ఈ బీజేపీ నేతలకు మంచి, మర్యాద లేవు : మమత బెనర్జీ
ABN , First Publish Date - 2021-07-07T01:47:15+05:30 IST
భారతీయ జనతా పార్టీని తాను చాలా కాలం నుంచి గమనిస్తున్నానని
కోల్‌కతా : భారతీయ జనతా పార్టీని తాను చాలా కాలం నుంచి గమనిస్తున్నానని, ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి విభిన్నంగా ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. రాజ్‌నాథ్ సింగ్ నుంచి సుష్మా స్వరాజ్ వరకు అనేక మంది బీజేపీ నేతలను తాను చూశానని, ప్రస్తుత నేతలకు మంచి, మర్యాద, అణకువ లేవన్నారు. ఈ విషయం ఇటీవల శాసన సభలో గవర్నర్ ప్రసంగం సమయంలో రుజువైందన్నారు.
జూలై 2న శాసన సభ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ప్రసంగిస్తుండగా, బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శాసన సభ ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ గురించి ప్రస్తావించారు.
మమత బెనర్జీ మంగళవారం శాసన సభలో మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ నాయకత్వం ఎంపిక చేసిందని, ఆయన సభను ఉద్దేశించి మాట్లాడటానికి రాష్ట్రంలోని బీజేపీ నేతలు అవకాశం ఇచ్చి ఉండవలసిందని అన్నారు. తాను రాజ్‌నాథ్ సింగ్ నుంచి సుష్మా స్వరాజ్ వరకు అనేక మంది బీజేపీ నేతలను చూశానని, ఇప్పటి బీజేపీ చాలా విభిన్నమైనదని ఆరోపించారు. బీజేపీ సభ్యులకు సంస్కృతి, సంప్రదాయాలు, మర్యాద, అణకువ లేవన్నారు.