పొంచి ఉన్న మూడో వేవ్‌ ముప్పు!

ABN , First Publish Date - 2021-07-22T07:03:13+05:30 IST

కరోనా వైరస్‌ మూడో వేవ్‌ ముప్పు అనివార్యమని వైద్య నిపుణులు హెచ్చరించారు.

పొంచి ఉన్న మూడో వేవ్‌ ముప్పు!

  • ఆగస్టు చివర్లో భారత్‌లో మొదలుకావొచ్చు
  • ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడి


న్యూఢిల్లీ/వాషింగ్టన్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ మూడో వేవ్‌ ముప్పు అనివార్యమని వైద్య నిపుణులు హెచ్చరించారు. భారత్‌లో ఇది ఆగస్టు చివర్లో మొదలయ్యే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధనా మండలి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ప్రముఖ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే రెండో వేవ్‌తో పోల్చితే ఇది అంత తీవ్రంగా ప్రభావం చూపించకపోవచ్చని వారన్నారు. భారత్‌కు కొవిడ్‌-19 మూడో వేవ్‌ ముప్పుపై ఐసీఎంఆర్‌ ఒక అధ్యయనం నిర్వహించింది. పలు అంశాలు మూడో వేవ్‌ ముప్పుకు కారణం కావచ్చని ఐసీఎంఆర్‌ అధ్యయనం తెలిపింది. మొదటి, రెండో వేవ్‌లు వచ్చినప్పుడు ప్రజలు పెంచుకొన్న వ్యాధి నిరోధక శక్తి తగ్గడం ఒక కారణంగా నిపుణులు చెపుతున్నారు. కొత్తగా రాబోయే వేరియంట్‌ వల్ల కొవిడ్‌ సోకే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, ఇదే మహమ్మారి మూడోసారి వ్యాపించేందుకు ప్రధాన కారణం కావచ్చని కూడా తెలిపారు. అంతేకాకుండా ప్రజలు గతంలో మాదిరిగా అప్రమత్తంగా ఉండకపోవడం, ముందే కొవిడ్‌ ఆంక్షలను సడలించిన కారణంగా దేశంలో మళ్లీ కొత్త కేసులు భారీగా పెరగొచ్చని నిపుణులు పేర్కొన్నారు. కాగా, కరోనా మూడో వేవ్‌ కచ్చితంగా వస్తుందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ)కూడా హెచ్చరించింది. దేశంలో సోమవారం 30,093 కొత్త కరోనా కేసులు నిర్ధారణ కాగా, మంగళవారం 42,015 కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్క రోజు వ్యవధిలో దాదాపు 12 వేల కేసులు పెరిగాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,12,16,337కి చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,18,480కు పెరిగింది. భారత్‌లో రెండో వేవ్‌లో దాదాపు 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఓ అధ్యయనం తెలుపుతోందని, ఆ మరణాలకు కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలే కారణమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. కాగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 2.88 కోట్లవ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. మరో 53,38,210 డోసులు పంపామని పేర్కొంది.  


అనాథలైన 15 లక్షల మంది చిన్నారులు 

కరోనా వ్యాప్తి ప్రారంభమైన 14 నెలల్లో భారత్‌లో 1,19,000 మంది చిన్నారులు తమ సంరక్షకులను కోల్పోయారని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన జాతీయ ఆరోగ్య సంస్థలు (ఎన్‌ఐహెచ్‌) ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్యయనం వివరాలను లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించారు. భారత్‌లో 25,500 మంది చిన్నారులు తమ తల్లిని కోల్పోతే, 90,751 మంది చిన్నారులు తండ్రిని కోల్పోయారు. మరో 12 మంది చిన్నారులు తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయారని తేలింది. అలాగే, ప్రపంచంలోని 21 దేశాల్లో మొత్తం 15,62,000 మంది చిన్నారులు తమ సంరక్షకులను కోల్పోయారు.

Updated Date - 2021-07-22T07:03:13+05:30 IST