జర్నలిస్టుల సేవలు అమూల్యం

ABN , First Publish Date - 2020-05-13T06:30:04+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో జిల్లా యంత్రాంగంతోపాటు జర్నలిస్టులు కూడా ప్రాణాలకు తెగించి అందించిన సేవలు

జర్నలిస్టుల సేవలు అమూల్యం

పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి


కరీంనగర్‌ క్రైం, మే 12: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో జిల్లా యంత్రాంగంతోపాటు జర్నలిస్టులు కూడా ప్రాణాలకు తెగించి అందించిన సేవలు అమూల్యమైనవని పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడూ ప్రపంచానికి తెలియజేస్తూ అందరి దృష్టి కరీంనగర్‌ వైపు చూసేలా చేయడంలో మీడియా సఫలీకృతం అయిందని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు తమవంతు సహాయంగా మంగళవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో సీపీ జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులను అందజేశారు.


ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో నేడు కరీంనగర్‌ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలవడంలో మీడియా తమవంతు పాత్రను పరిపూర్ణంగా పోషించిందని ప్రశంసించారు. మొదటి విడతగా 100 జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు. విడతల వారీగా మిగతా వారికి కూడా నిత్యావసర వస్తువులను అందజేస్తామని హామీ ఇచ్చారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పీస్‌ అండ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఆధ్వర్యంలో వలస, దినసరి కార్మికులకు చెందిన 650కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Updated Date - 2020-05-13T06:30:04+05:30 IST