ఇది రాజకీయ హత్య

ABN , First Publish Date - 2020-06-05T09:12:35+05:30 IST

‘సందీప్‌ను పక్కా స్కెచ్‌ వేసి చంపారు..

ఇది రాజకీయ హత్య

గ్యాంగ్‌వార్‌ మృతుడు సందీప్‌ సతీమణి తేజస్విని


విజయవాడ(ఆంధ్రజ్యోతి): గ్యాంగ్‌వార్‌లో ప్రాణాలు కోల్పోయిన తోట సందీప్‌కుమార్‌ హత్య వెనుక రాజకీయ హస్తం ఉందా? పండును రాజకీయ నేతలు ఒక పావుగా వాడుకున్నారా? సందీప్‌ రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేని వాళ్లే ఈ పని చేయించారా? అవుననే అంటోంది సందీప్‌ భార్య తోట తేజస్విని. సందీప్‌ చనిపోయిన తర్వాత తొలిసారిగా ఆమె మీడియా ముందుకు వచ్చారు. జరిగిన ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సందీప్‌ హత్య వెనుక రాజకీయ హస్తం ఉందని బాంబు పేల్చారు. పక్కాగా స్కెచ్‌ వేసి తన భర్తను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాంగ్‌వార్‌కు ముందు జరిగిన ఘటనలను వివరిస్తూ తేజస్విని కంటితడి పెట్టారు. ఆ ఆవేదన ఆమె మాటల్లోనే...


‘సందీప్‌ను పక్కా స్కెచ్‌ వేసి చంపారు. భూవివాదానికి, హత్యకు ఎలాంటి సంబంధం లేదు. సందీప్‌ హత్య వెనుక రాజకీయ నాయకుల పాత్ర ఉంది. గ్యాంగ్‌వార్‌కు ముందే నా భర్తకు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. సందీప్‌ను పండు అన్న అనేవాడు. ఏ సహాయం అవసరమైనా సందీప్‌ వద్దకు వచ్చేవాడు. శుక్రవారం నుంచి నా భర్తకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఆ విషయాన్ని నాకు చెప్పలేదు. నీ కుటుంబానికి స్పాట్‌ పెట్టానని బెదిరించాడు. మా మామయ్య ఐరన్‌ షాపులో ఉన్నప్పుడు వెళ్లి పండు బ్యాచ్‌ అటాక్‌ చేసింది. అందులో మా గుమస్తా గాయపడ్డాడు. పండు ఒకడి వల్ల ఇది జరగలేదు. అతడు గంజాయి, డ్రగ్‌ బ్యాచ్‌గాడు. కేవలం నా భర్త అతడితో మాట్లాడడానికి వెళ్లాడు. సందీప్‌పై కారం చల్లి, పండు, వాడి బావమరిది ప్రశాంత్‌, రవితేజ ఎటాక్‌ చేశారు.


పక్కాగా ప్లాన్‌ చేసి చంపారు. ఈ వ్యవహారంలో ఎలాంటి సెటిల్‌మెంట్లు లేవు. సందీప్‌కు ప్రజాసేవ చేయాలని కోరిక ఎప్పటి నుంచో ఉంది. కాలేజీ నుంచి సేవా కార్యక్రమాలు చేసేవాడు. నాకు కార్పొరేటర్‌ సీటు వచ్చినా, ఓటు లేకపోవడంతో రద్దయింది. ఈ కారణంగా ఎవరైనా కక్ష పెట్టుకుని ఈ పని చేయించారేమోనని అనుమానం ఉంది. దీన్ని చిల్లర గ్యాంగ్‌వార్‌గా చిత్రీకరిస్తున్నారు. పండు విశ్వాసం లేకుండా వెన్నుపోటు పొడిచాడు. సందీప్‌పై లేనిపోని ప్రచారం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో ఎక్కడా నా భర్తపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు లేవు. సందీప్‌ మనస్తత్వం నాకు తెలుసు. రెచ్చగొడితే రెచ్చిపోయాడు. వాళ్లంతా ప్రీప్లాన్‌ చేశారని తెలిస్తే సందీప్‌ జాగ్రత్తలు తీసుకునేవాడు. మేము 2017లో ప్రేమవివాహం చేసుకున్నాం. కాలేజీలో చదువుతున్నప్పుడు జరిగిన గొడవలకు సంబంధించి రెండు, మూడు కేసులున్నాయి. వాటిని 2015లో తీసేశారు. అన్యాయంగా నా భర్తను చంపారు. దీని వెనుక రాజకీయ నేతలు ఉన్నారని తెలుసు.


పండుకు అంత సీన్‌ లేదు. సందీప్‌ గొడవ పడేవాడయితే వంద మందిని తీసుకెళ్లేవాడు. ఆయన అందరితో కలిసిమెలసి ఉంటాడు. ఐరన్‌ షాపు తప్ప మాకు ఎలాంటి భూములు లేవు. డబ్బు గురించి ఆలోచిస్తే చాలా సంపాదించేవాడు. మేమేమీ వెనుకేసుకోలేదు. భూవివాదం అయితే మనుషులు చంపేసుకోరు. ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ చేసే పని ఇది. అపార్ట్‌మెంట్‌ పై నుంచి రాళ్లు విసిరారు. సందీప్‌కు ఎవరితోనూ శత్రుత్వం లేదు. నేను మొన్ననే పండు పేరు విన్నా. మాకు పోలీసులే న్యాయం చేయాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. అప్పుడే సందీప్‌ ఆత్మకు శాంతి ఉంటుంది’అని తేజస్విని అన్నారు .


ఇవి కూడా చదవండి:

---------------------------

బెజవాడ ‘గ్యాంగ్‌వార్‌లో.. తవ్వేకొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి..


పోలీసుల విచారణలో.. పండు గురించి కొత్తకొత్త విషయాలు వెలుగులోకి..


పిన్న వయసులోనే పెద్ద చరిత్రలు


గ్యాంగ్‌వార్‌!


Updated Date - 2020-06-05T09:12:35+05:30 IST