పార్లమెంటులో అదే గందరగోళం

ABN , First Publish Date - 2021-07-31T07:19:11+05:30 IST

పెగాసస్‌ నిఘా, సాగు చట్టాలపై ప్రతిపక్షాల నిరసన ధ్వనుల మధ్య పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మరో వారం కొట్టుకుపోయాయి.

పార్లమెంటులో అదే గందరగోళం

  • 9వ రోజూ  ప్రతిపక్షాల నిరసనలు
  • సోమవారానికి ఉభయసభలు వాయిదా


న్యూఢిల్లీ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): పెగాసస్‌ నిఘా, సాగు చట్టాలపై ప్రతిపక్షాల నిరసన ధ్వనుల మధ్య పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మరో వారం కొట్టుకుపోయాయి. శుక్రవారం తొమ్మిదో రోజు కూడా సభ్యుల ఆందోళన కొనసాగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాలు వెల్‌ లోకి దూసుకురావడంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందని కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి విమర్శించారు. కొద్దిసేపు ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించిన స్పీకర్‌ ఓం బిర్లా.. తొలుత మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభయ్యాక.. పెగాసస్‌, సాగు చట్టాలు, కొవిడ్‌-19పై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ గందరగోళం మధ్యే ఢిల్లీలో వాయునాణ్యత కమిషన్‌ బిల్లును, జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నిరసన తెలుపుతున్న సభ్యులను తమ స్థానాల వద్దకు వెళ్లాల్సిందిగా స్పీకర్‌గా వ్యవహరించిన రాజేంద్ర అగర్వాల్‌ పలుమార్లు సూచించారు. అయినా వెనక్కి వెళ్లకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా అదే పరిస్థితే కొనసాగింది. నిరసన తెలుపుతున్న సభ్యుల్లో కొందరు ఈలలు వేయడం పట్ల రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. గందరగోళం మధ్యే కార్పొరేట్‌ వ్యవహారాల మత్రి ఇందర్‌ జిత్‌సింగ్‌.. లిమిటెడ్‌ లయబిలిటీ భాగస్వామ్య బిల్లును, ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కర్నాడ్‌.. డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు. 


ఆక్సిజన్‌ అందక ఎవరూ చనిపోలేదట!

దేశంలో కొవిడ్‌ మరణాలపై ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ రాజ్యసభలో చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసింది. కాంగ్రెస్‌ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ వేసిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. దేశంలో కొవిడ్‌ రోగులెవరూ ఆక్సిజన్‌ అందక చనిపోలేదని తెలిపారు. దీంతో మంత్రి సభను తప్పుదారి పట్టించారంటూ వేణుగోపాల్‌ సభా హక్కుల నోటీసు ఇచ్చారు. దీనిపై స్పందించాల్సిందిగా చైర్మన్‌ వెంకయ్యనాయుడును కోరారు. 

Updated Date - 2021-07-31T07:19:11+05:30 IST