సీఎం జగన్‌ రికార్డు సృష్టించారు: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ABN , First Publish Date - 2021-09-02T06:49:28+05:30 IST

‘వెలిగొండతో సహా రాష్ట్రంలోని..

సీఎం జగన్‌ రికార్డు సృష్టించారు: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నారాయణ

రాజకీయ పరిష్కారమే శరణ్యం

షర్మిల పార్టీ పెట్టడమే జల జగడాలకు కారణం

మంత్రులు గౌతమ్‌రెడ్డి,  బొత్స వ్యాఖ్యలు దారుణం

అంబానీ, అదానీలకు దేశాన్ని దోచిపెడుతున్న మోదీ

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు


ఒంగోలు: ‘వెలిగొండతో సహా రాష్ట్రంలోని నీటి జగడాలు అన్నింటికీ రాజకీయ పరిష్కారమే శరణ్యం. న్యాయస్థానాలు కేవలం సూచనలు, సలహాలు మాత్రమే ఇస్తాయి. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అంట. ఇక ఎన్నికలు ఎందుకు, శాసన, కార్య, న్యాయవ్యవస్థలు ఎందుకు. ఇలాంటి అర్థరహిత వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి గౌతమ్‌రెడ్డిపై తక్షణమే ముఖ్యమంత్రి జగన్‌ చర్యలు తీసుకోవాలి. ఉత్తరాంధ్రలో బొత్స ఉనికి కోల్పోయేసరికి రాజధాని రైతుల సమస్యలపై చర్చలు జరపననే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం వల్లే సీఎం కేసీఆర్‌ జల వివాదాలను ముందుకు తెచ్చారు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


స్థానిక మల్లయ్యలింగం భవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల వెలిగొండ భవితవ్యం కూడా ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర గెజిట్‌లో వెలిగొండను చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. కరోనా కాలంలో అత్యధిక కాలం హోంక్వారంటైన్‌లో ఉండి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. దేశాన్ని మోదీ.. అంబానీ, అదానీలకు ధారాదత్తం చేయడానికి కంకణం కట్టుకున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్‌.నారాయణ తదితరులు పాల్గొన్నారు. మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 25న 19 రాజకీయ పార్టీల విపక్ష కూటమి భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిందని కార్యదర్శి నారాయణ తెలిపారు. విలేకరుల సమావేశానికి ముందు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా నారాయణ కలిశారు.


Updated Date - 2021-09-02T06:49:28+05:30 IST