మమత ఢిల్లీ ప్రసంగం కోసం బీజేపీ రాష్ట్రాల్లో జెయింట్ స్క్రీన్‌లు

ABN , First Publish Date - 2021-07-20T01:49:39+05:30 IST

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈనెల 21న చేయనున్న ప్రసంగం బ్రాడ్‌కాస్ట్..

మమత ఢిల్లీ ప్రసంగం కోసం బీజేపీ రాష్ట్రాల్లో జెయింట్ స్క్రీన్‌లు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈనెల 21న చేయనున్న ప్రసంగం బ్రాడ్‌కాస్ట్ చేసేందుకు పలు కీలక రాష్ట్రాల్లో జెయింట్ స్క్రీన్‌లను ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీఎంసీ) ఏర్పాటు చేస్తోంది. ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ  జెయింట్ స్క్రీన్‌లను ఉద్దేశించినట్టు టీఎంసీ నేత మదన్ మిత్రా వెల్లడించారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, త్రిపురలోని అగర్తలా, అసోంలోని గౌహతి, సిల్చార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్‌లోనూ ఈ జెయింట్ స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించినట్టు చెప్పారు.


ప్రధాన ఈవెంట్ ఢిల్లీలోని కన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరుగుతుందని, మమతా బెనర్జీ వర్చువల్ ప్రసంగం చేస్తారని మిత్రా చెప్పారు. ''అమరవీరుల దినోత్సవాన్ని పార్టీ నిర్వహిస్తోంది. గత ఏడాది వర్చువల్ తరహాలోనే ఈవెంట్ నిర్వహించాం. ఈసారి జరిగే ఈవెంట్‌కు ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానిస్తున్నాం. పార్టీ ప్రకటించిన 'ఢిల్లీ' ఛలో దిశగా వేస్తున్న అడుగు ఇది. బెంగాల్‌ను మళ్లీ మేము గెలుచుకున్నాం. రాష్ట్రం వెలుపల ఉంటే ప్రజలు సైతం బీజేపీకి ఏకైక పోటీదారుగా మమత వైపు చూస్తున్నారు'' అని మిత్రా అన్నారు.


టీఎంసీ ఏటా జూలై 21వ తేదీని అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తుంటుంది. 1993లో కోల్‌కతాలో మమతా నాయకత్వంలో స్టేట్ యూత్ కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీపై పోలీసులు కాల్పులు జరిపినప్పుడు  13 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్నించి ఏటా అదే రోజున అమరవీరుల దినోత్సవాన్ని టీఎంసీ నిర్వహిస్తూ వస్తోంది.


యూపీ ఎన్నికల్లో బీజేపీకి భారీ నష్టం..

ఈసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ నష్టాన్ని చవిచూడబోతోందని మిత్రా జోష్యం చెప్పారు. 2024లో బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకుందా లేదా అనే దాన్ని యూపీ ఎన్నికల ఫలితాలే నిర్దారిస్తాయని అన్నారు.

Updated Date - 2021-07-20T01:49:39+05:30 IST