కథ మొదటికి

ABN , First Publish Date - 2022-09-21T04:46:21+05:30 IST

ఓడీఎఫ్‌, ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాల్లో కథ మళ్లీ మొదటికి వచ్చింది. వంద శాతం మరుగుదొడ్లను వినియోగించే గ్రామాలను ఓడీఎఫ్‌ గ్రామాలుగా, వంద శాతం మరుగుదొడ్లను వినియోగించడంతో పాటు తడిపొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, వృఽథా నీరు ఇళ్ల ముందు, రోడ్లపై పారకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకున్న గ్రామాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా ప్రకటించారు.

కథ మొదటికి
లింగనపల్లిలో నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్డి

ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాల్లో నెరవేరని లక్ష్యం

పూర్తి స్థాయిలో వినియోగించని మరుగుదొడ్లు

వేర్వేరుగా సేకరించని తడిపొడి చెత్త

పూర్తిగా వినియోగంలో లేని ఇంకుడు గుంతలు

పర్యవేక్షణకు రానున్న కేంద్ర, రాష్ట్ర బృందాలు

కాయకల్ప చికిత్స చేపట్టిన జిల్లా యంత్రాంగం


మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 20: ఓడీఎఫ్‌, ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాల్లో కథ మళ్లీ మొదటికి వచ్చింది. వంద శాతం మరుగుదొడ్లను వినియోగించే గ్రామాలను ఓడీఎఫ్‌ గ్రామాలుగా, వంద శాతం మరుగుదొడ్లను వినియోగించడంతో పాటు తడిపొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, వృఽథా నీరు ఇళ్ల ముందు, రోడ్లపై పారకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకున్న గ్రామాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా ప్రకటించారు. ఆ తర్వాత ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాల్లో తడి పొడి చెత్తను డంపింగ్‌ యార్డ్‌లకు తరలించి రీ సైక్లింగ్‌ చేయాలని నిర్ణయించారు. ఓడీఎఫ్‌, ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా ప్రకటించేటప్పుడు అధికారులు హడావుడి చేసి, ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. దాంతో మరుగుదొడ్లు ఉన్నా వినియోగించకపోవడం, తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించకపోవడం, ఇంకుడు గుంతలను పూర్తిగా నిర్మించకపోవడం వంటి సమస్యలు నెలకొంటున్నాయి. ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు రానుండటంతో అధికారులు కాయకల్ప చికిత్స చేపట్టారు. అందుకోసం మండలానికో కమిటీని వేసి డో టు డోర్‌ సర్వే చేయిస్తున్నారు.


కేటగిరీల విభజన ఇలా..

పరిస్థితులను పరిశీలించి ఆయా గ్రామాలను ఆస్పైరింగ్‌, రైజింగ్‌, మోడల్‌ కేటగిరీలుగా విభజించనున్నారు. తడిపొడి చెత్త వేరుగా సేకరించడం, ఇంకుడు గుంతలను పూర్తి స్థాయిలో వినియోగించడం, వాల్‌పెయిటింగ్‌ ఉంటే ఆ గ్రామాలను మోడల్‌ గ్రామాలుగా గుర్తిస్తారు. తడిపొడి చెత్త సేకరించడం, వాల్‌ పెయింటింగ్‌లు ఉంటే రైజింగ్‌, కేవలం తడిపొడి చెత్త మాత్రమే సేకరిస్తుంటే ఆస్పైరింగ్‌ కేటరిగిలో ఉంచుతారు.


 183 ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలు

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 మండలాల్లో 441 గ్రామాలు ఉండగా, 183 గ్రామాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా ప్రకటించారు. వాటిని మూడు కేటగిరీలుగా విభజించి ర్యాంక్‌లు ఇస్తున్నారు. చాలా రోజులుగా చేస్తున్న ఈ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ఓడీఎఫ్‌ ప్లస్‌ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బృందాలు రానుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ బృందాలు వచ్చేలోపు కాయకల్ప చికిత్స చేయాలని నిర్ణయించాయి. 14 మండలాల్లో 14 కమిటీలను వేసి, కొద్ది రోజులుగా గ్రామాల్లో డోర్‌ టు డోర్‌ సర్వే చేస్తున్నాయి. ఎంపీడీవో, ఎంపీవో, ఏపీఎంలతో ఈ కమిటీలను వేశారు. ఒక మండల టీమ్‌ మరో మండలంలో సర్వే చేస్తోంది. టీమ్‌లు గ్రామాల్లోకి వెళ్ళి మరుగుదొడ్లు వినియోగిస్తున్నారా లేదా?, తడిపొడి చెత్తను వేరుచేసి తరలిస్తున్నారా లేదా? ఇంకుడుగుంతల వినియోగం ఎలా ఉంది? గ్రామాల్లో ట్రాక్టర్‌లు ఉన్నాయా? వంటి వాటిని పరిశీలిస్తున్నారు. 183 గ్రామాల్లో ఇంకా 18 గ్రామ పంచాయతీలు నివేదిక ఇవ్వాల్సి ఉంది. వారు నివేదిక ఇచ్చాక, ఎక్కడైనా ల్యాబ్స్‌ ఉంటే 15 రోజులు గడువు ఇచ్చి సరి చేసుకోవాలని చెబుతారు.


 పర్యవేక్షణ లేకే..

ఆయా గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించేటప్పుడు, ఓడీఎఫ్‌ ప్లస్‌లో చేర్చే సమయంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిఽధులు హడావుడి చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మొదట్లో అధికారులు, ప్రజాప్రతినిధుల రెగ్యులర్‌ మానిటరింగ్‌ వల్ల చాలావరకు గ్రామాల్లో మార్పు వచ్చినట్లుగా కనిపించింది. తీరా కేటగిరీలు ప్రకటించుకున్నాక వాటి జోలికెళ్ళకపోవడంతో ప్రజలు వాటిని పాటించడం లేదన్న విమర్శలున్నాయి. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను వందశాతం వినియోగిస్తున్న గ్రామాలు కొన్నే ఉన్నాయి. చాలా గ్రామాల్లో వంద శాతం అమలవడం లేదు. మరుగుదొడ్లు ఉన్నా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. ఇంకుడుగుంతలు కూడా పూర్తిగా నిర్మించలేదు. చాలామంది ఇళ్ల ముందు మురుగుపారుతోంది. వృథా నీటిని రోడ్లపైకి వదిలేస్తున్నారు. ఇక తడిపొడి చెత్తను వేర్వేరుగా కాకుండా అంతా కలిపి సేకరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో చెత్తను డంపింగ్‌ యార్డ్‌కు కూడా తీసుకెళ్ళడం లేదు. అధికార యంత్రాంగం దీనిపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర బృందాలు గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సర్వే చేయించాల్సి రావడం చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.


వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు సర్వే

ఓడీఎఫ్‌ గ్రామాల్లో వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు మండల అధికారుల కమిటీ గ్రామాల్లో పర్యటించనుంది. కమిటీలో ముగ్గురు అధికారులు ఉంటారు. సర్వే వివరాలతో నివేదిక ఇస్తారు.

- పవన్‌ కోఆర్డినేటర్‌



Updated Date - 2022-09-21T04:46:21+05:30 IST