మీరు ఫెయిల్‌

ABN , First Publish Date - 2021-01-12T09:19:08+05:30 IST

సాగు చట్టాలపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. నెలన్నర దాటినా సమస్యను కొలిక్కి తీసుకురావడంలో విఫలమయ్యారంటూ తొలిసారిగా తీవ్రస్థాయిలో ఆగ్రహం

మీరు ఫెయిల్‌

సాగు చట్టాలను మీరు ఆపుతారా.. మేం స్టే ఇవ్వాలా?

కేంద్రంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం

మీ చట్టాలపై రాష్ట్రాలు తిరగబడుతున్నాయి

సంప్రదింపుల్లేకుండా చట్టాలెందుకు చేశారు?

మీరు సమస్య వైపా? పరిష్కారం వైపా?

శాంతికి భగ్నం వాటిల్లితే ఏం చేస్తారు?

పరిస్థితిని డీల్‌ చేస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి

మాజీ సీజే సారథ్యంలో కమిటీ.. నేడు ఉత్తర్వు

హడావుడిగా అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం


న్యూఢిల్లీ, జనవరి 11: సాగు చట్టాలపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. నెలన్నర దాటినా సమస్యను కొలిక్కి తీసుకురావడంలో విఫలమయ్యారంటూ తొలిసారిగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాల అమలును ఆపుతారా.. లేక మమ్మల్నే స్టే ఇవ్వమంటారా..? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వానికి, రైతు సంఘాలకు జరుగుతున్న చర్చల తీరుపై తీవ్ర అసంతృప్తి ప్రకటించింది.


ప్రతిష్ఠంభన తీరకపోగా, సమస్య నానాటికీ బిగుసుకుపోతోందని, ఆందోళనలు ఉధృతమవుతున్నాయని అభిప్రాయపడింది. సమస్య సామరస్యంగా పరిష్కారమవ్వాలని చెబుతూ ఇందుకోసం ఓ రిటైర్డ్‌ సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలో కమిటీ వేస్తామని మరోమారు వెల్లడించింది. జస్టిస్‌ ఆర్‌ఎం లోధాతో పాటు వేరెవరైనా ముగ్గురు మాజీ సీజేల పేర్లు సూచించాలని ఉభయపక్షాలనూ కోరింది. దీనిపై మంగళవారం ఉత్తర్వులు వెలువరిస్తామని ప్రకటించింది. దాదాపు రెండు గంటలు సాగిన విచారణలో సీజేతో పాటు జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి రామసుబ్రమణియన్‌తో కూడిన బెంచ్‌- మోదీ ప్రభుత్వాన్ని పలుమార్లు తప్పుబట్టింది. ఆఖరికి ఓ దశలో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ‘మీరు చేస్తున్న వ్యాఖ్యలు కఠినంగా నొప్పించేవిగా ఉన్నాయి’ అని అనేశారు. దానికి జస్టిస్‌ బోబ్డే బదులిస్తూ ‘ కఠినమా? ప్రస్తుత స్థితిలో మేం చేయగల హానికరం కాని పని ఇదొక్కటే’ అన్నారు.


తదుపరి విడత చర్చలు ఈనెల 15న జరుగుతాయనీ, అప్పటిదాకా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వవద్దనీ, హడావిడిగా నిర్ణయాలు తీసుకోవద్దనీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కోరినపుడు బెంచ్‌ మండిపడింది. ‘మిస్టర్‌ అటార్నీ జనరల్‌... సహనంపై మీరు మాకు లెక్చర్లివ్వొద్దు... ఇప్పటికే మీకు (ప్రభుత్వానికి) చాలా అవకాశమిచ్చాం.. చేసింది చాలు..’ అని జస్టిస్‌ బోబ్డే ఘాటుగా బదులిచ్చారు. ‘అమలు ఆపితే కమిటీతో చర్చలకు తగిన వాతావరణం ఏర్పడుతుందని మా నమ్మకం. సమస్యను ప్రభుత్వం సమర్థంగా డీల్‌ చేయలేకపోతోంది. ఈరోజే మేం ఏదో ఒక చర్య తీసుకోవాలి..’ అన్నారు. అయితే ఏ చట్టాన్నీ కోర్టులు ఆపజాలవని, ఇందుకు గతంలో అనేక దృష్టాంతాలున్నాయనీ అటార్నీ జనరల్‌ స్పష్టం చేశారు.. ‘చట్టసభలకు యోగ్యత, అధికారం లేనపుడు, ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నాయని భావించినపుడు, రాజ్యాంగబద్ధత లేదని భావించినపుడు మాత్రమే చట్టాలపై కోర్టులు స్టే ఇవ్వగలవని’ ఏజీ వాదించారు. దీన్ని తిప్పికొట్టిన సీజే ఉద్యోగాలు, విద్యావకాశాల కల్పనపై మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మరాఠా కోటా చట్టాన్ని 2018లో సుప్రీంకోర్టు నిలిపేసిందని గుర్తుచేశారు.


అమలు ఆపడమంటే చట్టాన్ని ఆపినట్లే అని ఏజీ వ్యాఖ్యానించగా సీజే దానితో ఏకీభవించలేదు. ‘ ఈ చట్టం గత జూన్‌ నుంచే అమల్లోకొచ్చింది. దాదాపు 2000 మంది రైతులు మండీలతో, ప్రైవేటు వ్యక్తులతో ఒప్పందాలు  చేసుకున్నారు. ఇపుడు అమలు ఆపితే వారందరికీ నష్టం వాటిల్లుతుంది’ అని అటార్నీ జనరల్‌ చెప్పుకొచ్చారు. కానీ సీజే దాన్ని కొట్టిపడేశారు. ‘మా లక్ష్యం ఒక్కటే... ఈ సమస్యకు సామరస్య పరిష్కారం సాధించడం. గత  నెలలో జరిగిన విచారణ సమయంలోనే మిమ్మల్ని ఇది ప్రశ్నించినా మీరు సరిగా స్పందించలేదు... ఇన్నాళ్లూ సాగదీశారు’ అన్నారు. కమిటీ ఏర్పాటే మార్గాంతరమన్నారు. చట్టాలు తమకు సమ్మతమేనని, మీరు స్టే ఇవ్వడంవల్ల తాము నష్టపోతామని అనేక రాష్ట్రాల రైతులు చెబితే ఏం చేస్తారని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నపుడు చట్టాలను మేం సమర్థిస్తున్నాం అనే మాటను ఆ రైతులు కమిటీకి చెప్పుకోమనండి అని సీజే బదులిచ్చారు.


బెంచ్‌ చేసిన తీవ్ర వ్యాఖ్యలివీ.....

 కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ సమస్యను మీరు పరిష్కరించలేకపోయారని చెప్పడానికి చింతిస్తున్నాం. చర్చలు జరపకుండా చట్టాలు చేసినందువల్లే ఆందోళనలు తలెత్తాయి. వీటిని పరిష్కరించాల్సిన బాఽధ్యత మీదే..


 అనేక రాష్ట్రాలు మీరు చేసిన చట్టాల మీద తిరగబడుతున్నాయి.. కొన్ని రాష్ట్రాలు తాము అమలు చేయబోమని తీర్మానాలు చేస్తున్నాయి... ఏమంటారు? చట్టాల రాజ్యాంగబద్ధత గురించి ప్రస్తుతం మనం విచారణ జరుపుతున్నాం. మీరేమో చర్చలు కొనసాగుతున్నాయని అంటున్నారు.. అసలు ఏం జరుపుతున్నారు? 

 చర్చలెందుకు విఫలమవుతున్నాయంటే.. ప్రభుత్వమేమో క్లాజుల వారీగా అభ్యంతరాలపై చర్చిస్తామంటోంది.. రైతులేమో చట్టాల రద్దును కోరుతున్నారు. దీనికి పరిష్కారం కమిటీ ఏర్పాటే.. అది ఓ పరిష్కారం చూపేదాకా చట్టాల అమలు నిలిపేయడమే సబబు.


 అమలు ఆపడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటి..? మేం చట్టాల రద్దు కోరట్లేదు...  సమస్య పరిష్కారమయ్యేదాకా అమలు ఆపండంటున్నాం.. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాలను అమలు చేసి తీరాలన్న పట్టుదల మీకెందుకు?'


 ఈ పరిస్థితిని చూశాకే మేం గత విచారణ సమయంలో అంటే డిసెంబరు 17న - చట్టాల అమలు నిలిపేయాలని మీకు సూచించాం. మీరేమో చర్చిస్తున్నాం.. గడువివ్వండి అన్నారు... ఇప్పటిదాకా తేల్చలేకపోయారు. మీరే గనక బాధ్యతాయుతంగా వ్యవహరించదలిస్తే అమలు ఆపండి. మీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా ఈ దేశ సుప్రీంకోర్టుగా మేం ఆ చట్టాలపై స్టే ఇస్తాం.  

 చట్టాల వల్ల ఇదీ లాభం అని వాటిని సమర్థిస్తూ ఒక్క పిటిషన్‌ దాఖలు కాలేదు. ఇప్పటిదాకా ప్రభుత్వం తాత్సారం చేసింది. అసలు ప్రభుత్వం సమస్యవైపు ఉందో లేక పరిష్కారం కోరుకుంటోందో అర్థం కావడం లేదు. మీ జాప్యం వల్ల రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.  


 శాంతికి విఘాతం కలిగించే ఘటనలు జరిగితే, రక్తపాతం జరిగితే ఎవరిది బాధ్యత? చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొనే వారిని కోర్టు రక్షించదు. రైతు ఆందోళనను మేం నిలిపేయడం సాధ్యం కాదు. నిరసన తెలుపుతున్న గొంతును నొక్కేస్తున్నారన్న విమర్శను మేం ఎదుర్కోదలుచుకోలేదు. 

Updated Date - 2021-01-12T09:19:08+05:30 IST