ప్రజాస్వామ్యమే లేదు: సొంత ప్రభుత్వంపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-11-23T21:41:17+05:30 IST

సుదీప్ రాయ్ బర్మాన్.. త్రిపురకు చెందిన ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ నేత. అయితే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో ఇసుమంత ప్రజాస్వామ్యం కూడా లేదు..

ప్రజాస్వామ్యమే లేదు: సొంత ప్రభుత్వంపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

అగర్తలా: త్రిపురలో ఇసుమంతైనా ప్రజాస్వామ్యం లేదని సొంత ప్రభుత్వంపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీకి చెందిన నేత. తన పార్టీ ఏదైనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తనకుందని అన్నారు. గత రెండు రోజులుగా త్రిపురలో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సొంత పార్టీ నేతే ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో బీజేపీ మరింత ఇరుకులో పడింది.


సుదీప్ రాయ్ బర్మాన్.. త్రిపురకు చెందిన ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ నేత. అయితే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో ఇసుమంత ప్రజాస్వామ్యం కూడా లేదు. రాష్ట్రం, ప్రజాస్వామ్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మనం ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు. వ్యక్తిగతంగా నేను భారతీయ జనతా పార్టీ కోసమే పని చేస్తాను. కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత కూడా ఉంది. శాంతిభద్రతలు అనేది పూర్తిగా రాష్ట్ర అంశం. కానీ రాష్ట్రంలో ఇంత తీవ్రమైన పరిస్థితులు ఉంటే ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ఆయన రోజులు దగ్గర పడ్డాయి’’ అని సుదీప్ రాయ్ అన్నారు.

Updated Date - 2021-11-23T21:41:17+05:30 IST