థర్డ్‌ వేవ్‌ తప్పదు

ABN , First Publish Date - 2021-07-13T07:01:12+05:30 IST

ఆప్తులను బలి తీసుకుని.. ఆరోగ్యాన్ని దెబ్బతీసి.. ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలుగజేసిన కరోనా

థర్డ్‌ వేవ్‌ తప్పదు

  • కీలక సమయంలో యంత్రాంగం, ప్రజల్లో అలసత్వం.. విహారాలు, తీర్థయాత్రలు, పండుగలు అన్నీ ముఖ్యమే
  • కానీ మూడో వేవ్‌ పొంచి ఉంది.. కొద్ది కాలం జాగ్రత్త.. రెండు, మూడు నెలలు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దు
  • సామూహిక కార్యక్రమాలతో సూపర్‌ స్ర్పెడర్ల ఉద్భవం.. ప్రభుత్వాలు వీటిని నిరోధించాలి: ఐఎంఏ హెచ్చరిక
  • జూలై 4నే థర్డ్‌ వేవ్‌ మొదలు: హైదరాబాదీ ప్రొఫెసర్‌.. పర్యాటకులూ జాగ్రత్త: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి


న్యూఢిల్లీ, జూలై 12: ఆప్తులను బలి తీసుకుని.. ఆరోగ్యాన్ని దెబ్బతీసి.. ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలుగజేసిన కరోనా సెకండ్‌ వేవ్‌ తాలూకు చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్లలో మెదులుతూనే ఉన్నాయి..! మరోసారి లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎదుర్కొన్న అనుభవాన్నీ మర్చిపోలేదు..! ఇప్పటికీ కేసుల సంఖ్య కనిష్ఠ స్థాయికి రానే లేదు..! కానీ, నిబంధనల విషయంలో ప్రజల్లో తీవ్ర నిర్లక్ష్యం..! థర్డ్‌ వేవ్‌ ముప్పు హెచ్చరికలనూ లక్ష్యపెట్టని వైనం..! ఈ నేపథ్యంలో భారత వైద్యుల సంఘం (ఐఎంఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మూడో ముప్పు పొంచి ఉన్నందున వైర్‌సపై పోరాటంలో వెనకడుగు వేయొద్దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఒడిసాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం కావడం, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో కన్వర్‌ యాత్రకు అనుమతి ఇవ్వనున్నారన్న వార్తల నేపథ్యంలో ఐఎంఏ ప్రకటన విడుదల చేసింది.



మహమ్మారుల చరిత్ర చూడండి..

మహమ్మారుల వ్యాప్తి తీరులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధారాలు, చరిత్రను ఓసారి పరిశీలించాలని ఐఎంఏ సూచించింది. ఏ మహమ్మారి నేపథ్యాన్ని చూసినా థర్డ్‌ వేవ్‌ కచ్చితమని తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఇలాంటప్పుడు కరోనా పోయిందన్న భావనతో జాగ్రత్తల పాటింపులో  ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు అలసత్వం కనబరుస్తుండటం, సామూహిక సమావేశాల్లో పాల్గొనడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. జనం పెద్దఎత్తున గుమిగూడే కార్యక్రమాలను నిరోధించాలని రాష్ట్రాలకు సూచించింది. 


అన్నీ ముఖ్యమే.. కానీ కాస్త ఆగండి

విహార, తీర్థ యాత్రలు, పండుగలు, మతపర కార్యక్రమాలు అన్నీ ముఖ్యమైనవే అయినప్పటికీ ప్రజలు మరికొద్ది నెలలు సంయమనం పాటించాలని ఐఎంఏ సూచించింది. ఓవైపు అందరికీ వ్యాక్సిన్‌ అందనే లేదని..  అయినా సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రజలకు అనుతివ్వడమంటే థర్డ్‌ వేవ్‌కు కారణమయ్యే ‘‘సూపర్‌ స్ర్పెడర్ల’’ను అందించినట్లేనని హెచ్చరించింది. కాగా, కరోనాపై సమరం కీలక మలుపులో ఉన్న సందర్భంలో రాబోయే రెండు, మూడు నెలలు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని ఐఎంఏ డాక్టర్‌ జేఏ జయలాల్‌ విన్నవించారు. వైర్‌సపై సన్నద్ధత విషయంలో సంస్థ పరిశీలనతో ప్రత్యేక వీడియో విడుదల చేశారు. 


పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలి: కిషన్‌రెడ్డి

విహార యాత్రలు, పర్యటనలు చేసేవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. కరోనా కారణంగా తమతమ పట్టణాలు, నగరాల్లో ఏం జరిగిందో ఓసారి ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. కొవిడ్‌ నియంత్రణపై రాష్ట్రాలకు మార్గదర్శకాలు ఇచ్చామని.. వాటిని అనుసరించాల్సిన బాధ్యత ఉందన్నారు. 




4నే దేశంలో థర్డ్‌ వేవ్‌ మొదలు


ప్రొఫెసర్‌ డాక్టర్‌ విపిన్‌ శ్రీవాత్సవ


దేశంలో జూలై 4 నుంచే థర్డ్‌ వేవ్‌ మొదలైందా..? ఔననే అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ మాజీ డిప్యూటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ విపిన్‌ శ్రీ వాత్సవ. కరోనా ప్రారంభమైన 463 రోజుల నుంచి కేసులు, మరణాల రేటును ఈయన విశ్లేషిస్తున్నారు. ఈ నెల 4 నుంచి నమోదవుతున్న గణాంకాలు.. సెకండ్‌ వేవ్‌ మొదలైన ఫిబ్రవరి తొలి వారం గణాంకాలకు సమానంగా ఉన్నాయని, దీన్నిబట్టి మూడో వేవ్‌ ప్రారంభమైనట్లేనని చెబుతున్నారు.   సమగ్ర విశ్లేషణ అనంతరం మహమ్మారి వ్యాప్తి తీరును తెలుసుకునేందుకు.. డైలీ డెత్‌ లోడ్‌ (డీడీఎల్‌) పేరిట శ్రీవాత్సవ మూడు ప్రమాణాలను రూపొందించారు. ఫిబ్రవరి మొదటి వారం చివర్లో మరణాలు 100, ఆ దిగువకు వచ్చాయని.. ఆ తర్వాత ఏం జరిగిందో, మళ్లీ జూలై 4 నుంచి అలాంటి ధోరణే కనిపిస్తోందన్నారు.


Updated Date - 2021-07-13T07:01:12+05:30 IST