గాలిని కొనుక్కునే పరిస్థితి రాకూడదు

ABN , First Publish Date - 2021-01-21T06:15:05+05:30 IST

గ్రామాల్లోనూ తాగునీటి బాటిళ్లు, ప్యాకెట్లు కొనుక్కునే పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదని.. భవిష్యత్‌లో మనం పీల్చుకునే వాయువును కొనుక్కునే పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి.. సంరక్షించాలని కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ సూచించారు.

గాలిని కొనుక్కునే పరిస్థితి రాకూడదు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

 ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

విజయనగరం (ఆంధ్రజ్యోతి), జనవరి 20 : గ్రామాల్లోనూ తాగునీటి బాటిళ్లు, ప్యాకెట్లు కొనుక్కునే పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదని.. భవిష్యత్‌లో మనం పీల్చుకునే వాయువును కొనుక్కునే పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి.. సంరక్షించాలని కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా సామాజిక అటవీ అభివృద్థి కమిటీ సమావేశం బుధవారం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ మొక్క నాటడంతోనే పని అయిపోయినట్లు కాదని.. దాన్ని దత్తత తీసుకుని మొక్క... చెట్టు అయితేనే సార్థకం ఉంటుందన్నారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలి కోసం ప్రత్యేక గదుల్లోకి వెళ్తున్న పరిస్థితి ఉందని గుర్తుచేశారు. వ్యక్తులు, పశువులు, జంతువుల పరిరక్షణకు క్లబ్‌లు ఉన్నట్లే.. మొక్కలు, చెట్లును సంరక్షించేందుకు క్లబ్‌లు ఏర్పాటు చెయ్యాలన్నారు. అధికారులంతా తమ ఇళ్ల వద్ద మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ మధ్యకాలంలో చెట్లకు మేకులు గుచ్చి.. ఇనుప తీగలు బిగించి ప్రచార వస్తువులను, బ్యానర్లను అమర్చుతున్నారని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి.. నేనే చర్యలు తీసుకుంటా’ అని అన్నారు. ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖల సిబ్బందికి చెట్లు తొలగించాల్సి వస్తే మరో స్థలంలో మరిన్ని మొక్కలు నాటాలన్నారు. చెట్లు నుంచి రాలిన ఆకులను తగలబెట్టకుండా వాటిని వర్మీకంపోస్టుగా వినియోగించాలన్నారు. అటవీ శాఖ అధికారి జానకీరావు మాట్లాడుతూ గతేఎడాది 1.24 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం కాగా అంతకుమించి 1.25 కోట్లు  నాటామని చెప్పారు. రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. సమావేంలో జిల్లా అటవీ శాఖ అధికారి సచిన్‌ గుప్తా,  డీపీవో కె.సునీల్‌రాజ్‌కుమార్‌, జడ్పీ సీఈవో టి.వెంకటేశ్వరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-21T06:15:05+05:30 IST