22 గ్రామాల్లో దాహం

ABN , First Publish Date - 2021-06-25T06:31:59+05:30 IST

బాపురం రిజర్వాయర్‌ అడుగంటిపోతోంది. ఆలూరు, హాలహర్వి మండలాల్లో 22 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే ఈ రిజర్వాయర్‌కు తుంగభద్ర డ్యాం నీరే ఆధారం.

22 గ్రామాల్లో దాహం

  1.  ఆలూరులో నీరొదిలి 15 రోజులు
  2.  ఎల్లెల్సీకి నీరు వచ్చేదాకా ఇంతే
  3.  చేతులు ఎత్తేసిన అధికారులు


ఆలూరు, జూన్‌ 24: బాపురం రిజర్వాయర్‌ అడుగంటిపోతోంది. ఆలూరు, హాలహర్వి మండలాల్లో 22 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే ఈ రిజర్వాయర్‌కు తుంగభద్ర డ్యాం నీరే ఆధారం. వచ్చే నెల 15వ తేదీ తరువాతగానీ టీబీ డ్యాం నుంచి నీరు విడుదలయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం బాపురం రిజర్వాయర్‌ పరిధిలోని గ్రామాలకు 15 రోజులకు ఒకసారి కూడా తాగునీరు అందడం లేదు. ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా ఎల్లెల్సీకి వచ్చే నీటి ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు బాపురం రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ఇంకా వర్షాలు కురవలేదు. దీంతో బాపురం జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఆలూరు మండలానికి నీరు వదలక ఇప్పటికే 15 రోజులు గడిపోయింది. ఆలూరు పట్టణంలో 14 వేలకు పైగా జనాభా ఉంది. పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా బిందెడు నీటి కోసం ప్రజలు బోర్ల వద్దకు క్యూ కడుతున్నారు. 


వాటర్‌ ప్లాంట్లకు గిరాకీ


 కొళాయిలకు తాగునీరు విడుదల కాలేదు. దీంతో ప్రజలు వాటర్‌ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. క్యాన్‌ నీటికి రూ.15 చెల్లించి కొంటున్నారు. బాపురం రిజర్వాయర్‌కు తోడు ఆలూరులో అదనపు స్టోరేజీ ట్యాంకు, ఇందిరానగర్‌ వద్ద మరో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ నిర్మిస్తే సమస్య కొంతవరకూ పరిష్కారం అవుతుంది. ఆ దిశగా పాలకులు దృష్టి సారించాల్సి ఉంది. వచ్చే నెల 15న తుంగభద్ర బోర్డు అధికారులు ఎల్లెల్సీ కాలువలకు నీటిని వదిలే అవకాశం ఉంది. అప్పటి వరకూ నీటి కష్టాలు తప్పేలా లేవు.


 ఆలూరు మండలం తుంబలబీడు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రం అయింది. ఈ గ్రామానికి బాపురం రిజర్వాయర్‌ ద్వారా నీరు అందాలి. పట్టణానికే 15 రోజులుగా నీరు సరఫరా కాకపోతే ఇక గ్రామాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించవచ్చు.


కొంటున్నాం..


పట్టణంలో 15 రోజులకు ఒకసారి కొళాయిలకు నీరు వస్తోంది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. క్యాన్‌ నీటికి రూ.15 ఇచ్చి కొంటున్నాం. రోజూ కొనాలంటే ఇబ్బందిగా ఉంది. అధికారులు సమస్యను పరిష్కరించాలి. వారానికి ఒకసారైన నీరు సరఫరా చేస్తే బాగుంటుంది.                         

 - సుధాకర్‌, ఆలూరు


పడిగాపులు కాస్తున్నాం..


నీరు ఎప్పుడు విడుస్తారో తెలియదు. రోజూ పడిగాపులు కాయాల్సి వస్తోంది. 10 రోజులు అయినా నీరు రాకపోతే ఎలా..? అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు..? పొలాల్లోకి వెళ్లి బోరు నీటిని తెచ్చుకుంటున్నాం. 

- మరియన్న, హులేబీడు, ఆలూరు మండలం


అప్పటిదాకా ఇంతే..

బాపురం రిజర్వాయర్‌ నుంచి సక్రమంగా నీటిని సరఫరా చేస్తే, పంచాయతీ ద్వారా వారానికి ఒకసారి కొళాయిలకు వదిలే వీలుంది. కానీ బాపురం రిజార్వయర్‌లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. టీబీ డ్యాం నుంచి ఎల్లెల్సీకి నీరు వదిలే వరకు పరిస్థితి ఇలానే ఉంటుంది.

- నాగభూషన్‌రావు, పంచాయతీ కార్యదర్శి ఆలూరు

Updated Date - 2021-06-25T06:31:59+05:30 IST