Abn logo
Feb 26 2020 @ 00:49AM

పర్యటన ఘనం!

అమెరికా అధ్యక్షుడి పర్యటన విజయవంతమైనట్టే. భారత్‌, అమెరికాల మాట అటుంచితే, అటు డొనాల్డ్‌ ట్రంప్‌కూ, ఇటు నరేంద్రమోదీకీ ఇది బాగా ఉపకరించినట్టే. రెండు దేశాలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాణిజ్యం ఒప్పందం మీద ఆది నుంచీ ఉన్న అనుమానాలే చివరకు నిజమైనాయి. ట్రంప్‌కు మాత్రం ఆయన విపరీతంగా కలవరించిన ఘనస్వాగతం దక్కింది. డెబ్బయ్‌లక్షల లెక్క కాసింత తగ్గిందేమో కానీ, మొతేరా స్టేడియం వరకూ రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. అమెరికా ఆశ్చర్యపోయే స్థాయిలో క్రిక్కిరిసిన స్టేడియంలో లక్షమంది జనం ట్రంప్‌ ప్రతీ మాటకూ జేజేలు కొట్టారు. వాక్యానికీ వాక్యానికీ మధ్య ట్రంప్‌ తన ఆప్తమిత్రుడిని తలుచుకుంటూ, పొగడ్తలతో ముంచెత్తారు. సందర్శనలు, విందులు, ఫోటోలు తప్ప ఇరుదేశాలకూ ఈ పర్యటన చేకూర్చిన లబ్ధి ఏముందని పెదవి విరిచినవారు ఇది భావసారూప్యతలున్న ఇద్దరు వ్యక్తుల వ్యవహారమని మరిచిపోయినట్టుంది. 


అమెరికాలో ‘హౌడీ మోడీ’, ఇప్పుడు భారత్‌లో ‘నమస్తే ట్రంప్‌’ రాజకీయ లక్ష్యాలను అటుంచితే, అద్భుతమైన ఆతిథ్యంతో అమెరికా అధ్యక్షుడిని భారత్‌ బాగా ప్రభావితం చేసింది. స్వాగతానికి ఆయన ఎంత మురిసిపోయారో ఆయన ప్రశంసలే చెబుతున్నాయి. అమెరికా–భారత్‌ మైత్రి ప్రభుత్వాలకు అతీతమైనదనీ, ఇది ప్రజల పవిత్ర బంధమని ట్రంప్‌ అన్నారు. అమెరికా భారత్‌ను అభిమానిస్తుందనీ, గౌరవిస్తుందనీ, ఇండియన్లకు అమెరిన్లు నికార్సయిన స్నేహితులని ట్రంప్‌ నొక్కివక్కాణించారు. ఇక, తన ముప్పైఆరుగంటల పర్యటనలో మోదీనీ, ఆయన నాయకత్వ పటిమనూ అద్భుతం, అమోఘం అంటూ ట్రంప్‌ ఎన్నిమార్లు కీర్తించారో లెక్కేలేదు. ఇరుదేశాల మధ్యా గతంలో ఎన్నడూ లేనంత ఘనమైన అనుబంధం ఇప్పుడు నెలకొన్నట్టుగా ట్రంప్‌ తన పర్యటన యావత్తూ ఒక ఉద్వేగపూరితమైన వాతావరణాన్ని సృష్టించినమాట నిజం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షులు ఎనిమిదిమంది మాత్రమే. కానీ, ఆర్థికంగా ఎదిగి, విస్తృతమైన మార్కెట్‌గా మారిన తరువాత భారత్‌కు వరుసకడుతున్నవారిలో ఈయన నాలుగోవాడు. కానీ, ఈ పర్యటన గత అధ్యక్షుల పర్యటనలతో పోల్చితే పూర్తి భిన్నంగా, మరింత వ్యక్తిగతంగా కనిపించడానికి అక్కడా ఇక్కడా సైద్ధాంతిక సారూప్యతలున్న వారు అధికారంలో ఉండటమే కారణం.


ఉద్వేగాలను అటుంచితే, ఈ స్నేహబంధం వల్ల ఒనగూరిన ఆర్థిక లబ్ధి ప్రస్తుతానికి లెక్కకు అందడం లేదు. ట్రంప్‌నోట ప్రతీ మాటలోనూ, వాక్యంలోనూ వినిపించే అద్భుతాలేమీ జరగలేదు. ఆలింగనాల్లో అగుపించిన మైత్రి ఆర్థికలావాదేవీల్లో ప్రతిఫలించలేదు. కుదిరిన ఒప్పందాల్లో భారత్‌ ఎగిరిగంతేయగలిగేవేమీ లేవు. మూడువందల కోట్ల డాలర్లతో హెలికాప్టర్ల కొనుగోలు మనకు రక్షణ బలాన్నిస్తాయి కానీ, అంతకుమించి విక్రేతకు ఆర్థికలాభాన్ని చేకూరుస్తాయి. బోయింగ్‌, లాక్‌హీడ్‌ ఇత్యాది దిగ్గజకం పెనీలకు ట్రంప్‌ ఈ దెబ్బతో లాభాల పంట పండించారని డెమోక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి బెన్నీ శాండర్స్‌ విమర్శిస్తున్నారు. సహజవాయువు, ఇంధన రంగాల్లో ఒప్పందాలు కూడా అంతే. మాటల్లో ఆత్మీయతను కనబరిచే ట్రంప్‌ వాణిజ్యంలో మనకు అనాదిగా ఉన్న ప్రాధాన్యతను తొలగించి, రాయితీలన్నీ ఎగరగొట్టేశారు. మన ఎగుమతులను దెబ్బకొట్టిన ఈ నిర్ణయాన్ని పునఃస్సమీక్షించకుండా, మనదేశం అధికసుంకాలు వసూలు చేస్తున్నదంటూ వాపోతున్నారు. గుడ్‌బై చెప్పేముందు కూడా హార్లీడేవిడ్సన్‌ను కలవరించారు. పాకిస్థాన్‌ పైనా, ఉగ్రవాదంమీదా ఆయన చెప్పిన మాటలనుంచి విశేషంగా తవ్వితీయాల్సిందేమీ లేదు. ఉగ్రవాదంపై సమిష్టి పోరు అని భీకరంగా గర్జించినా, అఫ్ఘాన్‌ నిష్ర్కమణ లక్ష్యం ముందున్నది కనుక పాకిస్థాన్‌తో ఆయన నెయ్యం కొనసాగవలసిందే. పౌరసత్వ అంశం భారత్‌ వ్యక్తిగతమని అన్నందుకు మన పాలకుల మనసులు ఊరటపడివుండవచ్చును కానీ, మత స్వేచ్ఛ విషయంలో మోదీ తనకు ఎన్నో హామీలు ఇచ్చారనడం ద్వారా తాను ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు ట్రంప్‌ రుజువుచేసుకున్నారు. అమెరికాలో మోదీ విధానాలపై వ్యతిరేకత రేగిన నేపథ్యంలో ట్రంప్‌కు ఇది మరీ అవసరం. మర్యాదలు, ఆలింగనాలు మినహా అమెరికా అధ్యక్షుడి పర్యటనవల్ల మనకు ఒనగూరిన లాభనష్టాలు లెక్కగట్టుకోవడం అనవసరం. ప్రస్తుతం మాటల్లో కనిపించిన ఈ ప్రేమ సమీపభవిష్యత్తులో చేతల్లో ఏమాత్రం ప్రతిఫలించినా సంతోషించాల్సిందే.

Advertisement
Advertisement
Advertisement