చాపకింద నీరులా..

ABN , First Publish Date - 2020-05-28T11:04:18+05:30 IST

కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముంబై నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌

చాపకింద నీరులా..

జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్‌ 

ముంబై నుంచి వలస 

ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన వలస కార్మికులు 812 మంది

అందులో 10 మందికి కరోనా  


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముంబై నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారం రోజుల క్రితం వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వలస కార్మికుడు భార్యాకూతురుతో  కలిసి ముంబై నుంచి వచ్చాడు.  వారిలో మొదట భర్తకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో భార్య, కూతురు శాంపిళ్లను పరీక్షలకు పంపించారు. వీరితో పాటు వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ముంబై  నుంచి వచ్చిన వలస కార్మికుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఈ నెల  812 మంది  వలస కార్మికులు ముంబై నుంచి వలస వచ్చారు. వీరిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. లక్షణాలు ఉన్నవారిని పరీక్షించగా  కరోనా పాజిటివ్‌గా తేలింది.


ముంబై నుంచి నిత్యం వలస కార్మికులు వస్తున్నారు. అధికారులు వారిని హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. లక్షణాలు భయటపడ్డ వారికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 10 మంది ముంబాయి నుంచి వచ్చినవారే ఉన్నారు. మిగతా ముగ్గురు మర్కజ్‌ వెళ్లి వచ్చినవారు.  కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-05-28T11:04:18+05:30 IST