కరోనా.. 50

ABN , First Publish Date - 2020-04-09T10:23:31+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు హాఫ్‌ సెంచరీకి చేరువులో ఉన్నాయి. బుధవారం ఒక్క రోజే 9 కేసులు

కరోనా.. 50

ఒక్కరోజే 9 మందికి పాజిటివ్‌

రోజురోజుకు పెరుగుతున్న వైరస్‌ 

గుంటూరులో 34కు చేరిన బాధితులు

ఆనందపేటలో ఒకే కుటుంబంలో నలుగురికి

నిత్యావసరాలు అందక కంటైన్‌మెంట్‌ జోన్‌వాసుల ఇబ్బందులు 


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు హాఫ్‌ సెంచరీకి చేరువులో ఉన్నాయి. బుధవారం ఒక్క రోజే 9 కేసులు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రానికి జిల్లాలో  50 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో యాస్మిన్‌ ప్రకటించారు. రోజురోజుకు గుంటూరులో కేసులు ఆందోళన కలిగించే రీతిలో పెరుగుతుండటంతో అటు ప్రజల్లో, ఇటు అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది. ఆనందపేటలో అంతకుముందు ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి పాజిటివ్‌ రాగా వారి ద్వారా ఇతరులకు సంక్రమిస్తున్నట్లు స్పష్టమవుతుంది.


బుధవారం  ఆనందపేటలో నమోదైన కేసులు ఇలాంటివే. ఢిల్లీ వెళ్లి వచ్చి వైరస్‌ సోకిన వ్యక్తి ద్వారా పాతగుంటూరులోని కుమ్మరి బజారులో ఇద్దరికి,   సుద్దపల్లి డొంక పరిధిలోని యానాది కాలనీకి చెందిన ఓ మహిళకు పాజిటివ్‌ వచ్చింది. ఈమె కుటుంబంలోనూ ఢిల్లీ వెళ్లిన వారు లేరు. అయితే మసీదులకు వెళ్లి వచ్చిన ద్వారా సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు. వీరి ద్వారా మరికొంత మందికి సంక్రమించి ఉండవచ్చనే అనుమానాల నేపథ్యంలో వీరితో సన్నిహితంగా ఉన్న వారిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మణిపాల్‌ ఆసుపత్రిలోని క్వారంటైన్‌లో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లముండునూరుపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కూడా పాజిటివ్‌ వచ్చింది. ఆయనకు కూడా ఢిల్లీ లింకులతో సంబంధాలు లేవు. అయితే ఆయనకు ఎలా వచ్చిందనేదానిపై ఆరా తీస్తున్నారు. 


గుంటూరు నగరంలో సుమారు 34 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామానికి చెందిన ఐదుగురికి నెగిటివ్‌ వచ్చింది. పాజిటివ్‌ వచ్చిన  క్రోసుకు చెందిన వ్యక్తి ఫణిదంలోని సోదరి ఇంటికి రాగా వారందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. వీరికి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చినట్లు పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శేషుయాదవ్‌ తెలిపారు. సత్తెనపల్లి నాగన్నకుంట ప్రాంతానికి చెందిన ఒక యువతికి వైరస్‌ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో బుధవారం గుంటూరు కాటూరు మెడికల్‌ వైద్యశాలలోని ఐసోలేషన్‌కు తరలించారు.  


భయాందోళనలో శ్రీనివాసరావుపేటవాసులు

వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోండటంతో శ్రీనివాసరావుపేటవాసులు భయాందోళనలకు గురౌతోన్నారు. మొన్నటివరకు కేవలం ఒక పాజిటివ్‌ కేసు మాత్రమే నమోదు కాగా నేడు ఆ సంఖ్య మూడుకు చేరుకొన్నది. ఢిల్లీ కాంటాక్ట్స్‌ లేని మహిళకు పాజిటివ్‌ రాగా వారి ద్వారా ఇంకెంతమందికి వైరస్‌ సోకి ఉంటుందోనన్న భయం ప్రతీ ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తోన్నది.   ఇంకా చాలామంది రిపోర్టులు రావాల్సి ఉండటంతో వాటిల్లో ఎన్ని పాజిటివ్‌ కేసులు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. క్లస్టర్‌ కంటైన్‌మెంట్‌ జోన్‌ ఆంక్షలతో ప్రజలు ఇళ్లల్లోనే ఉంటూ బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతోన్నారు.


ఇంటి వద్దకే పాలు, కూరగాయలు, నిత్యవసరాలు, మెడిసిన్స్‌ పంపిస్తామని అధికారులు చెబుతోన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. రెడ్‌జోన్‌గా ప్రకటించిన తర్వాత ఒక్కసారి మాత్రమే నిత్యావసరాలను వలంటీర్ల ద్వారా విక్రయానికి తీసుకొచ్చారు. కనీసం న్యూస్‌ పేపర్లు కూడా వేయనీయకుండా ఆంక్షలు పెట్టడంతో బయట ఏమి జరుగుతుందో తెలుసుకోలేక పోతోన్నారు.  


Updated Date - 2020-04-09T10:23:31+05:30 IST