కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో రక్తంలో గడ్డలు స్వల్పమే

ABN , First Publish Date - 2021-05-18T07:29:12+05:30 IST

కొవిషీల్డ్‌ టీకా వల్ల దేశంలో అత్యంత స్వల్పంగా(26 మందికే) రక్తస్రావం, రక్తం గడ్డలుకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో రక్తంలో గడ్డలు స్వల్పమే

టీకా దుష్ప్రభావాలపై ఏఈఎఫై కమిటీ వెల్లడి


న్యూఢిల్లీ,మే 17: కొవిషీల్డ్‌ టీకా వల్ల దేశంలో అత్యంత స్వల్పంగా(26 మందికే) రక్తస్రావం, రక్తం గడ్డలుకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి చెందిన అధికారిక ప్యానెల్‌ ‘ద నేషనల్‌ యాడ్వర్స్‌ ఈవెంట్‌ పాలోయింగ్‌ ఇమ్యూనైజేషన్‌ (ఏఈఎ్‌ఫఐ) కమిటీ వెల్లడించింది. టీకాలు వేయించుకున్నవారిలో దుష్ప్రభావాలపై దర్యాప్తు చేసే ఆ ప్యానెల్‌ నివేదికలోని విషయాలను కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. దేశంలో టీకా కార్యక్రమం ప్రారంభమయ్యాక 23 వేల మందిలో (కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వేయించుకున్నవారు) గణనీయ దుష్ప్రభావాలు కనిపించాయి. వారిలో 700 మందిలో పరిస్థితి తీవ్రమైంది. దుష్ప్రభావాలు కనిపించిన, పరిస్థితి తీవ్రమైన 498 కేసులను కమిటీ నిశితంగా పరిశీలించింది. ఆ 498 మందిలో 26 మందికి తీవ్రమైన త్రాంబోఎంబాలిక్‌ సమస్య(రక్తంలో గడ్డలు కట్టడం) వచ్చినట్టు గుర్తించింది. ఆ 26 మందీ కొవిషీల్డ్‌ టీకా వేయించుకున్నవారే. కొవిషీల్డ్‌ ప్రతి 10 లక్షల డోసులకుగాను 0.61 కేసుల్లో ఇలా జరుగుతోందని కమిటీ వెల్లడించింది. అంటే కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న కోటి మందిలో సగటున ఆరుగురికి రక్తం గడ్డకట్టే సమస్య వచ్చింది. కొవాగ్జిన్‌ తీసుకున్న వారిలో ఈ సమస్య కనిపించలేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది.  ‘‘ఏఈఎ్‌ఫఐ సమాచారాన్ని పరిశీలిస్తే కొవిషీల్డ్‌ వల్ల రక్తం గడ్డ కట్టే ప్రమాదం అత్యంత తక్కువగానే అయినా స్పష్టంగా ఉంది. 


ఈ సమస్య ప్రతి 10 లక్షల డోసుల్లో 0.61 మందికి వస్తోంది. యూకేలో ఈరేటు ప్రతి 10 లక్షల డోసులకు 4 కేసులుగా ఉంది. జర్మనీ లో 10 లక్షల డోసులకు 10 కేసులుగా ఉంది. అక్కడితో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువే’’ అని ఆరోగ్య శాఖ పేర్కొంది. సాధారణంగా యూరోపియన్లతో పోలిస్తే దక్షిణాసియా, ఆగ్నేయాసి యా దేశాల్లో రక్తం గడ్డకట్టే సమస్య 70ు తక్కువని గత అధ్యయనాల్లో తేలింది. కొవిషీల్డ్‌ తీసుకున్న వారిలో ఈ సమస్య కనిపిస్తున్నందున ఈ టీకా తీసుకున్న వారు 20 రోజులపాటు జాగ్రత్తగా ఉండాలని, రక్తం గడ్డకట్లే లక్షణాలు కనపడతాయేమో పరిశీలించాలని ఆరోగ్య కార్యకర్తలకు, వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి ప్రభుత్వం సూచించింది. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తాము టీకా తీసుకున్న ఆరోగ్య కేంద్రంలోని అధికారులకు తెలపాలని సూచించింది. అయితే.. కొవిషీల్డ్‌ వల్ల ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని, ఈ టీకా తీసుకున్నవారిలో ఇన్ఫెక్షన్‌ తీవ్రత, మరణాల రేటు తక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Updated Date - 2021-05-18T07:29:12+05:30 IST