తిరుపతి డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ సీజ్‌

ABN , First Publish Date - 2020-02-28T11:32:28+05:30 IST

తిరుపతి నగరం తీర్థకట్టవీధిలోని ‘తిరుపతి డయాగ్నోస్టిక్‌ సెంటర్‌’ను అధికారులు గురువారం రాత్రి సీజ్‌ చేశారు. పోలీసు కేసూ నమోదు చేశారు. అనుమతుల్లేకుండా ఈ సెంటర్‌లో అన్ని

తిరుపతి డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ సీజ్‌

తిరుపతి (వైద్యం), ఫిబ్రవరి 27: తిరుపతి నగరం తీర్థకట్టవీధిలోని ‘తిరుపతి డయాగ్నోస్టిక్‌ సెంటర్‌’ను అధికారులు గురువారం రాత్రి సీజ్‌ చేశారు. పోలీసు కేసూ నమోదు చేశారు. అనుమతుల్లేకుండా ఈ సెంటర్‌లో అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారని, లింగనిర్ధారణ పరీక్షలూ చేస్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో వైద్య బృందంతో కలిసి జిల్లా అదనపు వైద్యాధికారిణి డాక్టర్‌ పి.రమాదేవి గురువారం సాయంత్రం తనిఖీలు చేశారు. సెంటర్‌ నిర్వహణకు అనుమతి లేదని తేలింది. అర్హతలేని శ్రీనివాసులు డాక్టరుగా వైద్య పరీక్షలు చేస్తూ వీరికి దొరికిపోయాడు. దీనికి సరైన సమాధానమివ్వని అతడు, తాను విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించానని, అక్కడ ప్రాక్టీసు చేసిన అనుభవం ఉందని, రుయాస్పత్రిలోనూ పనిచేసిన తాను వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటం తప్పెలా అవుతుందని వాదనకు దిగాడు. తన వద్దకు రోగులు వస్తున్నారు కాబట్టి వైద్య పరీక్షలు చేస్తున్నానని చెప్పడంతో వైద్యాధికారిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండీ, డిప్లొమా వంటి వైద్యకోర్సులు చేసిన వారే రేడియాలజిస్టుగా వైద్యపరీక్షలు నిర్వహించాలని అదనపు డీఎంహెచ్‌వో రమాదేవి స్పష్టంచేశారు. ఇవేవీ లేకుండా వైద్య పరీక్షలు ఎలా చేస్తున్నావంటూ నిలదీశారు. అర్హత లేకుండా ఒంటిపై ఆఫ్రాన్‌ వేసుకుని, డాక్టర్‌గా చెలామణి కావడం, అర్హతలేని సిబ్బంది ద్వారా అన్ని రకాల పరీక్షలు చేయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ల్యాబ్‌, మెడికల్‌ స్టోర్‌లో తనిఖీలు చేసి అనుమతి లేని.. నాణ్యతలేని మందులు విక్రయిస్తున్నారంటూ మండిపడ్డారు. కాగా, డాక్టరుగా చెలామణి అవుతున్న శ్రీనివాసులు, అతడు చేస్తున్న వైద్యపరీక్షల మోసాలపైన ఆమె ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను సీజ్‌ చేసి, ఆ తాళాలను పోలీసులకు అందజేశారు. 


మా కళ్లు తిరుగుతున్నాయ్‌

ఎవరో డాక్టర్‌ వెంకటరమణ పేరుతో తిరుపతి డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారని అదనపు వైద్యాధికారిణి రమాదేవి మీడియాకు తెలిపారు. రేడియాలజిస్టుగా కాకపోయినా చాలా కాలంగా డాక్టర్‌గా శ్రీనివాసులు చెలామణి అవుతున్నాడన్నారు. గోపాల్‌ అనే వ్యక్తి ద్వారా అన్ని రకాల రక్తపరీక్షలు, లింగనిర్ధారణ అలా్ట్రస్కానింగ్‌ పరీక్షలు, మహిళలకు సంబంధించిన క్లిష్టమైన కేసులను, గైనకాలజిస్టులు చేయాల్సిన స్కానింగ్‌ లనూ ఈ నకిలీ డాక్టరే చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. కనీసం స్కానింగ్‌ పరికరాలను తాకే అర్హతలేని వ్యక్తి ఈ సెంటర్‌లో అన్ని పరీక్షలు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, నగరంలోని చాలా మంది వైద్యులు ఈ నకిలీ వైద్యుడి వద్దకే కేసులను రెఫర్‌ చేయడం నమ్మలేక పోతున్నామని, ఇదంతా చూస్తుంటే తమకే కళ్లు తిరుగుతున్నాయన్నారు. ఇందులో ప్రజలే కాదు, రెఫర్‌ చేస్తున్న డాక్టర్లూ మోసపోతున్నారని ఆమె చెప్పారు. ఇలా అనుమతుల్లేని పలు కేంద్రాలున్నాయని, వాటిపైనా దాడులు చేస్తామన్నారు. ఈ దాడుల్లో సీహెచ్‌వో పురుషోత్తం పాల్గొన్నారు. కాగా, ఇదే తిరుపతి డయాగ్నోస్టిక్‌పైన మూడేళ్ల కిందట కూడా జిల్లా వైద్యాధికారులు దాడులు చేశారు. 

Updated Date - 2020-02-28T11:32:28+05:30 IST