మూడోసారి...!

ABN , First Publish Date - 2021-08-31T06:12:05+05:30 IST

కరోనా మూడోవేవ్‌ గురించిన అంచనాలు, విశ్లేషణలు ఎంతోకాలంగా ఉన్నవే. ఆ మహమ్మారి దాడి మూడోసారి తప్పదనీ, ఎప్పుడన్న విషయంలోనే అంచనాలు కాస్తంత తారుమారు కావచ్చునని...

మూడోసారి...!

కరోనా మూడోవేవ్‌ గురించిన అంచనాలు, విశ్లేషణలు ఎంతోకాలంగా ఉన్నవే. ఆ మహమ్మారి దాడి మూడోసారి తప్పదనీ, ఎప్పుడన్న విషయంలోనే అంచనాలు కాస్తంత తారుమారు కావచ్చునని కేంద్రప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు కూడా ఈ మధ్యన అన్నారు. రెండవ విడత ఉధృతి, అది మిగల్చిన విషాదం అంతా ఇంతా కాదు కనుక, మహమ్మారి మూడో ఉధృతి  గురించిన చర్చ తీవ్రంగానే సాగుతున్నది.


ఇప్పుడున్నకంటే శక్తిమంతమైన ఉత్పరివర్తనం సెప్టెంబరులోగా సాధ్యపడితే దేశం మూడోవిడత ఉధృతిని ఎదుర్కోవాల్సి ఉంటుందనీ, అక్టోబర్‌, నవంబరు మాసాల్లో అది పతాకస్థాయికి చేరుతుందనీ ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్త మహీంద్ర అగర్వాల్‌ అంటున్నారు. ఒకవేళ అటువంటిది జరిగినా రెండోవిడతతో పోల్చితే మూడోవిడత బలహీనమేనని కూడా ఆయన భరోసా ఇస్తున్నారు. కొత్త ఉత్పరివర్తనాలు మరో ఉధృతిని సృష్టించగలిగినా, చెన్నయ్‌వంటి 80శాతం ఇమ్యూనిటీ ఉన్న నగరాల్లో వేవ్‌కు ఎంతమాత్రం అవకాశం ఉండదని ఈ మధ్యనే మరో శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడీఎం) ఏర్పాటు చేసిన కమిటీ ఒకటి సెప్టెంబరు–అక్టోబరు మాసాల్లో కరోనా భీకరదాడి తప్పదని తేల్చేయడమే కాక, పెద్దలతో పాటు పిల్లలకూ ఈ మారు ఇబ్బందులు తప్పవు కనుక వారిని కూడా దృష్టిలో పెట్టుకొని వైద్యపరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నది. ఎస్‌బీఐ పరిశోధన ఒకటి ఆగస్టు మధ్యలోనే కొవిడ్‌ పునరాగమనం మొదలై, సెప్టెంబరుకల్లా కేసులు పతాకస్థాయికి చేరుతాయని విశ్లేషించిన విషయమూ తెలిసిందే. 


వరుస ఉధృతులకు మొదటి మందు వాక్సినేషన్‌ మాత్రమే. టీకాతో పాటు యాంటీబాడీలు కూడా వ్యాధివ్యాప్తిని నిరోధించడానికి ఉపకరిస్తాయి కానీ, అవి ఆయా ప్రాంతాల్లో వేరువేరుగా ఉన్నట్టు సీరో సర్వేలు చెబుతున్నాయి. దేశంలో వాక్సినేషన్‌ కార్యక్రమం ఆశించినంత వేగంగా సాగనిమాట నిజమే అయినా, పద్దెనిమిది దాటిన పెద్దల జనాభాలో సగంమందికి కనీసం ఒకవిడత వాక్సిన్‌ అందించిన మైలురాయిని మొన్న గురువారం దాటింది. అలాగే ఒకేరోజు కోటి వాక్సిన్లు వేసిన రికార్డు కూడా ఆ మర్నాడు నమోదైంది. రోజుకు సగటున డెబ్బైలక్షలకు మించి టీకాలు ఇచ్చిన ఘనత కూడా గతవారం దేశం సాధించింది. జూలైవరకూ ఈ సంఖ్య ఇరవైముప్పై లక్షలు దాటని నేపథ్యంలో ఈ ఇది సంతోషించాల్సిన పరిణామమే. దేశంలో ఇప్పుడు 34శాతం జనాభాకు ఒక్కడోసు అందింది. ఇది ప్రపంచ సగటుకంటే ఒకశాతం ఎక్కువ. కానీ, రెండు డోసులూ అందుకున్నవారు పదిశాతం మాత్రమే కనుక, 26‍శాతం ఉన్న ప్రపంచ సగటుతో పోల్చితే ఎంతో వెనుకబడి ఉన్నట్టు. రెండో డోసుకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే, వాక్సిన్‌ వేయించుకున్న ప్రతీ పదిమందిలో ముగ్గురికి మాత్రమే గరిష్ఠ రక్షణ దక్కడం సరికాదు. కొవిషీల్డ్‌ ఉత్పత్తి, సరఫరాల విషయంలో ప్రభుత్వం సరిగా అడుగులువేయకపోవడంతో రెండోడోసు కాలపరిమితిని బాగా పెంచాల్సి వచ్చిందన్న విమర్శలున్నాయి. ప్రతీ పది టీకాల్లో తొమ్మిది ఈ బ్రాండువే కనుక రెండోడోసు పూర్తయినవారి సంఖ్య దేశంలో చాలా తక్కువ. రోజుకు కోటిమందికి టీకావేయగలిగితే సంవత్సరాంతంలోగా దేశ జనాభా అంతటికీ రక్షణ అందించడం సాధ్యపడుతుంది. జనవరి 16న ఆరంభమైన ఈ బృహత్తర కార్యక్రమం ఆదిలో అనేక అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ క్రమంగా గాడినపడింది. తొలి పదికోట్ల డోసులకు 85రోజులు అవసరపడితే, మరో పదికోట్ల డోసులకు నలభైఐదురోజులు పట్టింది. అలాగే, యాభైకోట్లనుంచి అరవైకోట్లకు చేరడానికి ఇరవైరోజులే సరిపోయింది. చైనా తరువాత అత్యధిక టీకాలు వేసిన దేశంగా రికార్డున్నా, టీకా అందని జనాభా ఇంకా ఎక్కువే. యూపీ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు ఆగస్టు మాసంలో భారీ టార్గెట్లు పెట్టుకొని మరీ వాక్సిన్‌ వేశాయి. నవంబరు 30కల్లా రాష్ట్ర ప్రజలందరికీ వాక్సిన్‌ ఇచ్చేయాలని హిమాచల్‌ ప్రదేశ్‌ సంకల్పించింది. మూడోవేవ్‌ ముంచుకొస్తున్నదన్న హెచ్చరికలతో పాటుగానే, రోజుకు కోటిన్నరమందికి వాక్సిన్‌వేసే రోజులు రాబోతున్నాయన్న విశ్లేషణలు కాస్తంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి.

Updated Date - 2021-08-31T06:12:05+05:30 IST