ప్రతిరోజూ మిషన్‌ భగీరథ తాగునీరు అందించాలి

ABN , First Publish Date - 2020-05-09T10:12:32+05:30 IST

జిల్లాలోని ప్రజలకు వేసవిలో ప్రతిరోజూ మిషన్‌ భగీరథ తాగునీరు సరఫరా చేస్తామని కలెక్టర్‌ కె శశాంక

ప్రతిరోజూ మిషన్‌ భగీరథ తాగునీరు అందించాలి

కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, మే 8 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): జిల్లాలోని ప్రజలకు వేసవిలో ప్రతిరోజూ మిషన్‌ భగీరథ తాగునీరు సరఫరా చేస్తామని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మిషన్‌ భగీరథ, నీటి సరఫరాపై ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ఎన్ని గ్రామాలలో ప్రతి రోజు తాగునీరు ఇస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఒక్కొక్క గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉన్నవి, ఎన్ని ఇళ్లకు నీరు ఇస్తున్నారు తదితర వివరాలు ఇంజనీరింగ్‌ అధికారులు, గ్రామ సర్పంచ్‌ల సహకారంతో కనుక్కోవాలని అన్నారు.


ఇంకా పూర్తికాని ట్యాంకులను, పైపులైన్‌ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో ట్రయల్‌ రన్‌నిర్వహించాలని అన్నారు. ప్రెషర్‌ తక్కువగా ఉన్న పైపులైన్లను సరి చేయాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి భగీరథ కనెక్షన్లను ఇవ్వాలన్నారు. నల్లా బిల్లులను ప్రతి నెల క్రమం తప్పకుండా వసూలు చేయాలని అన్నారు. ట్యాంకులను శుభ్రంగా ఉంచుటతో  పాటు వాటర్‌ శాంపిల్స్‌ను ఎప్పటికప్పడు పరిశీలించాలన్నారు. టీంలను ఏర్పాటుచేసుకొని మేజర్‌, మైనర్‌ రిపేర్లను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.


స్మార్ట్‌ రోడ్ల నిర్మాణం చేపట్టాలి..

రోడ్లపై నీరు నిలవకుండా స్మార్ట్‌రోడ్ల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్‌ శశాంక అన్నారు. శుక్రవారం నగరపాలకసంస్థ కమిషనర్‌ క్రాంతితో కలిసి నూతనంగా నిర్మిస్తున్న స్మార్ట్‌ రోడ్డు పనులను పరిశీలించారు. ఇంజనీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారులతో నగరంలోని మల్కాపూర్‌, కలెక్టరేట్‌ రోడ్‌విడ్త్‌కు సంబంధించి మ్యాప్‌ ప్రకారం కొలతలు వేయించారు. అనంతరం అధికారులకు, ఆర్వీ బృందం, కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ కె శశాంక మాట్లాడుతూ స్మార్ట్‌ రోడ్లలో ఫుట్‌పాత్‌ విడ్త్‌, ఎంఎఫ్‌ జోన్‌ విడ్త్‌ సరిగా మేయింటేన్‌ చేయాలని ఆదేశించారు. పైపులైల్‌ కనెక్షన్‌, యుజీడీ కనెక్షన్స్‌ సరిగా ఉన్నాయా లేదా సరిగా చూడాలన్నారు. మల్కాపూర్‌, కలెక్టరేట్‌ రోడ్‌లో నివాస గృహలు ఉన్నచోట ఎన్‌ఎంటీజోన్‌, ఎంఎఫ్‌ జోన్‌ ఫుట్‌పాత్‌ టైల్స్‌, ఫెవర్‌ బ్లాక్స్‌ వేసి చూపించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

Updated Date - 2020-05-09T10:12:32+05:30 IST