Abn logo
Feb 3 2020 @ 18:03PM

‘మూక్‌నాయక్‌’కు వందేళ్లు

కొందరు కాలం కంటె ముందే పుడతారు. సమకాలంలో కంటె భవిష్యత్తులోనే ఎక్కువ ప్రాసంగికత సాధిస్తారు. అటువంటి మహాత్ములలో భీమరావ్‌ రామ్‌జీ అంబేద్కర్‌ ఒకరు. ఆయన జీవితకాలం పోరాడి, సమకాలంలో ప్రజాజీవితంలో కీలకమయిన బాధ్యతలు నెరవేర్చి, ఒక కొత్త ఆలోచనావిధానాన్ని అందించి నిష్క్రమించారు. ఆయన అస్తమించిన తరువాత నాలుగు దశాబ్దాలకు కానీ, భారతదేశం ఆయనను రత్నంగా గుర్తించలేకపోయింది.

 

ఆయన రచనలను ఒకచోట గుదిగుచ్చి అందించలేకపోయింది, అనువదించుకోలేకపోయింది. భారత సామాజికాకాశంలో మబ్బులను చీల్చుకుని అంబేద్కర్‌ తేజస్సు ప్రకాశించడానికి ఆలస్యం జరిగింది కానీ, ఉదయించిన సూర్యుడు చండప్రచండంగా ప్రకాశిస్తూనే ఉన్నాడు, చీకట్లను తరిమేస్తూనే ఉన్నాడు. అయినా, ఇంకా బాబా సాహెబ్‌ను మనం పూర్తిగా తెలుసుకోలేకపోయాము.


 

అంబేద్కర్‌ గురించి పెద్దగా తెలియని, తెలిసినా గుర్తించని పార్శ్వం ఆయనలోని పాత్రికేయుడు. ఆర్థికశాస్త్ర విద్యార్థిగానే ఉన్నత విద్యను అభ్యసించాడు కానీ, దానితోపాటు ఆయన భారతీయ సమాజాన్ని, చరిత్రను, సమకాలీన రాజకీయాలను కూడా అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. చదువు మధ్య వచ్చిన విరామంలో స్వదేశం తిరిగివచ్చిన అంబేద్కర్‌ 1920 జనవరి 31 నాడు ‘‘మూక్‌నాయక్‌’’ అనే మరాఠీ పత్రికను ప్రారంభించాడు. తిరిగి విదేశాలకు వెళ్లవలసిన విద్యార్థిగానే ఉన్నందున ఆ పత్రికకు అధికారికంగా ఆయన ఎడిటర్‌ కాకపోయినా, దానికి రూపకల్పన చేసిందీ, బలహీనుల గొంతుకగా దానిని మలచిందీ అంబేద్కరే.

 

తరువాత, చరిత్రాత్మక ‘మహద్‌’ ఉద్యమ సందర్భంగా ‘బహిష్కృత భారత్‌’ పత్రికను ఆయన ప్రారంభించారు. మొదటి పత్రిక మూడేళ్లే నడిచింది. రెండోది రెండేళ్లకే ఆగిపోయింది. ప్రతిసారీ పత్రిక నిర్వహణ ఆర్థికంగా భారం కావడం, నిరంతరం భరించే దాతలు లభించకపోవడం పత్రికలు ఆగిపోవడానికి కారణాలు. ‘మూక్‌నాయక్‌’ ప్రారంభించడానికి ఆరంభ పెట్టుబడి కింద 1500 రూపాయలను కొల్లాపూర్‌ పాలకుడు ఛత్రపతి సాహు మహరాజ్‌ అందించారు. తరువాత కూడా ఆయన సహాయం అందిస్తూనే వచ్చారు. తరువాత కాలంలో అంబేద్కర్‌ సమత, జనత అనే పత్రికలను కూడా నిర్వహించారు. నిర్యాణం చెందడానికి కొద్ది నెలల ముందు ‘ప్రబుద్ధ భారత్‌’ అన్న పత్రికను ప్రారంభించారు.

 

తన సామాజిక విప్లవాచరణకు పత్రిక అనివార్యమైన సాధనమని అంబేద్కర్‌ భావించారు. ఆనాటికే పత్రికల స్వభావంపైన ఆయనకు తీవ్రమైన అభిప్రాయాలుండేవి. బలవంతులు, అధికుల వాదననే వినిపించే పత్రికలకు పోటీగా, బలహీనుల, దళితుల గొంతును వినిపించాలని ఆయన ఆకాంక్షించారు. మూక్‌నాయక్‌ ప్రారంభసంచికలో ఆయన రాసిన వ్యాసంలోని ఈ వాక్యాలు ఆసక్తికరమైనవి. ‘‘ఒకప్పుడు జర్నలిజం భారతదేశంలో ఒక వృత్తిగా ఉండేది. ఇప్పుడది వ్యాపారంగా మారింది. సబ్బును తయారుచేయడంలో ఎంత నీతి ఉందో, ఈ రంగంలోనూ అంతే ఉంది. అంతకంటె ఎక్కువేమీ లేదు.

 

ఎటువంటి ఉద్దేశాలు లేకుండా, ప్రజలకు మంచిది, శ్రేష్ఠము అనిపించే దృక్కోణం నుంచి నిర్భయంగా ఒక ప్రజావిధానాన్ని ప్రతిపాదించడం, తప్పు, వ్యర్థము అనుకున్న పంథాను నిరాకరించడం తమ ప్రధాన కర్తవ్యాలని పాత్రికేయ వృత్తి అనుకోవడం లేదు. ఎవరో ఒకరిని ఆకాశానికెత్తి వారిని మోసుకుంటూ తిరగడమే దాని పరమధర్మమై పోయింది. ...భారతదేశంలో ఇప్పుడున్నంత వ్యక్తిపూజ ముందెన్నడూ లేదు. అయితే, ఈ ధోరణులకు మినహాయింపుగా కనిపించే పత్రికలు కూడా లేకపోలేదు’’– వంద సంవత్సరాల కింద అంబేద్కర్‌ రాసిన ఈ మాటలు ఇప్పుడు కూడా వర్తించడం విషాదకరం.

 

అంబేద్కర్‌ ఉద్యమజీవన ప్రస్థానానికి ఆయన పత్రికారచనలకు సంబంధం ఉన్నది. ఆయన అనేక తాత్విక, శాస్త్ర విషయాలను ఇంగ్లీషులో రాశారు. ఈ పత్రికలను మాత్రం ఆయన మరాఠీలో సామాన్యుల కోసం ఉద్దేశించారు. 1920లలో అంబేద్కర్‌ గాంధీజీ విషయంలో ఆశావహంగా, సానుకూలంగా వ్యాఖ్యానించేవారు. సహాయనిరాకరణోద్యమాన్ని అంబేద్కర్‌ వ్యతిరేకించారు కానీ, గాంధీ కొన్ని సందర్భాలలో ఛాందస బ్రాహ్మణవ్యవస్థ మీద చేసిన విమర్శలను స్వాగతించారు. 1930లలో అంబేద్కర్‌ పాత్ర దేశరాజకీయాలలో, సామాజికోద్యమాలలో విస్తృతమవుతున్న కొద్దీ గాంధీపై నిశితమైన విమర్శలు పెరిగాయి.

 

గాంధీజీ కూడా పాత్రికేయులే కావడం ఈ సందర్భంగా గమనార్హం. ఇద్దరూ వారి వారి మాతృభాషల్లోనూ, ఇంగ్లీషులోనూ పత్రికారచన చేశారు. గాంధీజీ పత్రికారచనల మాదిరిగానే, అంబేద్కర్‌ పాత్రికేయ రచనలన్నీ అన్ని భాషలలోకి అనువదితమై లభ్యం కావలసి ఉన్నది. ఇప్పటికే అందుబాటులో ఉన్న సంపుటులకు తోడు, ఈ పత్రికల, పత్రికారచనల సంపుటులు భారతీయ సామాజిక ఉద్యమ చరిత్రకు ఎంతో గొప్ప చేర్పు అవుతాయి.

 

ఆధునిక భారత చరిత్రలో ఎంతో కీలకమయిన ‘మూక్‌నాయక్‌’ శతవార్షికోత్సవం సందర్భాన్ని, ‘అంబేద్కర్‌–సైద్ధాంతిక జర్నలిజం’ అన్న జాతీయసదస్సుతో నిర్వహిస్తున్న తెలంగాణ విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖను అభినందించవలసి ఉన్నది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా ఈ సందర్భంలో పెద్ద కార్యక్రమం త్వరలో జరుపనున్నది. వారికి ముందస్తు అభినందనలు.

Advertisement
Advertisement
Advertisement