టిడ్కో గృహాలకు కదలిక

ABN , First Publish Date - 2021-10-23T06:36:22+05:30 IST

జక్కంపూడిలోని టిడ్కో ఇళ్ల పెండింగ్‌ పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది.

టిడ్కో గృహాలకు కదలిక

బ్యాలెన్స్‌ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు సిద్ధం 

రూ. 190 కోట్ల బ్యాంకు రుణాలకు ప్రయత్నాలు 

యూనియన్‌ బ్యాంకుతో టిడ్కో సంప్రదింపులు 

మౌలిక సదుపాయాల కోసం రూ.58 కోట్లతో ప్రతిపాదనలు

వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు సిద్ధం 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జక్కంపూడిలోని టిడ్కో ఇళ్ల పెండింగ్‌ పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు టిడ్కో అధికారులు ప్రయత్నాలు ఆరంభించారు. జక్కంపూడిలో మొత్తం 6,576 ఇళ్లు దాదాపు 80 శాతం పనులను పూర్తి చేసుకున్నాయి. వివిధ దశల్లో ఉన్న ఈ పనులు పూర్తి కావాలంటే రూ.230 కోట్ల నిధులు అవసరం. ఈ మొత్తంలో రూ.190 కోట్లను రుణంగా తీసుకోవాలని టిడ్కో భావిస్తోంది. తమకు చెల్లింపులు జరగకపోవటంతో కాంట్రాక్టు సంస్థ ఎన్‌సీసీ పనులను నిలిపివేసింది. ఈ క్రమంలో టిడ్కో అధికారులు తాజాగా బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. పెండింగ్‌ పనులకు రుణం ఇవ్వటానికి యూనియన్‌ బ్యాంక్‌ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. టిడ్కో ఇళ్లలో లబ్ధిదారుల వాటాను ముందుగానే కట్టించుకున్నారు. ఇప్పుడిక రాష్ట్ర వాటా నిధులను బ్యాంకు రుణంగా తీసుకోవలసి ఉంటుంది.


రూ.58 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు

టిడ్కో నివాస సముదాయాల్లో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైప్‌లైన్లు, విద్యుద్దీపాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.58 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి టెండర్లు పిలవడానికి సన్నాహాలు చేస్తున్నారు. నవంబరు మొదటి రెండు వారాల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంది. 

Updated Date - 2021-10-23T06:36:22+05:30 IST