Advertisement
Advertisement
Abn logo
Advertisement

పొట్టదశలో నీరు నిలిపేశారు

 శ్రీరాంసాగర్‌ నీటికోసం రైతుల ఎదురు చూపులు

 వారం రోజులుగా నీళ్లు బంద్‌కావడంతో ఆందోళన 

 ఆయకట్ట కింద జిల్లాలో 2.6లక్షల ఎకరాల్లో వరిసాగు 

అర్వపల్లి, అక్టోబరు 28: శ్రీరాంసాగర్‌ నీళ్లకోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఎస్సారెస్పీ రెండోదశ ఆయకట్ట కింద జిల్లాలో 2.6లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. వారం రోజుల క్రితం శ్రీరాంసాగర్‌ నీళ్లు బంద్‌ కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. 69, 70, 71 డీబీఎం మెయిన్‌ కాల్వలకు నీళ్ల రాకపోవడంతో చేతికొచ్చిన వరిపంట కళ్ల ముందే తరాడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరు మళ్లీ విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో రైతులు వరిపంటలు సాగుచేశారు. ప్రస్తుతం పంట పొట్టదశ, గింజ రూపంలో వరిపంటలు ఉన్నాయి. ఈ పంటకు నీళ్లు అందకపోతే సుమారు 50వేల ఎకరాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో నీటిని విడుదల చేయకపోతే వేసిన పంట చేతకొచ్చే పరిస్థితి కనబడడం లేదు. 20ఏళ్లుగా సాగు చేయని వరిపంట శ్రీరాంసాగర్‌ నీళ్లను నమ్ముకొని ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు 2లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ముందుగానే జూలై 16న గోదావరి జలాలు ఎస్సారెస్పీ అధికారులు విడుదల చేశారు. అప్పటి నుంచి రెండోదశ ఆయకట్ట కింద ఉన్న గ్రామాల ప్రజలు చెరువులు, కుంటలు నింపుకున్నారు. గత సంవత్సరం కంటే ఈసారి భూగర్భజలాలు కూడా పెరగడంతో రైతులు ఆరుతడి పంటలను మరిచిపోయి ఎక్కువగా వరిపంటను సాగు చేశారు. ఇప్పటి వరకు 10టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్‌ రెండోదశ కాల్వలకు ఎస్సారెస్పీ అధికారులు విడుదల చేశారు. అయినప్పటికి పొట్టదశలో ఉన్న వరిపంటకు నీటిని నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి 20రోజుల పాటు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

ఆంగోతు శ్రీనివా్‌సనాయక్‌

ఎస్సారెస్పీ నీటిని వెంటనే విడుదల చేయాలి :  ఆంగోతు శ్రీనివా్‌సనాయక్‌, రైతు, పడమటితండా.

శ్రీరాంసాగర్‌ నీటిని వె ంటనే విడుదల చేసి వరిపంటలను కాపాడాలి. వరిపంట పొట్టదశలో ఉన్నది కాబట్టి 20 రోజులపాటు నీటిని విడుదల చేయాలి. వారం రోజులుగా ఎస్సారెస్పీ నీటిని నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నాం.


చెర్కుపల్లి ప్రవీణ్‌

శ్రీరాంసాగర్‌ నీటిపైనే ఆధారపడి ఉన్నాం :  చెర్కుపల్లి ప్రవీణ్‌, రైతు, తిమ్మాపురం. 

శ్రీరాంసాగర్‌ నీటిని నమ్ముకొని రెండు ఎకరాల్లో వరిపంటను సాగుచేశా. వారం రోజులుగా అకస్మాత్తుగా నీటిని నిలిపివేశారు. పొట్టదశలో ఉన్న వరి పంట చేతికొస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నాం. 

Advertisement
Advertisement