వారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు.. ఏది ముట్టుకున్నా బంగారమే.. అయితే వారి ఎడ్యుకేష‌న్ క్వాలిఫికేష‌న్స్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

ABN , First Publish Date - 2021-12-09T14:01:42+05:30 IST

కోట్లాది రూపాయలు కూడబెట్టి.. రాజభోగాలు..

వారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు.. ఏది ముట్టుకున్నా బంగారమే.. అయితే వారి ఎడ్యుకేష‌న్ క్వాలిఫికేష‌న్స్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..
జెఫ్‌ బెజోస్‌

కోట్లాది రూపాయలు కూడబెట్టి.. రాజభోగాలు అనుభవించే అపర కుబేరుల పేర్లు చెప్పమంటే వెంటనే టకటకా ఓ పది మంది పేర్లు చెప్పొచ్చు. అలాగే వారికి గల ఆస్తిపాస్తులను కూడా లెక్కగట్టి వివరించవచ్చు.  అయితే వారు ఏం చదువుకున్నారంటే మాత్రం మౌనం వహించాల్సివస్తుంది. ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునే పలువురు శ్రీమంతులు పెద్ద పెద్ద చదువులు చదవకుండానే కోట్లకు పడగలెత్తారు..  అలా..ఫోర్బ్స్ జాబితాలో అత్యంత ధనవంతులుగా స్థానం దక్కించుకున్నకొంతమంది ధనవంతుల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. 


జెఫ్‌ బెజోస్‌

ఫోర్బ్స్ వెల్లడించిన అత్యంత ధనవంతుల జాబితాలో స్థానం సంపాదించుకున్న జెఫ్ బెజోస్ 1994లో అమెజాన్‌ను స్థాపించారు. తన 16 ఏళ్ల‌ వయసులో ఆయన మెక్ డోనాల్డ్స్‌లో కుక్‌గా పనిచేశారు. గంటకు 2.69 డాలర్ల మొత్తాన్ని ఆయన తాను చదువుకునే రోజుల్లోనే సంపాదించేవారు.  జెఫ్‌ బెజోస్‌ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.


ఎలన్‌ మస్క్‌

తన 12 ఏళ్ల వయసులో స్పేస్ థీమ్‌తో వీడియో గేమ్‌కు కోడింగ్ చేసి.. 500 డాలర్ల పారితోషికం అందుకున్న ఎలన్ మస్క్ ఆ తర్వాత టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థలకు అధిపతి అయ్యారు. 184.5 కుపైగా బిలియన్ డాలర్ల ఆస్తిపాస్తులు కలిగిన ఎలన్ మస్క్ బ్యాచులర్ డిగ్రీ మాత్రమే చేశారు. ఫిజిక్స్, ఎకనామిక్స్‌లో ఎలన్ మస్క్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ కోసం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చేరారు. అయితే కొద్ది రోజుల తరువాత ఏవో కారణాలతో కాలేజీకి వెళ్లడం మానేశారు.


బెర్నార్డ్‌ అర్నాల్ట్‌

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులకు పెట్టిందిపేరు ఎల్వీఎంహెచ్. ఈ సంస్థ అధిపతి బెర్నార్డ్ అర్నాల్డ్. ఈ శ్రీమంతుని సంపద 179.3 బిలియన్ డాలర్లపైమాటే.. ఆయన చదివింది కేవలం డిగ్రీ మాత్రమే. తండ్రి నడిపిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ త్వరగానే సక్సెస్ సాధించారు. ఆ తర్వాత ఎల్వీఎంహెచ్‌లో పెట్టుబడి పెట్టి.. కొంతకాలానికే ఆ కంపెనీని సొంతం చేసుకున్నారు. 


బిల్‌ గేట్స్‌

ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు అతనిది. అతనే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. 1975లో పాల్ అలెన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌ను స్థాపించారు. బిల్‌గేట్స్ ఆస్తుల విలువ 131.6 బిలియన్ డాలర్లపైనే ఉంటుంది. గేట్స్‌.. హార్వర్డ్ యూనివర్సిటీలో లా కోర్సులో చేరినా.. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.  ఆధునిక టెక్నాలజీపై ఉన్న ఆసక్తితో మైక్రోసాఫ్ట్ కంపెనీ నెలకొల్పి, సక్సెస్ సాధించారు. 


మార్క్‌ జుకర్‌బర్గ్‌

ఫేస్ బుక్‌ వేదికగా కోట్లాది మందితో ఒక ప్రత్యేక ప్రపంచాన్నే నెలకొల్పిన జూకర్ బర్గ్.. హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ, కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీలో చేరి.. ఫేస్‌బుక్‌కి ప్రోగ్రాం రాశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో డిగ్రీకి మధ్యలోనే గుడ్ బై చెప్పారు.


వారెన్‌ బఫెట్‌

ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే వారెన్ బఫెట్ తర్వాతే ఎవరైనా.. అనే స్థాయికి ఎదిగిన ఆయన.. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చేశారు. కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే ప్రముఖ ఇన్వెస్టర్లు బెంజిమెన్ గ్రాహమ్, డేవిడ్ డాడ్‌‌ల పరిచయంతో వారెన్‌ బఫెట్‌ పెట్టుబడులపై పట్టు సాధించారు. 


ముఖేశ్‌ అంబానీ

మన దేశ అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆస్తుల గురించి తెలియనివారెవరూ ఉండరు. బాంబే యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన అనంతరం స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏలో చేరారు. అయితే ఆ సమయంలో రిలయన్స్ కొత్త రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించింది. దీనిని గమనించిన ఆయన ఎంబీఏను మధ్యలోనే వదిలేసి ఈ వ్యాపార బాధ్యతలను చేపట్టారు.


గౌతమ్‌ అదానీ

అదానీ గ్రూప్‌ను నెలకొల్పి.. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా పేరొందిన గౌతమ్ అదానీ కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. ఢిగ్రీ చదువుతున్న రోజుల్లోనే గౌతమ్ అదానీ సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు గుజరాత్ వదిలి.. ముంబైకి చేరుకున్నారు. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో కూడా స్థానం దక్కించుకున్నారు. 


Updated Date - 2021-12-09T14:01:42+05:30 IST