Abn logo
May 23 2020 @ 05:04AM

భద్రత గాలికి...బస్సుదిగి నేరుగా బోగీల్లోకే..

శానిటైజర్‌కూ దిక్కులేదు

వలస కార్మికుల తరలింపులో తాత్సారం

ఇతర జిల్లాల నుంచి తరలివచ్చిన కార్మికులు 

రాజస్థాన్‌కు తరలిన మూడో శ్రామిక్‌ రైలు 


అనంతపురం రైల్వే, మే 22 : వలస కార్మికుల తరలింపులో అధికారుల తాత్సారం మరోసారి బట్టబయలైంది. వందల మంది కార్మికులను శ్రామిక్‌ రైలులో తరలిస్తున్నా... కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భద్రతను గాలికొదిలేశారు. కనీసం శానిటైజర్లకూ దిక్కులేదు. అధికారుల నిర్లక్ష్యం నిలువునా కొట్టొచ్చినట్లయ్యింది. రాజస్థాన్‌ వలస కార్మికుల తరలింపునకు మూడో శ్రామిక్‌ రైలు శుక్రవారం కదిలింది. అనంతపురం రైల్వే స్టేషన్‌ నుంచి 1200 మంది కార్మికులు తరలివెళ్లారు. అనంతపురంతో పాటు కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల నుంచి కూడా దాదాపు 35 బస్సుల్లో రప్పించారు. అయితే పేర్లు నమోదు చేసుకున్న కొందరు లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు చెప్పుకొచ్చాయి.


అయితే మొదటి, రెండు విడతల్లో తరలించినట్లుగా భద్రతా చర్యలను ఈ దఫా గాలికి వదిలేశారు. కనీసం శానిటైజర్‌ కూడా లేకుండానే బస్సులు దిగిన వెంటనే వివరాలు పరిశీలించి నేరుగా బోగీలకు ఎక్కించారు. మొత్తం 24 బోగీలు ఉండగా మొదటి, రెండు విడతల్లో కనిపించిన కార్మికుల రద్దీ లేకుండాపోయింది. ఎక్కడ చూసినా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. మరో 5 బస్సులు రావాల్సి ఉండగా రైలు చాలా వరకు ఖాళీ ఉందని ఓ రైల్వే ఉన్నతాధికారి యంత్రాంగాన్ని ప్రశ్నించారు. కార్మికులను తరలించడానికి జిల్లా యంత్రాంగం శ్రామిక్‌ రైలు ఏర్పాటు చేసినా... అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.


రాత్రి 8 గంటలకు వెళ్లాల్సిన రైలు ఇతర జిల్లాల కార్మికులు రావడం ఆలస్యం కావడంతో వేచిఉండాల్సి వచ్చింది. కాగా వలస కార్మికులకు ఆర్డీటీ అండగా నిలిచింది. శ్రామిక్‌ రైలులో ప్రయాణం చేసే వారికి భోజన పొట్లాలు అందించి ఆదుకున్నారు. ఆర్డీటీ హాస్పెటాలిటీ డైరెక్టర్‌ విశాల ఫెర్రర్‌ బోగీల్లో ఉన్న కార్మికులకు స్వయంగా భోజన పొట్లాలు అందించారు. రైల్వే డీఓఎం వెంకటేశ్వర్లు, సెక్యూరిటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ అనూజ్‌ కుమార్‌, డీఎస్పీ వీరరాఘవరెడ్డి, ఆర్డీఓ గుణభూషన్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, కమిషనర్‌ మూర్తి, స్టేషన్‌ మేనేజర్‌ థావూనాయక్‌, ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనురాగ్‌ కుమార్‌, త్రీటౌన్‌ సీఐ రెడ్డప్ప పర్యవేక్షించారు. 

Advertisement
Advertisement
Advertisement