డ్యూటీ ఫ్రీ డాక్టర్స్‌

ABN , First Publish Date - 2021-05-06T07:18:12+05:30 IST

ఒకవైపు కొవిడ్‌ విచ్చలవిడి విహారం చేస్తోంది. రెండో అల తీవ్రత వేలాదిమందిని ఆస్పత్రుల పాలు చేస్తోంది. ప్రభుత్వం ఆదేశించడంతో ఆస్పత్రుల్లోనూ బెడ్ల సంఖ్యను పెంచేస్తున్నారు. ఆవరణలో తాత్కాలిక షెడ్లు వేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఒక యుద్ధంలా వైద్య సేవలు అందించాల్సిన ఇటువంటి విపత్కర కాలంలో తిరుపతి నగరంలోని ప్రధాన ఆస్పత్రులైన రుయా, స్విమ్స్‌లో మూడొంతుల మందికి పైగా వైద్యులు, సిబ్బంది ఖాళీగా ఉంటున్నారు.

డ్యూటీ ఫ్రీ డాక్టర్స్‌

 రుయా, స్విమ్స్‌ల్లో కొవిడ్‌ డ్యూటీలకు దూరంగా వెయ్యిమంది వైద్యులు

 జూనియర్లు, నర్సులు, కొత్తవాళ్ల మీదే భారం 


తిరుపతి- ఆంధ్రజ్యోతి

ఒకవైపు కొవిడ్‌ విచ్చలవిడి విహారం చేస్తోంది. రెండో అల తీవ్రత వేలాదిమందిని ఆస్పత్రుల పాలు చేస్తోంది. ప్రభుత్వం ఆదేశించడంతో ఆస్పత్రుల్లోనూ బెడ్ల సంఖ్యను పెంచేస్తున్నారు. ఆవరణలో తాత్కాలిక షెడ్లు వేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఒక యుద్ధంలా వైద్య సేవలు అందించాల్సిన ఇటువంటి విపత్కర కాలంలో తిరుపతి నగరంలోని ప్రధాన ఆస్పత్రులైన రుయా, స్విమ్స్‌లో మూడొంతుల మందికి పైగా వైద్యులు, సిబ్బంది ఖాళీగా ఉంటున్నారు. జనరల్‌ ఓపీలు కూడా రద్దు కావడంతో ఆస్పత్రికి వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోతున్నారు. దీంతో అతి కొద్దిమంది జూనియర్‌ వైద్యులు, సిబ్బంది మీదే పనిభారం అంతా పడుతోంది. అందరికీ కొవిడ్‌ విధులు అప్పగించడంపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. 

   

 ఎస్వీఆర్‌ రుయాస్పత్రిలో 300 మంది అసిస్టెంట్‌, అసోసియేట్‌, ప్రొఫెసర్‌ స్థాయి వైద్యులున్నారు. పీజీ చేసేవారు(మూడేళ్లు కలిపి) మరో 300మంది, క్యాజువాలిటీ వైద్యులు 50మంది, హౌస్‌ సర్జన్లు 200 మంది ఉన్నారు. రుయాతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ప్రసూతి, చిన్నపిల్లల ఆస్పత్రి, ఎస్వీ మెడికల్‌ కళాశాలకు సంబంధించినవారు వీరంతా.  ఇంత మంది ఉన్నా కొవిడ్‌ విధుల్లో ఉన్నది మాత్రం 200 మందే. వీరు కూడా కొత్తగా తీసుకున్న కొవిడ్‌ మెడికల్‌ ఆఫీసర్లు 56 మందితో పాటు 200మంది హౌస్‌ సర్జన్లు, నర్సింగ్‌ సిబ్బందే. అదేవిధంగా ప్రసూతి ఆస్పత్రిలో ఓపీలున్నాయి కాబట్టి 50మంది వైద్యులు, 30 మంది పీజీలు, చిన్నపిల్లల ఆస్పత్రిలో పది శాతం మందివరకు  సాధారణ విధుల్లో ఉంటున్నారు. మిగిలిన దాదాపు 600 మంది వైద్యులు రుయాలో కొవిడ్‌ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. జనరల్‌ ఓపీలు రద్దవడంతో వీరంతా సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారు. అయితే  ప్రైవేట్‌ క్లినిక్‌ల్లో మాత్రం బిజీగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రి సేవల్లో 30 మందే!

 స్విమ్‌లో 120 మంది రెగ్యులర్‌ డాక్టర్లు,  అడహక్‌, రెసిడెంట్స్‌ 80 మంది, 110 మంది పీజీలతోపాటు మొత్తం 310మంది వరకూ వైద్యులు ఉన్నారు.  స్విమ్స్‌ పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రిలో బుధవారానికి 565మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇంతమందికి కలిపి కేవలం 20 మంది నర్సులు, 10మంది జూనియర్‌ వైద్యులు మాత్రమే వైద్య సేవలందిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్‌ఏబీహెచ్‌ నిబంధనల మేరకు ప్రతి ఆరుగురికి ఒక నర్సు అందుబాటులో ఉండాలి. అందులోనూ వెంటిలేటర్లు ఉండే వార్డులో మరింత మంది వైద్య సిబ్బంది అవసరం వుంది.అలాంటిది దాదాపు 30 మందికి ఒక నర్సు ఉండడంతో ఇక్కడ వైద్య సేవలు ఎలా అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వందలాది మంది వైద్యులున్నా వీరికి కొవిడ్‌ డ్యూటీలు ఎందుకు వేయడం లేదో అర్థం కాదు. 

 

వైరస్‌తో పోరాడుతున్న వైద్యులు

కరోనా పోరులో ముందువరసలో నిలబడి యుద్ధం చేస్తున్న వైద్యులపై వైరస్‌ దాడిచేస్తోంది.ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు, వారి కుటుంబ సభ్యులు దాదాపు 20 మంది కరోనాతో పోరాడుతున్నారు. వీరిలో ఐదుగురికి పైగా ఆక్సిజన్‌ బెడ్స్‌పై ఉన్నట్టు తెలుస్తోంది. కరోనాకు ఎవ్వరూ అతీతులు కాదు తగిన జాగ్రత్తలు తీసుకుని కాబట్టి ఎవరి విధులు వారు నిర్వర్తించాల్సిందే. రుయా, స్విమ్స్‌లోని వైద్యులు సంతకాలు చేసి సైలెంట్‌గా ఉండడం కన్నా వారి అనుభవాన్ని ఉపయోగించాలని పలువురు కోరుతున్నారు. 

 

ఆర్‌ఎంవోలా..ఏరీ?

తిరుపతి (వైద్యం), మే 5 :

విపత్కర కాలంలోనూ రుయా ఆర్‌ఎంవోలు నిరంతరం అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు వస్తున్నాయి.  సాధారణంగా ఇలాంటి సమయంలో వైద్యులు, వైద్యాధికారులకు పబ్లిక్‌ హాలిడేస్‌, క్యాజువల్‌ లీవులు ఉండవు, ఎమర్జెన్సీ అంటే ఒకటి రెండు రోజులు సెలవు పెట్టుకునే సౌలభ్యం ఉంటుంది. అలాంటిది సెలవులు బాగానే వినియోగించుకుంటున్నారని తెలుస్తోంది. 24 గంటలూ అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాల్సిన ఆర్‌ఎంఓలు  సెల్‌ ఫోన్లు సైతం స్విచ్ఛాప్‌ చేసుకోవడంపై ఒక సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. వీరు అందుబాటులో లేకపోవడం వల్ల వైద్యపరమైన మెటీరియల్స్‌ ఇండెంట్లపై సంతకం కోసం వచ్చే సిబ్బంది గంటల తరబడి ఆర్‌ఎంవో అధికారుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఇందువల్ల  ఆస్పత్రి సూపరింటెండ్‌పై భారం పెరుగుతోంది. ఈ పరిస్థితిని గుర్తించి సరిదిద్దాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2021-05-06T07:18:12+05:30 IST