ఒరాకిల్, వాల్‌మార్ట్‌ల స్వాధీనంలో టిక్‌టాక్ ?

ABN , First Publish Date - 2020-09-21T01:24:37+05:30 IST

అమెరికాలో టిక్‌టాక్ తన కార్యకలాపాలను కొనసాగించుకునేందుకు వీలుగా పట్టాలెక్కుతున్న ఒప్పందానికి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంగీకారం తెలిపారు. టిక్‌టాక్, అమెరికా సంస్థలు ఒరాకిల్, వాల్‌మార్ట్ మధ్య ప్రతిపాదిత భాగస్వామ్య ఒప్పందానికి ఆమెదం తెలిపినట్లు ట్రంప్ చెప్పారు. అంతకుముందు జాతీయ భద్రతను కారణంగా చూపుతూ టిక్‌టాక్‌ను నిషేధించాలని ట్రంప్ ఆదేశించిన విషయం తెలిసిందే. సేకరించిన డాటాను చైనా ప్రభుత్వానికి చేరవేస్తుందని అమెరికా భద్రతాధికారులు ఆందోళన వ్యక్తంచేసిన నేపధ్యంలో ట్రంప్ తొలుత టిక్‌టాక్ విషయంలో వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

ఒరాకిల్, వాల్‌మార్ట్‌ల స్వాధీనంలో టిక్‌టాక్ ?

వాషింగ్టన్ : అమెరికాలో టిక్‌టాక్ తన కార్యకలాపాలను కొనసాగించుకునేందుకు వీలుగా పట్టాలెక్కుతున్న ఒప్పందానికి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంగీకారం తెలిపారు. టిక్‌టాక్, అమెరికా సంస్థలు ఒరాకిల్, వాల్‌మార్ట్ మధ్య ప్రతిపాదిత భాగస్వామ్య ఒప్పందానికి ఆమెదం తెలిపినట్లు ట్రంప్ చెప్పారు. అంతకుముందు జాతీయ భద్రతను కారణంగా చూపుతూ టిక్‌టాక్‌ను నిషేధించాలని ట్రంప్ ఆదేశించిన విషయం తెలిసిందే. సేకరించిన డాటాను చైనా ప్రభుత్వానికి చేరవేస్తుందని అమెరికా భద్రతాధికారులు ఆందోళన వ్యక్తంచేసిన నేపధ్యంలో ట్రంప్ తొలుత టిక్‌టాక్ విషయంలో వ్యతిరేకతను వ్యక్తం చేశారు.


అయితే... టిక్‌టాక్ యాజమాన్య సంస్థ బైట్ డాన్స్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చింది. చైనాలోని పాలక కమ్యూనిస్టు పార్టీకి తాము ఎలాంటి డేటానూ అందివ్వడం లేదని స్పష్టం చేస్తోంది. కొత్త ఒప్పందంపై ట్రంప్ శనివారం మాట్లాడుతూ... టిక్‌టాక్ వాడుతున్న 10 కోట్ల మంది అమెరికన్ల డేటా భద్రంగా ఉండేలా ఈ ఒప్పందం భరోసానిస్తుందన్నారు. ‘ఇది 100 శాతం భద్రమైనది’ అని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. నార్త్ కరోనాలినాలో ఎన్నికల సభలో పాల్గొనడానికి వెళుతూ ట్రంప్ మాట్లాడారు. 'ఈ ఒప్పందానికి నా ఆశీస్సులున్నాయి. దీన్ని నేను ఆమోదిస్తున్నాను' అని పేర్కొన్నారు.


కాగా చైనా ప్రభుత్వ అనుమతులు కూడా అవసరమైన ఈ ఒప్పందానికి సంబంధించి బైట్ డ్యాన్స్ ఇంకా ఏమీ స్పష్టతనివ్వలేదు. ఆదివారం నుంచి అమెరికాలో ఏ యాప్ స్టోర్‌లో కూడా టిక్‌టాక్ లేకుండా చేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన తరువాత మళ్లీ ఈ ఒప్పందం తెరమీదకొచ్చింది. ఈ క్రమంలో... యాప్ లభ్యత ముగింపు గడువు మరోవారం రోజులు పెంచుతున్నామని,  సెప్టెంబరు 27 వరకు టిక్ టాక్ యాప్ స్టోర్లలో ఉంటుందని, అప్పటికీ ఒప్పందం కుదరనిపక్షంలో యాప్ స్టోర్ల నుంచి తొలగిస్తారని అమెరికా కామర్స్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.


వాణిజ్య యుద్ధం, హాంకాంగ్ సమస్య, కరోనావైరస్‌ తదితర అంశాలు, పరిణామాలకు కారకులెవరన్న చర్చ నేపథ్యంలో అమెరికా, చైనాల మధ్య వివాదం ముదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌పై ట్రంప్ ప్రభుత్వం ఆగ్రహించింది. 

కొత్త ఒప్పందంలో ఏముందంటే... 

ఈ ఒప్పందం ప్రకారం టిక్‌టాక్ గ్లోబల్ అనే కొత్త సంస్థ ఏర్పడుతుందని రాయిటర్స్ వెల్లడించింది. ఈ కంపెనీలో అమెరికాకు చెందిన డైరెక్టర్‌లే అధిక సంఖ్యలో ఉంటారు. ఛీఫ్ ఎగ్జ్సిక్యూటివ్, చీఫ్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా కూడా అమెరికన్‌లే ఉంటారు. ఒరాకిల్, వాల్‌మార్ట్‌లు ఇందులో చెప్పుకోదగ్గ స్థాయిలో వాటాదారులుగా ఉంటాయని రాయిటర్స్ వెల్లడించింది. అమెరికా కోరుతున్న అన్ని రకాల భద్రతా ప్రమాణాలనూ పాటించడానికి టిక్‌టాక్ యాజమాన్య సంస్థ బైట్ డాన్స్ అంగీకరించింది.


కాగా... టిక్‌టాక్ డేటాను ఒరాకిల్ సంస్థ స్టోర్ చేయనుంది. అలాగే సోర్స్ కోడ్‌ను తనిఖీ చేసే అధికారం కూడా ఒరాకిల్‌కు ఉంటుంది. ఈ కొత్త కంపెనీ పూర్తిగా ఒరాకిల్, వాల్ మార్ట్‌ల నియంత్రణలో ఉంటుందని ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందం అమెరికాలో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని, దేశానికి పన్ను ఆదాయం కూడా అందిస్తుందని ట్రంప్ చెబుతున్నారు. కాగా... ‘డోనల్డ్ ట్రంప్ కోరుకున్న ఒప్పందం ఇది కాదు. కంపెనీకి చెందిన యూఎస్ విభాగాన్ని విక్రయించాలని ఆయన కోరుకున్నారు. ఇప్పుడు జరుగుతున్నది వేరు.


ఇది మూడు కంపెనీల మధ్య జాయింట్ వెంచర్ వంటిది. ఒరాకిల్, వాల్‌మార్ట్‌లు అమెరికా వినియోగదారుల డాటాను భద్రంగా చూసుకునే నమ్మకస్థులైన భాగస్వాములుగా ఉంటారు’ అని రాజకీయ. వాణిజ్య విశ్లేషకుడు జేమ్స్ క్లేటన్ పేర్కొన్నారు. అయితే, ఈ ప్రతిపాదిత కొత్త కంపెనీలో ఇప్పటికీ టిక్‌టాక్ యాజమాన్య సంస్థైన చైనా కంపెనీ బైట్‌డాన్సే అతి పెద్ద వాటాదారుగా ఉండనుండడం గమనార్హమన్న వ్యాఖ్యానాలు కూడా వినవస్తున్నాయి. 

 ట్రంప్ ఆమోదానికి కారణం... 

కొత్త భద్రతా ఏర్పాట్లతో ట్రంప్ సంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నారని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఈ కొత్త ఒప్పందం 500 కోట్ల డాలర్ల విద్యానిధిని అందించనుండడమే కాకుండా దేశంలో 25 వేల కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్లు చెబుతున్నారు. అయితే... ‘ఇదంతా ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. చైనా ప్రభుత్వం దీనికి ఇంకా ఆమోదం తెలపలేదు. అంగీకరిస్తుందన్న గ్యారంటీ కూడా లేదు’ అన్న వ్యాఖ్యానాలూ వినవస్తున్నాయి. మొత్తంమీద ‘టిక్‌టాక్’ ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది కంట్రీ’గా మారింది. 

Updated Date - 2020-09-21T01:24:37+05:30 IST