ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే విశాఖలో పాలన

ABN , First Publish Date - 2021-08-16T05:58:02+05:30 IST

‘‘రాష్ట్రంలో అన్ని..

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే విశాఖలో పాలన
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తున్న మంత్రి కన్నబాబు, కలెక్టర్‌, ఎస్పీ, పోలీస్‌ కమిషనర్‌

సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధికి పెద్దపీట

వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం

మూడుచోట్ల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కులు

జిల్లాలో 234.67 లక్షల ’ఉపాధి’ పని దినాలు

100 రోజుల పని కల్పనలో జిల్లాకు రెండోస్థానం

రూ.343 కోట్లతో విశాఖ-చెన్నై పెట్రో కారిడార్‌లో రోడ్డు

వచ్చే ఏడాది జూన్‌ కల్లా 67,436 ఇళ్ల నిర్మాణం పూర్తి

రూ.2,697 కోట్ల పెట్టుబడులతో 267 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు

రూ.97 కోట్లతో కైలాసగిరి వద్ద ప్లానిటోరియం 

స్వాతంత్య్ర దినోత్సవంలో జిల్లా ఇన్‌చార్జిమంత్రి కురసాల కన్నబాబు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి)‘‘రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఉత్తరాంధ్రను మరింత అభివృద్ధి చేయడానికి విశాఖలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో పలు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా విశాఖ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడానికి భారీ ప్రణాళికలను అమలు చేస్తున్నాం’’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. నగరంలోని పోలీస్‌ బ్యారెక్స్‌ మైదానంలో ఆదివారం జరిగిన 75వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో గత ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాబోయే కాలంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు.


సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, సమాజంలో అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ‘‘స్వాతంత్య్ర ఉద్యమంలో జిల్లా నుంచి చురుకైన పాత్ర పోషించిన అల్లూరి సీతారామరాజు, బీఎస్‌.శర్మ, తెన్నేటి విశ్వనాథం, దిగుమర్తి రామస్వామి, ఇతర సమరయోధులకు శిరస్సు వంచి అంజలి ఘటిద్దాం.... త్యాగధనుల కలలు సాకారం చేయడానికి మనవంతు బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తూ రాష్ట్రాభివృద్ధి తద్వారా దేశాభివృద్ధికి పునరంకితం అవుదాం’’ మంత్రి కన్నబాబు పిలుపునిచ్చారు. 


వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి కన్నబాబు చెప్పారు. వైఎస్సార్‌ రైతు భరోసా/ పీఎం కిసాన్‌ పథకం కింద ఈ ఏడాది జిల్లాలో 3,89,340 మంది రైతులకు రూ.264 కోట్లు సాయంగా అందించామన్నారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య ఉత్పత్తులకు అధిక ఆదాయం వచ్చేలా విశాఖలో ఆక్వా ప్రొసెసింగ్‌, అనకాపల్లిలో బెల్లం ఆధారిత ఫుడ్‌ ప్రాసెసింగ్‌, అరకులో కాఫీ, గిరిజన ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 1.75,435 హెక్టార్లలో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇంత వరకు 60,161 హెక్టార్లలో పంటలు వేశారని వెల్లడించారు. 88,552 ఎకరాల్లో ఈ-క్రాప్‌ నమోదైందన్నారు.


ఏజెన్సీలో 1.58 లక్షల ఎకరాల్లో కాఫీ తోటల సాగు ద్వారా 1.5 లక్షల మంది గిరిజనులు లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో 11 వేల మంది రైతుల నుంచి 1.2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.221 కోట్లు చెల్లించామన్నారు. ‘జగనన్న పాల వెల్లువ-ఏపీ అమూల్‌ ప్రాజెక్టు’ ద్వారా రైతుల నుంచి సేకరించే పాలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఇప్పటి వరకు 233 గ్రామాల్లో సర్వే చేపట్టినట్టు మంత్రి వివరించారు. జగనన్న పాల వెల్లువ కింద 4,990 పాడి పశువుల యూనిట్లు, జగనన్న జీవ క్రాంతిలో 3,918 గొర్రెలు/మేకల యూనిట్లు అందజేశామన్నారు. రూ.150 కోట్లతో అచ్యుతాపురంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు కన్నబాబు తెలిపారు. 


డ్వాక్రాలకు త్వరలో రెండో విడత రుణమాఫీ

జిల్లాలో 56,351 స్వయంశక్తి సంఘాల్లో 6,20,589 మంది మహిళా సభ్యులకు పలు రకాల పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించామన్నారు. డ్వాక్రా సంఘాలకు తొలివిడతగా రూ.296 కోట్ల రుణమాఫీ చేశామని, త్వరలో రెండో విడత రుణమాఫీకి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. 


234.67 లక్షల ’ఉపాధి’ పని దినాలు

ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 234.67 లక్షల పని దినాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 183.45 లక్షల పని దినాలు కల్పించి రూ.410.37 కోట్లను వేతనాల కింద పంపిణీ చేశామన్నారు. 100 రోజుల పని దినాల కల్పనలో రాష్ట్రంలో విశాఖ జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో ఈ ఏడాది 2.77 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. నాడు-నేడు పథకం కింద 1,130 పాఠశాలల్లో వసతుల కల్పనకు రూ.315 కోట్లు ఖర్చు చేశామని ఆయన చెప్పారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద మంజూరైన 67,436 ఇళ్ల నిర్మాణాలను 2022 జూన్‌నాటికి పూర్తిచేస్తామన్నారు. 


మాతాశిశు మరణాల నివారణకు కృషి 

గిరిజన గ్రామాల్లో డోలీల మోతల, మాతాశిశు మరణాల నివారణకు కృషి చేయడంతోపాటు అంబులెన్స్‌ల ఏర్పాటు, డాక్టర్లు, వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. వైఎస్సార్‌ ఆరోగశ్రీ పథకం కింద 50 కార్పొరేట్‌ ఆస్పత్రుల ద్వారా 42,264 మందికి పలు రకాల శస్త్ర చికిత్సల కోసం రూ.117.30 కోట్లు ఖర్చు చేశామన్నారు. కొవిడ్‌తో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన 32 మంది పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా అందజేశామన్నారు. 


పరిశ్రమలతో ఉపాధి

చెన్నై-విశాఖ కారిడార్‌లో 13.78 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణానికి రూ.343 కోట్లతో ప్రతిపాదించామని చెప్పారు. రూ.2,697 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న 267 చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో 31 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మరో రూ.45,954 కోట్ల పెట్టుబడితో 39 భారీ పరిశ్రమలు రాబోతున్నందున లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు.


నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు...

కైలాసగిరి వద్ద రూ.97 కోట్లతో ప్లానిటోరియం నిర్మాణానికి ప్రతిపాదించామని మంత్రి కన్నబాబు చెప్పారు. రూ.88 కోట్లతో నేచురల్‌ హిస్టరీ పార్కు అండ్‌ మ్యూజియం రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌కు డీపీఆర్‌ సిద్ధమైందన్నారు. కాపులుప్పాడలో 17 ఎకరాల్లో ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా 2020లో జీవీఎంసీ 9వ స్థానంలో నిలిచి, ‘గార్బేజ్‌ ఫ్రీ సిటీ’లో త్రీ స్టార్‌’ రేటింగ్‌ సాధించిందన్నారు. భారత ప్రభుత్వం గుర్తించిన ఆకర్షణీయ నగరాల్లో విశాఖకు 8వ స్థానం వచ్చిందన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.371 కోట్లతో నగరంలో పలు పనులు పూర్తిచేశామన్నారు. రూ.92 కోట్లతో రుషికొండలో బీచ్‌ రిసార్ట్స్‌ పునర్‌నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి చొప్పున నైపుణ్యాభివృద్ధి కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-16T05:58:02+05:30 IST