Abn logo
Jul 14 2020 @ 06:19AM

డిప్యూటీ సీఎంకు కరోనా

తిరుపతి నుంచి హైదరాబాద్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి

జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న వైరస్‌

సోమవారం ఒక్కరోజే 91 పాజిటివ్‌ కేసులు

2 వేలు దాటిన కరోనా బాధితులు


(కడప-ఆంధ్రజ్యోతి)  : డిప్యూటీ సీఎం అంజద్‌బాష కరోనా బారిన పడ్డారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాదు ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఆయనతో పాటు భార్య, కుమార్తెకు కూడా ఈ వైరస్‌ సోకింది. డిప్యూటీ సీఎంకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, మెరుగైన చికిత్స కోసం తిరుపతి జిల్లా కోవిడ్‌ ఆస్పత్రి (స్విమ్స్‌) తరలించిన వార్త వాస్తవమేనని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి తిరుపతి స్విమ్స్‌ నుంచి హైదరాబాదులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.


ఈనెల 8వ తేదీ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీఎం జిల్లా పర్యటనలో పాల్గొననున్న ప్రజాప్రతినిధులకు 6వ తేదీ జిల్లా కలెక్టర్‌ కోవిడ్‌ టెస్టులు చేయించారు. డిప్యూటీ సీఎంకు 7న పాజిటివ్‌ వచ్చినట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆరోజు రాత్రికే పాజిటివ్‌ కాదు నెగిటివ్‌ వచ్చిందని సోషల్‌ మీడియాలో మెసేజ్‌లు కూడా పెట్టారు. కాగా డిప్యూటీ సీఎం గన్‌మెన్‌కు కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన హోం క్వారంటైన్‌కు వెళ్లారని, సీఎం పర్యటనలో పాల్గొనలేదని అధికారులు చెబుతూ వచ్చారు. డిప్యూటీ సీఎంకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. తిరుపతి స్విమ్స్‌ నుంచి హైదరాబాదులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లడంతో ఈ విషయం బయటికి పొక్కింది. అయితే ఆయనతో పాటు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా, మున్సిపల్‌ అధికారులు, ఆధికార పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందోళన చెందుతున్నారు. 


2015కు చేరిన కరోనా బాధితులు

జిల్లాలో కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోంది. సోమవారం ఒక్కరోజే 91 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడిన బాధితుల సంఖ్య 2015కు చేరింది. తాజాగా నమోదైన 91 కేసుల్లో కడప నగరంలోనే 45 కావడం భయాందోళనలకు గురి చేస్తున్న అంశం. ప్రొద్దుటూరులో 4, పులివెందుల 8, రాజంపేటలో 5, బద్వేల్‌, రైల్వేకోడూరు, సిద్దవటంలో 3 చొప్పున, రామాపురం, రాయచోటి, దువ్వూరు, తొండూరు మండలాల్లో రెండేసి కేసులు, సీకే దిన్నె, వేంపల్లి, జమ్మలమడుగు, వేముల, పెనగలూరు, చెన్నూరు మండలాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఇతర జిల్లాలు, విదేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనా వ్యాప్తితో జనం భయాందోళనలు చెందుతున్నారు.

 

జిల్లాలో ముగ్గురు మృతి 

జిల్లాలో కరోనా వైరస్‌ బారిన పడి సోమవారం ముగ్గురు మృతి చెందారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇద్దరు, ఇంటి వద్దనే ఉంటూ మరొకరు మృతి చెందినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఒకేరోజు ముగ్గురు మృత్యువాత పడటంతో అందోళన వ్యక్తమౌతోంది. అలాగే జిల్లా కోవిడ్‌ ఆస్పత్రి ఫాతిమా మెడికల్‌ కాలేజీలో చికిత్స పొందుతూ కరోనాను జయించి 47 మంది డిశ్చార్జి అయ్యారని కలెక్టర్‌ వివరించారు. కోవిడ్‌ నిబంధనల ప్రకారం ఒక్కొక్కరికి రూ.2 వేలు అందజేశారు. 


అంక్షలు కఠినతరం చేస్తాం : సి.హరికిరణ్‌, కలెక్టర్‌

జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి ఆంక్షలు కఠినతరం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. అన్ని కోణాల్లో అలోచించి కీలక నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటి వరకు జిల్లాలో 91,150 స్వాబ్‌ శాంపిల్స్‌ సేకరించి రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉన్నాం. పాజిటివ్‌ కేసుల నమోదులో 8వ స్థానంలో ఉన్నాం. ముఖ్యంగా కడప, ప్రొద్దుటూరు పట్టణాల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది. ఇక్కడ కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన కఠిన చర్యలపై సమీక్షిస్తున్నాం. వ్యాపారులు సహకరించాలి.

Advertisement
Advertisement
Advertisement