నిర్భయ దోషులకు ఆఖరి చూపు కోసం ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-02-23T07:22:58+05:30 IST

నిర్భయ కేసులో దోషులు ఉరికంబం ఎక్కే రోజు సమీపిస్తున్న దృష్ట్యా... జైలు అధికారులు నిబంధనల ప్రకారం చకచకా చర్యలు తీసుకుంటున్నారు.

నిర్భయ దోషులకు ఆఖరి చూపు కోసం ఏర్పాట్లు

  • రెండ్రోజుల ముందే రావాలని తలారికి కబురు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: నిర్భయ కేసులో దోషులు ఉరికంబం ఎక్కే రోజు సమీపిస్తున్న దృష్ట్యా... జైలు అధికారులు నిబంధనల ప్రకారం చకచకా చర్యలు తీసుకుంటున్నారు. కుటుంబసభ్యులను కడసారి చూసుకునే అవకాశం కల్పిస్తామని చెబుతూ ఆ నలుగురు దోషులకు లేఖలు రాశారు. ముఖేశ్‌ కుమార్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌లను మార్చి 3న ఉదయం ఆరింటికి ఉరితీయాల్సిందిగా ఆదేశిస్తూ ట్రయల్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖేశ్‌, పవన్‌ ఇప్పటికే ఒకసారి తమ కుటుంబసభ్యులను కలిశారని జైలు అధికారులు తెలిపారు.


కాగా, కుటుంబసభ్యులను ఎప్పుడు కలుసుకోవాలనుకుంటున్నారో చెప్పాలని జైలు అధికారులు అక్షయ్‌, వినయ్‌లను అడిగారు. మరోవైపు ఉరితీసే రోజుకు రెండు రోజుల ముందే తలారిని పంపాల్సిందిగా తిహార్‌ జైలు అధికారులు యూపీ జైలు అధికారులకు లేఖ రాశారు. ఇదిలావుండగా, వినయ్‌ శర్మకు ఎలాంటి మానసిక వ్యాధి లేదని తిహార్‌ జైలు అధికారులు ట్రయల్‌ కోర్టుకు తెలిపారు. తనకు మతి భ్రమించినట్లుగా శర్మ చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలని పేర్కొన్నారు. శర్మ మానసిక వ్యాధి పీడితుడుకాదనీ, గోడకు తలబాదుకుని తనకు తానే చిన్నపాటి గాయాలు చేసుకున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా నిర్ధారణ జరిగిందని అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణాకు జైలు అధికారుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చెప్పారు. 

Updated Date - 2020-02-23T07:22:58+05:30 IST