Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెచ్చిపోతున్న ‘బయో’ మాఫియా

ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం కంచికంటి గ్రామంలో నకిలీ బయో మందును పిచికారి చేయడంతో ఎండిన శనగ పంట

జిల్లాలో విచ్చలవిడిగా నకిలీ మందుల అమ్మకాలు

వ్యాపారులను నమ్మి నిండా నష్టపోతున్న రైతులు

క్షేత్రస్థాయిలో కరువైన అధికారుల సలహాలు, సూచనలు

మొద్దునిద్రలో వ్యవసాయ శాఖ  

జిల్లావ్యాప్తంగా రైతాంగం కుదేలు

ఆదిలాబాద్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బయో మందుల మాఫియా ఆగడాలకు అడ్డూ, అదుపే లేకుండా పోతోంది. అమాయక రైతులకు నకిలీ పురుగు మందులను అంటగడుతూ అందినకాడికి దండుకుంటున్నారు. పంటల సాగులో అన్న దాతలకు అండగా నిలవాల్సిన వ్యవసాయ శాఖాధికారులు పత్తా లేకుం డా పోవడంతో వ్యాపారులే ఇష్టారాజ్యంగా పురుగు మందు విక్రయాలు జరుపుతున్నారు. క్రమం తప్పకుండా ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీలు చేయాల్సిన అధికారులు నెలనెలా అందుతున్న మాముళ్లతోనే సరిపెట్టుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. యాసంగి సీజన్‌లో అధికంగా సాగు చేసే శనగ పంటను చీడపీడలు ఆశించడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 80వేల ఎకరాలలో శనగ పంట సాగవుతున్న ట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ దానికనుగుణంగా చర్యలు చేపట్టక పోవడంతో అన్నదాతలు నిండా మునుగుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం కచికంటి గ్రామానికి చెందిన దత్తాత్రేయ అనే రైతు జిల్లా కేంద్రంలోని శ్రీబాలాజి ఫర్టిలైజ ర్‌ దుకాణం నుంచి పురుగుల మందును కొనుగోలు చేసి పిచికారి చేయడంతో పంట పూర్తిగా ఎండిపోయి నేలపాలైంది. ఇలా జిల్లాలో మరికొంత మంది రైతులు నష్టపోయిన దాఖలాలున్నాయి. ఇలాంటి సంఘటన లు జిల్లాలో తరచుగా వెలుగుచూస్తున్న, అధికారులు మాత్రం ఎంతో కొంత సెటిల్‌ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. నకిలీ మందులు విక్రయించిన వ్యాపారి ఆచూకీ తెలిసినా.. అధి కారులు మాత్రం నామమాత్రంగానే చర్యలు తీసుకుని వదిలేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. గతం లోనే బేల మండలంలో నకిలీ బయోమందుల గుట్టు రట్టయిన పొంతన లేని సమాధానం చెబుతూ అధికారులు తప్పించుకోవడంతో  బయో మాఫియా ఆగడాలకు మరో రైతు బలయ్యాడు. జిల్లాలో ప్రతి యేటా నకిలీ పురుగు మందుల వ్యవహారం వెలుగు చూస్తున్నా.. వ్యవసాయ శాఖాధికారులు మొద్దునిద్రలోనే కనిపిస్తున్నారు. ఆదిలాబాద్‌ ఏడీఏ పనితీరుపై గత కొంత కాలంగా విమర్శలు వస్తున్నా.. కొంద రు అధికార పార్టీ నేతల సహకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విధుల్లో కొనసాగుతున్నారనే విమర్శలు లేకపోలేదు.

వ్యాపారులు ఇచ్చిందే మందు

పంటలను చీడపీడలు ఆశించడంతో రైతులు వ్యాపారులనే ఆశ్రయించడంతో వారిచ్చిందే పురుగుమందుగా మారుతుంది. పంటలను ఏ మాత్రం పరిశీలన చేయకుండానే కొందరు వ్యాపారులు పురుగు మందులను విక్రయిస్తున్నారు. నాణ్యత, పనితనంతో సంబంధం లేకుండానే ఎక్కువ లాభాలు వచ్చే పురుగు మందులనే అమ్మేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని సందర్భాల్లో కాలం చెల్లిన పురుగు మందులను రైతులకు అంటగడుతున్నారనే ఆరోపణలున్నాయి. గత ఆరు నెలలక్రితం బేల మండల కేంద్రంలో ఇంట్లోనే బయమోమందులను తయారు చేస్తూ ఓ వ్యాపారి పట్టుబడిన విషయం తెలిసిందే. అయినా బయో మందుల అమ్మకాలను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లావ్యాప్తంగా బయోమందుల వ్యాపారులు ఓ మాఫియాగా ఏర్పడి అధికారులకు నెలనెలా ఎంతో కొంత ముట్టచెప్పడంతోనే సైలెంట్‌ అయిపోతున్నారనే ఆరోపనలు వస్తున్నాయి. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న నకిలీ మందుల వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

పత్తా లేకుండా పోతున్న అధికారులు

వ్యవసాయ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు అందించాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు పత్తాలేకుండా పోతున్నారని రైతులు మండిపడుతున్నారు. సాగు అనుభవంతోనే రైతులు పురుగు మందులను పిచికారి చేసుకుంటు నష్టపోతున్నారు. పంటలను ఆశిస్తున్న తెగుళ్లకు ఏ మందును పిచికారి చేయాలో తెలియక  సతమతమవుతున్నారు. కొంత మంది రైతులు వ్యవసాయ శాఖాధికారులను ఫోన్‌లో సంప్రదిస్తున్నా.. స్పందించడం లేదంటూ వాపోతున్నారు. గత్యంతరం లేకనే ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించడంతో నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. నిత్యం గ్రామాల వారీగా క్షేత్రస్థాయి అధికారులు పంటలను పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాని ఏదో సర్వేల పేరు చెబుతూ అధికారులు తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిగ్రామాల్లో వ్యవసాయ శాఖాధికారి ఎవరో తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే స్పష్టమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేపట్టినా.. ప్రయోజనమే లేదంటున్నారు. ఏదో అడపాదడపగా గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు ఒకరిద్దరు రైతులను పలుకరిస్తూ తిరుగుముఖం పడుతున్నట్లు రైతులు చెబుతున్నారు.

వ్యాపారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి

: బాలూరి గోవర్ధన్‌రెడ్డి, రైతు సంఘం నేత, ఆదిలాబాద్‌

రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది వ్యాపారులు నకిలీ పురుగు మందులను అంటగడుతున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జైనథ్‌, బేల, ఆదిలాబాద్‌ మండలాల్లో జోరుగా బయోమందుల పేరిట వ్యాపారులు దోపిడీకి ఎగబడుతున్నారు. ఇటీవల కచికంటి గ్రామానికి చెందిన రైతుకు బయోపురుగు మందులను అమ్మడంతో పది ఎకరాల శనగ పంట పూర్తిగా ఎండిపోయి నష్ట పోవాల్సి వచ్చింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే రైతులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

నష్టపరిహారం అందేలా చూస్తాం

: అష్రఫ్‌ హైమద్‌, ఏవో, ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం

మండలంలోని కచికంటి గ్రామానికి చెందిన రైతు శనగ పంటకు పురుగుల మందును పిచికారి చేయడంతో పంట పూర్తిగా ఎండిపోయిం ది. ఇప్పటికే వ్యవసాయ శాస్త్రవేత్తలతో పంటను పరిశీలించడం జరిగింది. సంబంధిత వ్యాపారితో మాట్లాడి రైతుకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం. ఫర్టిలైజర్‌ యజమానిపై చర్యలు తీసుకోవడం పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పది ఎకరాలలో ఎనిమిది ఎకరాలు పంటకు నష్టం జరిగింది. తిరిగి పంటను వేసుకునేందుకు శనగ విత్తనాలను అందిస్తున్నాం. 

Advertisement
Advertisement