పిడుగుపాటుకు ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-05-11T05:22:59+05:30 IST

పిడుగుపాటు ఓ కుటుం బంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.

పిడుగుపాటుకు ముగ్గురి మృతి
భోగరాజు (ఫైల్‌) మల్లమ్మ (ఫైల్‌) రేవతి (ఫైల్‌)

  1. తల్లిదండ్రులు.. ఓ కూతురు..
  2. మరో కూతురి పరిస్థితి విషమం
  3. పెద్దహ్యాటలో విషాద ఘటన


హొళగుంద, మే 10: పిడుగుపాటు ఓ కుటుం బంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆడుతూ పాడుతూ గడపాల్సిన చిన్నారితో పాటు తల్లి, తండ్రి మృత్యు ఒడిలో చేరారు. మరో కూతురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. హొళగుంద మండలంలోని చిన్నహ్యాట పంచాయతీ మజరా, పెద్దహ్యాట గ్రామానికి చెందిన భోగరాజు కుటుంబం మేకల ద్వారా జీవనోపాధి పొందుతోంది. మేత కోసం సోమవారం మధ్యాహ్నం మేకలను తీసుకుని తమ పొలానికి కుటుంబ సభ్యులు అందరూ వెళ్లారు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. భోగరాజు, భార్య మల్లమ్మ, కూతుర్లు రేవతి, మల్లీశ్వరి, వెన్నెల, మేకలతో కలిసి పొలంలోని వేపచెట్టు కిందకు చేరారు. ఆ సమయంలో పిడుగు పడడంతో భోగరాజు (31), రేవతి (11) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్య మల్లమ్మ (29), మరో కూతురు మల్లీశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. వీరికి హొళగుంద ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మల్లమ్మ మృతి చెందారని బంధువులు తెలిపారు. తల్లి ఒడిలో ఉన్న చిన్నారి వెన్నెలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిడుగుపాటుకు 32 మేకలు కూడా మృతి చెందాయని గ్రామస్థులు తెలిపారు. మృతదేహాల వద్ద బంధువులు భోరున విలపించారు.  ఈ దృశ్యాలను చూసి స్థానికులను కంటతడి పెట్టారు. తల్లిదండ్రులు, సోదరి మృతితో ఇద్దరు చిన్నారులు దిక్కులేని వారయ్యారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. సంఘటనా స్థలాన్ని ఆలూరు సీఐ భాస్కర్‌, హొళగుంద ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ సందర్శించారు.



Updated Date - 2021-05-11T05:22:59+05:30 IST