నలుగురు మత్స్యకారుల గల్లంతు

ABN , First Publish Date - 2020-08-14T10:32:39+05:30 IST

సముద్రంలోకి వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఉప్పాడ శివారు క్రీస్తునగరానికి చెందిన పల్లేటి నూకరాజు ఇంజన్‌బోటుపై వంకా సంజీ

నలుగురు మత్స్యకారుల గల్లంతు

కొత్తపల్లి, ఆగస్టు13: సముద్రంలోకి వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఉప్పాడ శివారు క్రీస్తునగరానికి చెందిన పల్లేటి నూకరాజు ఇంజన్‌బోటుపై వంకా సంజీవి, పిక్కి కాశి, వంకా వెంకన్న, వంకా దుర్గారావు అనే మత్స్యకారులు  ఉప్పాడ-అమీనబాద్‌ మినీ హార్బర్‌ తీరం నుంచి ఈనెల 11న వేటకు వెళ్లారు. వేట ముగించుకొని ఒడ్డుకు వస్తున్న తరుణంలో బోటు ఇంజన్‌ గేర్‌ బాక్స్‌ చెడిపోవడంతో సముద్రం మధ్యలో ఉండిపోయారన్న సమాచారం బుధవారం 12 ఉదయం 8 గం టలకు తమకు చేరిందని, అప్పటినుంచి ఇప్పటివరకు తమకు ఎటువంటి సమాచారం లేదని గ్రామ పెద్దలు తెలిపారు.


ఈదురు గాలుల తీవ్రత వల్ల బోటు కొత్తపట్నం-భైరవపాలెం మధ్యలో గల్లంతై ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోటులో ఉన్నవారి సెల్‌ఫోన్లు పనిచేయడం లేదని, గల్లంతైన వారితోపాటు వేటకు వెళ్లిన బోట్లన్నీ క్షేమంగా తిరిగివచ్చాయని పెద్దలు చెబుతున్నారు. 


హెలికాప్టర్‌ ద్వారా గాలింపు చేపట్టాలి: వర్మ 

మత్స్యకారుల ఆచూకీ కోసం హెలికాప్టర్‌ ద్వారా గాలింపు చర్యలు చేపట్టాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. మత్స్యకారుల గల్లంతై 24 గంటలు దాటినా గాలింపు చేపట్టకపోవడం విచారకరమన్నారు.

Updated Date - 2020-08-14T10:32:39+05:30 IST