రయ్‌..రయ్‌

ABN , First Publish Date - 2020-06-01T09:44:58+05:30 IST

కరోనా దారి కరోనాదే.. వాహనాల దారి వాహనాలదే అన్నట్టుగా తయారయింది రద్దీ.

రయ్‌..రయ్‌

సడలింపులతో జిల్లాలోకి ప్రైవేటు వాహనాల జోరు

టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన రద్దీ

నేటి నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీ


ఏలూరు, మే 31(ఆంధ్రజ్యోతి): కరోనా దారి కరోనాదే.. వాహనాల దారి వాహనాలదే అన్నట్టుగా తయారయింది రద్దీ. జిల్లాలో కరోనా కేసులు సెంచరీ మార్కును దాటిన నేపథ్యంలో వాహనాల రద్దీ మరింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అంతర్‌ జిల్లా ప్రయాణాలకు అనుమతులను మినహాయించడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. గడిచిన రెండు నెలల్లో కలపర్రు టోల్‌గేట్‌ వద్ద నమోదైన వాహనాల్లో 90 శాతం సరుకు రవాణా వాహనాలు కాగా, ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న వాహనాల్లో 80 శాతంపైగా ప్రైవేటు రవాణా వాహనాలే. కార్లు, పెద్ద లారీలు, వలస కార్మికుల బస్సులు, విపరీతంగా పెరిగాయి.


లాక్‌డౌన్‌ సమయంలో రోజుకు వెయ్యి కార్లు రాకపోకలు సాగించగా ప్రస్తుతం ఆ సంఖ్య మూడు వేలపై చిలుకుకు చేరింది. 1500లుగా ఉన్న భారీ వాహనాల సంఖ్య రెండున్నర వేలకు చేరింది. ద్విచక్ర వాహనాలు వేల సంఖ్యలో జిల్లాలోకి రాకపోకలు సాగిస్తున్నాయి. వీరు జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారనే విషయం తెలియడం లేదు. పైగా వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు జరగడం లేదు. ఇదే జిల్లా వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. కొవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి, కొవిడ్‌ కేసులు విపరీ తంగా పెరుగుతున్న తూర్పు గోదావరి జిల్లా నుంచి రాకపోకలు పెరగడం కరోనా వ్యాప్తిపై మళ్లీ కలవరం మొదలయింది. 


నేటి నుంచి లైసెన్స్‌ల జారీ

నేటి నుంచి జిల్లాలో వాహన చోదకులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు జారీ చేయనున్నట్టు రవాణా శాఖ ఉప కమిషనర్‌ పురేంద్ర ఆంధ్రజ్యోతితో చెప్పారు. జనతా కర్ఫ్యూ జరిగిన మార్చి 22న నిలిపివేసిన లైసెన్సు పరీక్షల ప్రక్రియ దాదాపు 70 రోజుల తర్వాత తిరిగి ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లా లోని అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లో సోమవారం నుంచి లైసెన్సు పరీ క్షలు జరుగుతాయన్నారు. అయితే లైసెన్సు స్లాట్ల సంఖ్యను మూడోవంతుకు తగ్గించినట్టు తెలిపారు.


కలపర్రు టోల్‌గేట్‌ వద్ద శనివారం  నమోదైన వాహనాల వివరాలు

వాహనం లాక్‌డౌన్‌లో ప్రస్తుతం

కారు 1297 3122

గూడ్స్‌ క్యారీయర్‌ 2423 1623

చిన్న లారీలు   42 514

పెద్ద లారీ / బస్సు   50 1006

భారీ వాహనాలు 1579 2424

మొత్తం 5391 8689

Updated Date - 2020-06-01T09:44:58+05:30 IST