కరోనా దడ

ABN , First Publish Date - 2020-04-09T10:45:02+05:30 IST

జిల్లాలో కరోనా దడ పుట్టిస్తోంది. ఇప్పటి వరకూ జిల్లాలో కరోనా కేసులు పెద్దగా లేవని అధికారులు చెబుతూ రావడంతో

కరోనా దడ

అనంతలో మరో 7 పాజిటివ్‌ కేసులు

వైద్యసేవలందించిన నలుగురికి కరోనా

ఇద్దరు వైద్యులు...  ఇద్దరు నర్సులకు నిర్ధారణ

హిందూపురంలో ఇద్దరు... కళ్యాణదుర్గంలో ఒకరికి

జిల్లాలో 13కు చేరిన మొత్తం బాధితులు


అనంతపురం వైద్యం, ఏప్రిల్‌ 8 : జిల్లాలో కరోనా దడ పుట్టిస్తోంది. ఇప్పటి వరకూ జిల్లాలో కరోనా కేసులు పెద్దగా లేవని అధికారులు చెబుతూ రావడంతో జనం కొంత ఉపశమనం పొందుతూ వచ్చారు. అయితే బుధవారం  ఒక్క సారిగా జిల్లాలో 7 కరోనా పాజిటివ్‌ కేసులు బయట పడటంతో వారు ఉలిక్కి పడ్డారు. జిల్లా ఆస్పత్రి లో కరోనా బాధితులకు వైద్యసేవలందించిన ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. హిందూపురం ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న ఇద్దరికి, కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి నిర్ధారణ అయినట్టు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు బుధవారం ప్రకటించారు. 


జిల్లాలో 13కు చేరిన బాధితులు

జిల్లాలో మంగళవారం వరకూ ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో లేపాక్షిలో ఒకరు, హిందూపురానికి చెందిన ఐదుగురు ఉన్నారు. వీరిలో హిందూ పురానికి చెందిన 60 సంవత్సరాల వృద్ధుడు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాలుగు రోజుల కిందట మృతి చెందాడు. తాజాగా 7 కేసులు బయటపడ్డాయి. వీరిలో కూడా అనంతపురం  ఆస్పత్రిలో కరో నా బాధి తులకు వైద్య సేవలందించిన నలు గురు ఉండటం విశేషం. హిందూపురం ఆస్పత్రి లో చికిత్స పొందు తున్న ఇద్దరు వ్యక్తులకు కరోనా నిర్ధారణ అయింది.


ఈ ఇద్దరు కూడా మక్కాకు వెళ్లి వచ్చిన వారుగా అధికారులు చెబుతు న్నారు. కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామానికి చెందిన 74 సంవత్సరాల వృద్ధుడు క్షయతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. ఇక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు శాంపిల్స్‌ తీసి ల్యాబ్‌కు పంపించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా మళ్లీ ఆస్పత్రిలో కలవరం మొదలైంది. 


 బాధితులు వీరే....

జిల్లాలో లేపాక్షిలో పదేళ్ల బాలుడు, హిందూపురంలో 34 ఏళ్ల మహిళ, 54 ఏళ్ల వ్యక్తి,  హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన 29 ఏళ్ల యువకుడు, అదే కాలనీకి చెందిన 80 సంవత్సరాల మహిళ, ముక్కిడిపేటకు చెందిన 39 ఏళ్ల వ్యక్తి ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. ఇందులో హిందూపురం హౌసింగ్‌బోర్డుకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి కరోనాతో చికిత్స పొందుతూ అనంత పురం ఆస్పత్రిలో చనిపోయాడు. తాజాగా.... ఏడుగురు కరోనా బారిన పడ్డారు. ఇందులో అనంతపురం సాయినగర్‌కు చెందిన ఇద్దరు మహిళా స్టాఫ్‌నర్సులు, రామ్‌నగర్‌కు చెందిన 29 ఏళ్ల డాక్టర్‌, జీసెస్‌నగర్‌కు చెందిన 28 ఏళ్ల హౌస్‌సర్జన్‌, హిందూపురానికి చెందిన 39 ఏళ్ల వ్యక్తి,  మరో 36 సంవత్సరాల వ్యక్తి, కళ్యాణదుర్గం మండలానికి చెందిన 74 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. వీరిలో కళ్యాణదుర్గం మండలానికి చెందిన వృద్ధుడు మృతి చెందిన తర్వాత కరోనా నిర్ధారణ అయినట్టు  అధికా రులు వెల్లడించారు. 


ఆస్పత్రిలో టెన్షన్‌.. టెన్షన్‌..

వైద్య సిబ్బందికే కరోనా పాజిటివ్‌ రావడంతో జిల్లా ఆస్పత్రిలో వైద్యులు, ఇతర సిబ్బందిలో మరింత టెన్షన్‌ మొద లైంది. హిందూపురానికి చెందిన వృద్ధుడు కరోనాతో చనిపో యినప్పటి నుంచి ఈ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఆందోళన చెందుతూ వస్తున్నారు. ఆ వృద్ధుడి వైద్య సేవల్లో పాల్గొన్న పలువురు తమకూ కరోనా సోకిందా అం టూ మానసికంగా ఆవేదన చెందుతూ వస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యం చేయడంపై పెదవి విరుస్తూ వచ్చారు. చివరికి ఆ వృద్ధుడికి వైద్యసేవలందించిన దాదాపు 22 మంది డాక్టర్లు, వైద్య సిబ్బందికి శాంపిల్స్‌ తీసి ల్యాబ్‌కు పంపించారు. ఇందులో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడం ఇప్పుడు వైద్య సిబ్బందిలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ప్రతిఒక్కరూ భయపడి పరీక్షల కోసం శాంపిళ్లు ఇస్తున్నారు. బుధవారం మరో 15 మంది డాక్టర్లు, సిబ్బందికి శాంపిళ్లు తీసి ల్యాబ్‌కు పంపించారు. ముందుగా శాంపిళ్లు తీసిన వారిలో నలుగురు మినహా మిగిలిన వారికి నెగిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. 


అనంతపురం, హిందూపురం ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్‌

ఆస్పత్రుల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారికి వైద్యసేవలు అందించిన డాక్టర్లు, సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. దీంతో అనంతపురం, హిం దూపురం ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ఓపీ సేవల బంద్‌కు యంత్రాంగం నిర్ణయించింది.  ఇళ్ల వద్దే చికిత్స పొందాలని జిల్లా కలెక్టర్‌ బుధవారం ఆయా రోగులకు ఆదేశాలు జారీ చేశారు.


స్థానికంగా ఉన్నమెడికల్‌ ఆఫీసర్‌కు సమాచారం అందిస్తే... ఆ డాక్టర్‌ను ఇంటికే పంపించి చికిత్స అందిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఇందుకోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు 8500292992, 08554-220009కు ఫోన్‌ చేసి తెలియ జేయాలన్నారు. వెంటనే ఆ రోగులకు వైద్యసేవలందించే ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. రెగ్యులర్‌ పేషెం ట్లకు ఆశా వర్కర్‌లు, ఏఎన్‌ఎంలను ఇంటి దగ్గరకు పం పించి మందులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 


Updated Date - 2020-04-09T10:45:02+05:30 IST