వారంలో 14 గంటలు పాఠం చెప్పాల్సిందే

ABN , First Publish Date - 2021-06-19T06:16:50+05:30 IST

ఎస్వీ యూనివర్సిటీలోని అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు వారంలో 14 గంటలు తప్పకుండా పాఠం చెప్పాల్సిందేనని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీష్‌ చంద్ర ఆదేశించారు.

వారంలో 14 గంటలు పాఠం చెప్పాల్సిందే

ఎస్వీయూ ప్రొఫెసర్లకు స్టేట్‌ ఎడ్యుకేషన్‌ సీఎస్‌ ఆదేశం


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జూన్‌ 18: ఎస్వీ యూనివర్సిటీలోని అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు వారంలో 14 గంటలు తప్పకుండా పాఠం చెప్పాల్సిందేనని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీష్‌ చంద్ర ఆదేశించారు. ఎస్వీయూలో బోధన టైమ్‌ టేబుల్‌పై శుక్రవారం ఆయన ఆన్‌లైన్‌ ద్వారా సమావేశమయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6.30 గంటల దాకా ఈ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డితోపాటు ఎస్వీయూ వీసీ రాజారెడ్డి, రెక్టార్‌ సుందరవల్లి, రిజిస్ట్రార్‌ హుస్సేన్‌, వర్సిటీ ఆర్ట్స్‌, సైన్స్‌, ఇంజనీరింగ్‌, కామర్స్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు మురళీధర్‌, సావిత్రమ్మ, నారాయణరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఏ విభాగంలో ఎంతమంది రెగ్యులర్‌ అధ్యాపకులు ఉన్నారంటూ సీఎస్‌ ఆరా తీశారు. వారంలో అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు 14 గంటలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 16 గంటలు పాఠం చెప్పాలని స్పష్టం చేశారు. 14 గంటల్లో ఆరు గంటలు ప్రాక్టికల్స్‌, ఎనిమిది గంటలు థియరీ పనుల్లో నిమగ్నం కావాలని సూచించారు. నిర్దేశించిన క్లాస్‌ వర్క్‌ తర్వాతే ప్రాజెక్టులు, రీసెర్చ్‌లు, సెమినార్ల పనులు చేపట్టాలని చెప్పారు. ఇంజనీరింగ్‌ కాలేజీకి సంబంధించి కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఇద్దరే పర్మినెంట్‌ అధ్యాపకులు ఉన్నారంటూ ఆ విభాగ అధికారి ఒకరు ప్రస్తావించగా, అవసరమైన చోట్ల అడహాక్‌ అధ్యాపకులను నియమిస్తానని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో రెండు వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని పేర్కొన్నారు. అధికారులతోపాటు 173మంది అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T06:16:50+05:30 IST