ప్రచారానికి తెర..

ABN , First Publish Date - 2021-03-09T06:49:40+05:30 IST

పురపోరు తుదిదశకు చేరుకుంది.

ప్రచారానికి తెర..
ఐజీఎంసీ స్టేడియం నుంచి ఎన్నికల సామగ్రిని తరలిస్తున్న సిబ్బంది

ప్రలోభాల ఎర

పురపోరుకు ముగిసిన ప్రచారం

36వ డివిజన్‌లో పంచేందుకు సుమారు రూ.50 లక్షలు సిద్ధం

చివరి నిమిషంలో పట్టుకున్న నిఘా అధికారులు

నగరంలోని 64 డివిజన్లలోనూ ఇదే తంతు 

అక్షరాలా రూ.32 కోట్లు సిద్ధం


ఒక్కో డివిజన్‌కు అక్షరాలా రూ.50 లక్షలు. అవసరమైతే రూ.కోటి.. విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 64 డివిజన్లకు అధికార పార్టీ పంచాలనుకున్న డబ్బు ఇది. 24 గంటల్లో పోలింగ్‌ జరగనుండటం.. సోమవారం ప్రచారం కూడా ముగియడంతో ఇప్పుడు కీలక నేతలు పంపకాలపై దృష్టిపెట్టారు.


విజయవాడ, ఆంధ్రజ్యోతి : పురపోరు తుదిదశకు చేరుకుంది. ప్రచార ఘట్టానికి సోమవారం సాయంత్రం తెరపడింది. ప్రలోభాలు జోరందుకున్నాయి. గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార వైసీపీ డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతోంది. ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఒక్కో డివిజన్‌కు రూ.50లక్షల పైచిలుకు నగదు సిద్ధమైంది. న్యూరాజరాజేశ్వరిపేటలో వెల్డింగ్‌ పనులు చేసుకునే కూర్మాపు నాయుడు అనే వ్యక్తి ఇంట్లో సోమవారం రూ.48.50 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకోవడమే ఇందుకు సాక్ష్యం. ఆయన సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అనుచరుడు ఎర్ర సూరికి సమీప బంధువు. స్థానికులు అందించిన పక్కా సమాచారంతో పోలీసులు నాయుడు ఇంటిపై దాడిచేసి సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని 64 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ లెక్కన నగరవ్యాప్తంగా సోమవారం రాత్రి, మంగళవారం ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన సొమ్ము విలువ రూ.32 కోట్ల పైచిలుకు.


వినూత్నంగా నగదు పంపిణీ

నగదు పంపిణీకి వైసీపీ నాయకులు ఎంచుకుంటున్న మార్గాలు వినూత్నంగా ఉంటున్నాయి. విద్యాసంస్థలు, సామాన్య వ్యక్తుల ఇళ్లలో డబ్బును నిల్వ ఉంచి వ్యాపార సముదాయాల్లో పనిచేసే గుమస్తాలు, మహిళల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. గతంలో వైసీపీ కార్పొరేటర్‌గా పనిచేసిన ఓ మహిళా అభ్యర్థి క్యాటరింగ్‌ మనుషులతో డబ్బు పంపిణీ చేయిస్తుండటం గమనార్హం. పెద్ద ఎత్తున పులిహోర వండించి, దేవుడి ప్రసాదం అంటూ డివిజన్‌లోని ఇళ్లకు వెళ్లి ప్యాకెట్లు అందిస్తూ వాటితో పాటు రూ.500 నుంచి వెయ్యి వరకు పంపిణీ చేయిస్తున్నారు. 


విద్యాసంస్థల నుంచి ఫోన్లు

పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్ల ఓటర్లకు విద్యాసంస్థల పేర్లతో ఫోన్లు వస్తున్నాయి. మేం ఫలానా విద్యాసంస్థ నుంచి ఫోన్‌ చేస్తున్నాం అని చెప్పడంతో చాలామంది ఓటర్లు తమ పిల్లలకు పనికొచ్చే విషయం ఏమైనా చెబుతారేమోనని ఆసక్తిగా వింటున్నారు. మీరు ఉంటున్న డివిజన్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఫలానా వ్యక్తి పోటీ చేస్తున్నారు. ఆయనకు ఓటేసి గెలిపించండి. లేకుంటే మీకు అందుతున్న సంక్షేమ పథకాలు కొనసాగడం అనుమానమే అని చెబుతున్నారు.


ప్రత్యర్థుల కొనుగోళ్లపై దృష్టి

ప్రత్యర్థులను డబ్బుతో కొనేందుకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. పోలింగ్‌ సమయంలో కేంద్రాల వద్దకు రాకుండా ఉండేందుకు డమ్మీ ఏజెంట్లను నియమించుకునేందుకు ఒప్పుకొంటే రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు ఇచ్చేందుకు వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారు. మచిలీపట్నంలోనూ ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. ఇక్కడ కూడా డివిజన్‌కు రూ.20 లక్షల  నుంచి రూ.30 లక్షలు పంచేందుకు సొమ్ము సిద్ధమైనట్లు సమాచారం. 


ముగిసిన ప్రచార పర్వం

విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతో పాటు నూజివీడు, పెడన మున్సిపాలిటీలు, తిరువూరు, నందిగామ, ఉయ్యూరు నగర పంచాయతీలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఆయా ప్రాంతాల్లో ప్రచారం ముగిసింది. 

Updated Date - 2021-03-09T06:49:40+05:30 IST