'టైమ్స్' ప్రభావశీల వ్యక్తుల్లో మోదీ, పిచాయ్

ABN , First Publish Date - 2020-09-23T23:36:24+05:30 IST

ప్రపంచంలోని 100 మంది ప్రతిభావంతులైన వ్యక్తుల జాబితా (2020)ను అమెరికాకు చెందిన ప్రఖ్యాత..

'టైమ్స్' ప్రభావశీల వ్యక్తుల్లో మోదీ, పిచాయ్

న్యూయార్క్: ప్రపంచంలోని 100 మంది ప్రతిభావంతులైన వ్యక్తుల జాబితా (2020)ను అమెరికాకు చెందిన ప్రఖ్యాత "టైమ్స్'' మ్యాగజైన్ విడుదల చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, లండన్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్న భారత సంతతి వైద్యుడు రవీంద్ర గుప్తా, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, సీఏఏ వ్యతిరేక నిరసనలకు కేంద్ర బిందువైన షహీన్‌భాగ్ నిరసనల్లో పాల్గొన్న 82 ఏండ్ల బిల్కిస్ దాది తదితరులకు టైమ్స్‌ జాబితాలో చోటుదక్కింది.


'టైమ్స్' మ్యాగజైన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో పేర్కొంటూనే ఆయనపై కొన్ని పదునైన వ్యాఖ్యలు చేసింది. 'ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు సహా భిన్న మతాల ప్రజలు ఉన్నారు. శరణార్ధిగా చాలాకాలంగా ఇండియాలోనే ఉంటున్న దలైలామా పరమత సామరస్యం, సుస్థిరతకు ఒక ఉదాహరణగా ఇండియాను ప్రశంసించారు. అయితే ఈ విషయంలో నరేంద్ర మోదీ పలు అనుమానాలకు తావిస్తున్నారు' అని టైమ్స్ మ్యాగజైన్ కరస్పాండెంట్ కార్ల్ విక్ రాశారు.


ఇక, టైమ్స్ ప్రతిభాశీలుర జాబితాలో బాలీవుడ్ నుంచి ఆయుష్మాన్ ఖారానా ఒక్కరికే చోటు దక్కింది. 36 ఏళ్ల ఆయుష్మాన్ ఖురానా రియాల్టీ షో నుంచి ఆర్జే, వీజేగా, టీవీ షోల హోస్ట్‌గా పనిచేసి, 2012లో 'విక్కీ డోనార్'తో బాక్సాపీస్ రికార్డులు సృష్టించారు. బరైలీ కీ బర్ఫి, ఆర్టికల్ -15, డ్రీమ్ గర్ల్, బధాయీ హో, శుభ్ మంగళ్ సావధాన్ తదితర చిత్రాల్లో నటించారు.టాప్ స్టార్లలో ఒకడిగా నిలిచారు. ఆయా పాత్రల్లో పరకాయప్రవేశం చేశారన్న పేరు తెచ్చుకున్నారు.


ప్రాణాంతక హెచ్ఐవీ రీసెర్చ్ పయనీర్‌గా పేరు తెచ్చుకోవడం ద్వారా భారత సంతతికి చెందిన రవీందర్ గుప్తా టైమ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. భారతీయ మూలాలున్న సుందర్‌ పిచాయ్ భారతదేశం నుంచి అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లి ట్రిలియన్ డాలర్ల కంపెనీకి సీఈవో కావడం వరకు అతని కథ చాలా ప్రత్యేకమైనదని టైమ్స్‌ మ్యాగజైన్‌ కొనియాడింది. ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరిగిన సీఏఏ వ్యతిరేక ప్రదర్శనల్లో ప్రతిరోజూ 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ పాల్గొన్న 82 ఏళ్ల మహిళ బిల్కీస్‌ను కూడా ఈ జాబితాలో టైమ్స్ చేర్చింది.


చైనా అధినేత జి జిన్‌పింగ్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మన్ నేత ఉర్సులా వాన్ డెర్ లెయెన్, బ్లాక్ లైవ్స్ మేటర్ ఫౌండర్స్ అలిసియా గార్జా, పాట్రిస్ కుల్లర్స్, ఓపాల్ చొమెటి, అలీబాబా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి డేనియల్ ఝాంగ్, మ్యూజిషియన్ మేగన్ థీ స్టలియాన్, టెన్నిస్ స్టార్ నవోవి ఒసాకా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జెరిమీ పోవెల్, సింగ్ సెలీనా గోమెజ్, నటుడు ఫోబె వాలర్-బ్రిడ్జి తదితరులకు జాబితాలో చోటు దక్కింది.

Updated Date - 2020-09-23T23:36:24+05:30 IST