిగినట్లు గుర్తించిన అధికారులు జిల్లా సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి పకడ్బంధీ జాగ్రత్తలు తీసుకున్నారు.

మాస్కు, భౌతిక దూరాన్నే మరిచిపోయారు

కరోనా వైరస్‌ నుంచి కాపాడుకునేందుకు మాస్కు, భౌతిక దూరం తప్పని సరి అంటూ అధికారులు పదే పదే చెబుతున్నా.. జిల్లా వాసులు మాత్రం తేలికగానే తీసుకుంటూ కొవిడ్‌ నిబంధనను అప్పుడే మరిచి పోతున్నారు. దీంతో కొవిడ్‌కు ముందు పరిస్థితులే కనిపిస్తున్నాయి. పెళ్లిలు, పండుగలకు అందరూ ఒకేచోటకు చేరి సంబరాలు జరుపుకుంటున్నారు. కనీసం మాస్కులైనా ధరించడం లేదు. తరుచు శానిటేషన్‌, భౌతిక దూరం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిబంధనలను అంతగా పట్టించుకోక పోవడంతో ప్రజలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. పాఠశాలలు, సినిమా థియేటర్లు అన్ని రకాల వ్యాపారాలు యధావిధిగా కొనసాగడంతో జన సంచారం పెరిగి వైరస్‌ వ్యాప్తికి అనుకూలంగానే మారింది.

కొత్త వేరియంట్‌పై సమాచారం ఉంది

: డా.రాథోడ్‌నరేందర్‌, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్‌

కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తిపై సమాచారం ఉంది. దీని తీవ్రత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. మిగిలిపోయిన వారందరికి మరింత వేగవంతంగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తాం. కొత్త వేరియంట్‌ను తేలికగా తీసుకోకుండా ప్రతీఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ముప్పువాటిల్లే అవకాశం ఉంటుంది. ఎలాంటి వేరియంట్‌నైనా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది. ప్రజలు మరికొన్నాళ్ల పాటు అప్రమత్తంగా ఉంటే మంచిది. 

Advertisement
Advertisement