Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైదరాబాద్ : ఒకప్పుడు ఈ ఏరియా పేరు చెబితే భయం.. భయం.. ఇప్పుడెలా ఉందో చూడండి!

  • అభయమే.. వైరస్‌ కట్టడి!
  • రెడ్‌జోన్‌ ప్రకటనతో టౌన్‌షిప్‌లో గుబులు..
  • అసోసియేషన్‌ కట్టుదిట్టమైన చర్యలు
  • కరోనా ఫ్రీ దిశగా మలేషియన్‌ టౌన్‌షిప్‌
  • రోజూ సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ
  • కరోనా టెస్టింగ్‌ సెంటర్‌.. ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో
  • త్వరలో కార్పొరేట్‌ సబ్‌ హాస్పిటల్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ 
  • 18 సంవత్సరాలు నిండిన వారందరికీ టీకా

హైదరాబాద్/కేపీహెచ్‌బీ కాలనీ : ఏప్రిల్‌ చివరి వారంలో మలేషియన్‌టౌన్‌షిప్‌ పేరు చెబితేనే భయభ్రాంతులకు గురయ్యారు. కరోనా రెడ్‌ జోన్‌గా ప్రకటించడంతో అన్ని ప్రసార మాధ్యమాల్లో టౌన్‌షిప్‌ పేరు మార్మోగింది. దీంతో పరిసర ప్రాంతాల గేటెడ్‌ కమ్యూనిటీలతోపాటు కాలనీలు కూడా భయపడ్డాయి. అలాంటి పరిస్థితుల నుంచి నేడు నివాసితుల నుంచి ఆ గేటెడ్‌ కమ్యూనిటీ అసోసియేషన్‌ సభ్యులు ప్రశంసలు అందుకుంటున్నారు. భయాన్ని సమష్టి కృషితో అభయంగా మార్చుకుని వైరస్‌ దరిచేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో గేటెడ్‌ కమ్యూనిటీ అంటే టక్కున గుర్తుకొచ్చేది ముందుగా మలేషియన్‌టౌన్‌షిప్‌. సుమారు 35 ఎకరాల్లో 37 బ్లాక్‌లతో సుమారు 7 వేల మంది నివాసితులు అందులో 75శాతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉండగా.. మిగతా వారు మెడికల్‌, ఫార్మా కంపెనీలు, మీడియా రంగాల్లో పనిచేసే వారితో పాటు వివిధ రంగాల్లోని వ్యాపారులు నివసిస్తున్నారు.


ప్రజాప్రతినిధుల అండ

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కేపీహెచ్‌బీ కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు అసోసియేషన్‌ సభ్యులను అలర్ట్‌ చేశారు. ‘ప్రభుత్వం నుంచి ఏ సహకారం కావాలన్నా ఇస్తాం. కరోనా పేషెంట్లు ఉండే నివాసాల నుంచి చెత్తసేకరణ, ఇతరత్రా సహకారాలు అందిస్తాం’ అని టెలికాన్ఫరెన్స్‌ ద్వారా ధైర్యం చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్‌రెడ్డి కూడా అదే టౌన్‌షిప్‌లో ఉండటంతో హౌస్‌కీపింగ్‌ వారికి రాకపోకలకు వాహనం ఏర్పాటు, హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీకి వాహనం ఇచ్చి అసోసియేషన్‌గా అండగా నిలిచారు. ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల మెడికల్‌, ఫార్మా, ఇండస్ర్టియల్‌ ప్రతినిధుల సహాయ, సహకారాలతో కరోనా ఫ్రీ అనేలా మలేషియన్‌ టౌన్‌షి్‌పను మార్చేలా కృషిచేయడంలో రెయిన్‌ ట్రీ పార్క్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు సక్సెస్‌ అయ్యారని చెప్పవచ్చు.

సెల్ఫ్‌ లాక్‌డౌన్‌...

కరోనా మొదటి దశలో 16 ఫ్లాట్స్‌లో ఉండేవారికి సోకితే.. రెండో దశలో ఏకంగా 36 ఫ్లాట్స్‌లోకి చొరబడింది. దీంతో టౌన్‌షిప్‌ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతోంటే అసోసియేషన్‌ కార్యవర్గం అత్యవసర సమావేశమై వైర్‌సను ఎలాగైనా కమ్యూనిటీ నుంచి పారద్రోలుదాం అని కంకణం కట్టుకున్నారు. వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. మలేషియన్‌ టౌన్‌షిప్‌ ముఖద్వారం వద్దే వచ్చే వారికి టెంపరేచర్‌ చెక్‌చేసి లోపలికి అనుమతిస్తున్నారు. టౌన్‌షి్‌పలో ఉండే వారి నుంచి విరాళాలతో తొలుత 175 మంది స్టాఫ్‌ ఉంటే అందులో టీకా అంటే భయపడని వారిని గుర్తించారు. 117 మందికి ఉచితంగా ఇప్పటికే రెండు డోసులు వేయించారు. దీంతో వారు టౌన్‌షిప్‌లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నా ‘మాకు ఎలాంటి భయమూ లేదు’ అని నివాసితులు అంటున్నారు. ప్రతి బ్లాక్‌లో ఉండే ఒక లిఫ్ట్‌ను పూర్తిగా రెసిడెంట్స్‌కు, మరోక దాన్ని హౌస్‌ మేడ్స్‌, కేర్‌ టేకర్స్‌కు కేటాయించారు. థర్మాకోల్‌ ఏర్పాటు చేసి టూత్‌పిన్‌ల ద్వారా స్విచ్ఛాన్‌చేసి రాకపోకలు సాగించడం వల్ల లిఫ్ట్‌ల ద్వారా కరోనా వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. 


అత్యవసర ఇళ్లకు మాత్రమే...

ప్రతిరోజూ 650 మంది హౌస్‌ మేడ్స్‌ వచ్చేవారు.. వీరిని ఫిల్టర్‌ చేసి, కరోనా వల్ల అత్యవసర ఇళ్లకు మాత్రమే.. పంపించారు. అసోసియేషన్‌కు ముందుగా లెటర్‌ పెట్టుకుంటే దాన్ని ఒకటికి రెండు సార్లు చెక్‌చేసి అవసరం ఉన్న వారిని గుర్తించి అదీ కూడా ఒక ఇంట్లోనే పనిచేసేలా ఒప్పందం చేసుకుని ప్రస్తుతం 250 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఆన్‌లైన్‌ డెలివరీలను నేరుగా ఫ్లాట్‌లోకి అనుమతించకుండా ప్రతి బ్లాక్‌లో కేర్‌ టేకర్‌ వద్ద ఉంచి అక్కడి నుంచి నివాసితుడికి ఫోన్‌చేసి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రతిరోజూ టౌన్‌షిప్‌ అంతటా హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తూ, లిఫ్ట్‌లను ప్రతి గంటకు శానిటైజ్‌ చేయించి కరోనా వ్యాప్తి చెందకుండా ఎక్కడికక్కడ చర్యలు  తీసుకున్నారు. దీంతో 45కేసులకు పైగా ఉన్న టౌన్‌షి‌ప్‌లో 20 రోజుల్లోనే కరోనా ఫ్రీ అనేలా చేయడంలో సఫలీకృతులయ్యారు.

పక్కా ప్రణాళికతో.. 

టౌన్‌షిప్‌లో ఏ ఒక్కరూ మాయదారి వైరస్‌ బారినపడి ప్రాణాలు పోగొట్టుకోకూడదు అన్న నినాదంతో టౌన్‌షిప్‌లో ఉండే ఫార్మా అనుబంధంగా ఉన్న వారితో అసోసియేషన్‌ సభ్యులు సమావేశమై వారి సహాయం తీసుకున్నారు. కరోనా మొదటి దశలో రెండు ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచగా.. తాజాగా ఐదింటిని ఉంచారు. ఇద్దరు ఉద్యోగులు 24/7 కరోనా సోకిన వారికి కావాల్సిన ఆక్సిజన్‌, మందులు అందిస్తున్నారు. సదరన్‌ స్పైస్‌ హోటల్‌తో మాట్లాడి నో ప్రాఫిట్‌.. నో లాస్‌ ప్రాతిపదికన రూ.170కే ప్రొటీన్‌ ఫుడ్‌ ప్యాకెట్లను రోజూ 100 మందికి అందిస్తున్నారు. హోమ్‌ క్యారైంటైన్‌లో ఉన్న రోగులకు అత్యవసరం అయితే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జాయిన్‌ చేసి ట్రీట్‌మెంట్‌ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ అనుకోకుండా కరోనా సోకినా ప్రాణాప్రాయం ఉండదనేది టౌన్‌షిప్‌ వాసుల్లో కలిగిందంటే ఏ తరహాలో చర్యలు చేపట్టారో ఇట్టే తెలిసిపోతోంది.


ముందుచూపుతో.. 

సెకండ్‌ వేవ్‌ సమయంలోనే కరోనా టెస్టింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. క్లబ్‌ హౌస్‌-1లో నెర్ఫ్‌బ్లూట్‌ డయాగ్నోస్టిక్‌ ఏర్పాటు చేయించి రూ.650కే ఆర్‌టీపీసీర్‌ టెస్ట్‌. టౌన్‌షిప్‌లో ఉండే వారు ప్రతిరోజూ 35-50 మంది టెస్ట్‌ చేయించుకుంటున్నట్లు అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. ఇంతటితో ఆగకుండా ముందు చూపుతో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రితో అసోసియేషన్‌ ఇక్కడ అనుబంధ బ్రాంచ్‌ హాస్పిటల్‌ ఏర్పాటు చేయాలని కోరింది. అందుకు సమ్మతించి ఐదేళ్లపాటు అగ్రిమెంట్‌ కుదుర్చుకోని పనులు కూడా ఆరంభించింది. దీంతో ల్యాబ్‌తో పాటు ఆస్పత్రి సేవలు కూడా అందుబాటులోకి వస్తే అత్యవసరం అయిన వారిని ఇక్కడి సబ్‌ ఆస్పత్రి నుంచే మెయిన్‌ ఆస్పత్రికి తరలించేలా ఒక అంబులెన్స్‌తో పాటు 24 గంటల పాటు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.


అందరి సహకారంతోనే..

టౌన్‌షిప్‌‌లో చాలా మంది ప్రైవేట్‌, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌, ఫార్మా కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అసోసియేషన్‌ ఇచ్చిన పిలుపును అందుకుని కరోనా సోకిన నివాసితులకు ఏ తరహా వైద్యం కావాలన్నా ‘మేమున్నాం’ అంటూ భరోసా ఇచ్చారు. వారు చెప్పిన మాటలే మాకు కొండంత ధైర్యం ఇచ్చాయి. అవసరమైన పేషెంట్లకు ఐసీయూ, వెంటిలేటర్‌తో కూడిన బెడ్స్‌, రెమిడెసివర్‌ ఇంజక్షన్లు ఇప్పించడంలో సఫలీకృతులం అయ్యాం. అసోసియేషన్‌ తీసుకునే నిర్ణయాలకు అన్ని వర్గాలు, ప్రజాప్రతినిధుల నుంచి సహకారం లభిస్తోంది. భవిష్యత్తులో కూడా టౌన్‌షి‌ప్‌లో కరోనాను సమష్టిగా ఎదుర్కొని అందరం కలిసి మెలిసి ఉండాలనేదే మా ధ్యేయం. - కాకరాల సురేష్‌, అధ్యక్షుడు, రెయిన్‌ ట్రీ పార్క్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌


నివాసితులకు భరోసా ఇచ్చాం...

కరోనా భయంతో ఉక్కిరిబిక్కిరైన నివాసితులతోపాటు బాధితులు, వారి కుటుంబ సభ్యులకు మేమున్నాం అంటూ భరోసా ఇచ్చాం. ఎక్కువ మందికి కరోనా సోకకుండా అసోసియేషన్‌ తరఫున ఎక్కడికక్కడ నివారణ చర్యలు తీసుకుంటున్నాం. తద్వారా టౌన్‌షిప్‌‌లో కరోనా కట్టడి గురించి స్థానికులతో పాటు పరిసర ప్రాంత వాసుల నుంచి అభినందనలు వెలువెత్తడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. - అల్లూరి సీతారామరాజు, ప్రధానకార్యదర్శి, రెయిన్‌ ట్రీ పార్క్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌.

Advertisement
Advertisement