పొగాకు.. ఆశలన్నీ ధరపైనే..

ABN , First Publish Date - 2022-01-21T05:15:08+05:30 IST

మెట్ట ప్రాంతంలో ప్రధాన ఆదాయ వనరు వర్జీనియా పొగాకు సాగు.

పొగాకు.. ఆశలన్నీ ధరపైనే..
పొగాకు పంటపై డ్రోన్‌తో పురుగు మందు పిచికారీ

గోపాలపురం, జనవరి 20: మెట్ట ప్రాంతంలో ప్రధాన ఆదాయ వనరు వర్జీనియా పొగాకు సాగు. ఇసుక, ఎర్రని తేలికపాటి నేలలు కావడంతో ఈ ప్రాంతం పొగాకు సాగుకు అనుకూలం. ప్రస్తుత సీజన్‌లో సాగుకు ఆది నుం చి ఆటంకాలే. నారుమడులు సిద్ధమైన తరుణంలో తుఫాన్‌ ముంచేసింది. నారు పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ వర్షాలకు నేల అదనుగా లేకపోడంతో నాట్లు ఆలస్యంగా పడ్డాయి. దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్న రైతులు మంచి ధర దక్కుతుందని ఆశిస్తున్నారు.


మండలంలో 1383 మంది రైతులు 1626 బేరన్లలో 8690 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నట్లు అంచనా. తుఫానుకు ముందు వేసిన నాట్లు ఏపుగా పెరిగితే, వర్షాల సమయంలో నాట్లు పడిన భూముల్లో పెరుగుదల తగ్గింది. ప్రస్తుతం పొగాకు తోటలు క్యూరింగ్‌ దశలో ఉన్నాయి. ఈ దశలో వాతావరణంలో మార్పులతో ఆకు పలుచబడి సీతాఫలం తెగులు ఆశించే అవకాశం ఉంది. పొగాకు బోర్డు సిఫారసుచేసిన మందులను తగిన మోతా దులో పిచికారీ చేసి తెగుళ్లను నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు. పొగాకు దిగుబడి తగ్గే పరిస్థితులున్నా ధరపైనే రైతుల ఆశలన్నీ..!


యాజమాన్య పద్ధతులు


సాధారణంగా క్యూరింగ్‌ దశలో తెగుళ్ల నివారణకు బోర్డు అధికారులు సూచించే అమిస్టార్‌ను 10 లీటర్ల నీటిలో 4గ్రాముల మందు కలిపి పిచికారీ చేయాలి. ఆకును ఆశించే చీడపీడల నివారణకు 10 లీటర్ల బెంజిన్‌, 3 నుంచి 5 గ్రాములు పొక్లైన్‌ మందును నీటిలో కలిపి పిచికారీ చేయాలి.


గిట్టుబాటు ధర కల్పించాలి

తుఫాన్‌ ప్రభావంతో మొక్క పెరుగుదల క్షీణించింది. దిగుబడి తగ్గుతుంది. బిందు సేద్యం పరికరాలపై (డ్రిప్‌) రాయితీ ఎత్తివేయడంతో కూలీలు దొరక్క అవస్థలు పడుతున్నాం. గిట్టుబాటు ధర కల్పించాలి.

గెడా భాస్కరరావు, పొగాకు రైతు, రాజంపాలెం


నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలి

గిట్టుబాటు ధర లభించాలంటే పురుగు మందు అవశేషాలు లేని నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఖర్చు ఆదా అవుతుంది.

ఎం.ఆదిశేషు, వేలం నిర్వహణాధికారి, గోపాలపురం

Updated Date - 2022-01-21T05:15:08+05:30 IST