నాడు గూడు.. నేడు గోడు

ABN , First Publish Date - 2020-07-07T10:37:12+05:30 IST

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద మంజూరైన ఇళ్లకు బ్రేకులు పడ్డా యి. నవరత్నాల అమలు పేరుతో గత ప్రభుత్వ హయం లో

నాడు గూడు.. నేడు గోడు

నిర్మాణాలు చేపట్టని జీప్లస్‌త్రీ ఇళ్లు నిలిపివేత

జిల్లాలో 3వేల గృహాలు రద్దు

మా సంగతేంటి అంటున్న  లబ్ధిదారులు 

అధికారుల నుంచి  సమాధానం కరువు 

ప్రత్యామ్నాయంగా  ఇళ్ల స్థలాల్లోనూ మొండిచేయి 

ఆందోళనకు దిగిన పేదలు 


పేదల సొంతింటి కలను ప్రభుత్వం కూల్చేసింది. ఇల్లు మంజూరై ఏడాదిగా గృహ ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలపై బండ వేసింది.  గత ప్రభుత్వ హయాంలో లాటరీ ద్వారా పొందిన జీప్లస్‌త్రీ గృహాలు ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో లబ్ధిదారుల్లో గగ్గోలు మొదలైంది. ప్రారంభించని నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశించడంతోపాటు, వాటా సొమ్మును తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించడం వారిని మరింత కలవరపెడుతోంది. గృహాలు రద్దయిన వారికి ప్రభుత్వం తాజాగా ఇవ్వనున్న ఇళ్లస్థలాల్లో ప్రాధాన్యమిస్తామని పేర్కొన్న అధికారులు ఇప్పుడు కుదరదని, రెండో జాబితాలో చూస్తామని చెప్పడంపై లబ్ధిదారులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో లాటరీ ద్వారా గృహాలు పొందిన వారికి అన్యాయం జరగకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు. వారంతా సోమవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు.


ఒంగోలు (కార్పొరేషన్‌) జూలై 6 :ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద మంజూరైన ఇళ్లకు బ్రేకులు పడ్డా యి. నవరత్నాల అమలు పేరుతో గత ప్రభుత్వ హయం లో మంజూరైన సంక్షేమ పథకాలను రద్దుచేస్తున్న ప్రస్తు త ప్రభుత్వం జి+3 గృహాలపైనా దృష్టిసారించింది. ఈ మేరకు టీడీపీ ప్రభుత్వంలో మంజూరై, బేస్‌మెంట్‌  పను లు కూడా ప్రారంభం కాని ఇళ్లను రద్దు చేసింది. ఈమే రకు జీవో నెం.640 జారీ చేసింది. దీంతో జిల్లాలో 3,024 ఇళ్లు రద్దు కానున్నాయి. కాగా ఇప్పటికే పూర్తయిన గృహా లను లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు యథావిధిగా కేటాయించనుండగా,  పనులు ప్రారంభంకాని గృహాలను రద్దు చేయనున్నారు. మొత్తంగా ఆధునిక హంగులతో అం దరికీ ఇళ్లు పథకాన్ని గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేప ట్టగా, రివర్స్‌ టెండర్ల పేరుతో ప్రస్తుత ప్రభుత్వం ఏడాది గా నిలిపివేసింది. పనులు పునఃప్రారంభమవుతాయని అంతా భావించగా ప్రారంభం కాని ఇళ్ల నిర్మాణాలను పూ ర్తిగా రద్దు చేసి పేదలకు షాక్‌ ఇచ్చింది. 


3,024 ఇళ్లు రద్దు 

ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 12,928 ఇళ్లు పూర్తి కాగా, 3,024 రద్దు కా నున్నాయి. ఒంగోలులో చింతల వద్ద 1,488 గ్రౌండింగ్‌ కాగా, 48 ఇళ్లు రద్దు జాబితాలో చేయాలి. అలాగే కొప్పో లు వద్ద 4,416 ఇళ్లు పూర్తికాగా 1,725 ఇళ్లు రద్దుకాను న్నాయి. కందుకూరులో ఉప్పుచెరువు-1 వద్ద నిర్మించిన 1,408 ఇళ్లు ఉప్పుచెరువు వద్ద నిర్మించిన 336 గృహాలను లబ్ధిదారులకు కేటాయించనున్నారు. మార్కాపురంలో పెద నాగులవరం రోడ్‌లో 1,920 ఇళ్లు కేటా యించగా వాటిలో 1,008 రద్దుకానున్నాయి. కనిగిరిలో చాకిరాల వద్ద నిర్మా ణం చేపట్టిన 912గృహాలు పూర్తికా వడంతో లబ్ధిదారులకు కేటాయించనున్నారు. గిద్దలూరులో మోదేపల్లి వద్ద నిర్మా ణం చేపట్టిన 1,392గృహాలు లబ్ధిదారులకు  ఇవ్వనున్నారు. మరో 144ఇళ్లు బేస్‌మెంట్‌ పనులు కూడా జరగకపోవడం తో వాటిని రద్దు చేశారు. అద్దంకి పరిధిలో శింగరకొండ వద్ద 1,056 గృహాలు పనులు జరుగుతుండగా, 96ప్లాట్ల పనులు ప్రారంభం కాకపోవడంతో వాటిని నిలిపివేశారు. అయితే చీమకుర్తి, చీరాలలో జీప్లస్‌త్రీ నిర్మాణాలు చేప ట్టలేదు. ఆ గృహాలన్నీ రద్దయినట్లే.


ఒంగోలులో లబ్ధిదారుల ధర్నా

గత ప్రభుత్వ హయాంలో గృహం మంజూరై ఇప్పుడు జాబితాల నుంచి తొలగించిన పలువురు లబ్ధిదారులు సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ధర్నాకు దిగారు. అనంతరం కమిషనర్‌ను కలిశారు. ‘వేల రూపాయలు చెల్లించాం. నాడు ఇల్లు మంజూరైంది. ఇప్పుడు లేదు పొమ్మంటున్నారు. మా పరిస్థితి ఏమిటి’ అని వాపోయారు. ఏడాదిగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్నామని, వారం క్రితం వరకూ జాబితాలో ఉన్న పేర్లు ఇప్పుడు మాయమయ్యాయని   ఫిర్యాదు చేశారు. అప్పులు చేసి మరీ వాటా సొమ్ము చెల్లించామని, ఇప్పుడు అధికార పార్టీ నాయకుల కోసం పేర్లు తారుమారు చేసి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యరజర్ల వద్ద మంజూరు చేసే ఇళ్ల స్థలాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 


టీడీపీ నిరసన 

ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతిని ఎత్తిచూపుతూ టీడీపీ నాయకులు ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని దుయ్య బట్టారు. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం లబ్ధిదారులకు వెంటనే పెండింగ్‌ బిల్లులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో దళితుల భూములు, గ్రామ కంఠాలు, కొండ గుట్టలను చదును చేసి కోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా వైసీపీ నాయకులు దాదాపు రూ. 1600 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.


ఇళ్ల స్థలాలను కూడా అర్హులకు కాకుండా వైసీపీ నేతలు సిఫారసు చేసిన వారికి కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. జీ+3 గృహాలను గతంలో ఎంపికైన లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ, కామేపల్లి శ్రీనివాసరావు, డాక్టర్‌ గుర్రాల రాజ్‌విమల్‌, బండారు మదన్‌, నండూరి చంద్ర  పాల్గొన్నారు. 


ఆందోళనలో లబ్ధిదారులు 

హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ పథకం కింద మార్కాపురం పట్టణానికి 3600 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో మొదటిదశలో 1,920 నిర్మించాలని నిర్ణయించారు. అందుకోసం పెద్దనాగులవరం రోడ్డులో 19ఎకరాలను సేకరించారు. అందులో జీప్లస్‌3 ఇళ్ల నిర్మాణం కోసం 9.12 ఎకరాలను కేటాయించారు. అక్కడ 2019 ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎల్‌అండ్‌టీ రూ. 5.80 కోట్లతో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అక్కడ ఏర్పాటు చేసుకుంది. ఇంతలో ఎన్నికలు రావడంతో బ్రేక్‌ పడింది. ఇంతటి బృహత్తర పథకం ప్రారంభమై ఏడాది కావొస్తున్నా పునాదుల స్థాయి దాటలేదు. తాజాగా వాటిని పూర్తిగా రద్దుచేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తాము ప్రభుత్వానికి చెల్లించిన వాటా ధనాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-07-07T10:37:12+05:30 IST