ముగింపులోనూ మారని తీరు

ABN , First Publish Date - 2021-08-02T04:41:27+05:30 IST

ఈ సీజన్‌ పొగాకు కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నా మార్కెట్‌ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. వ్యాపారులు ఇచ్చేది ధర అవుతోంది.

ముగింపులోనూ మారని తీరు

భారీగా పొగాకు బేళ్ల తిరస్కరణలు

లోగ్రేడ్‌ల వైపు చూడని వ్యాపారులు

ధరలు తగ్గించినా కొనుగోలు చేయక

నోబిడ్‌లు పెడుతున్న అధికారులు


ఒంగోలు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : ఈ సీజన్‌ పొగాకు కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నా మార్కెట్‌ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. వ్యాపారులు ఇచ్చేది ధర అవుతోంది. వేలం ప్రక్రియలో ప్రస్తుతం లోగ్రేడ్‌ బేళ్లకు ధరలు తగ్గించినా కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో దక్షిణాదిలోని పలు వేలం కేంద్రాల్లో నిత్యం బేళ్ల తిరస్కరణలు భారీగా ఉంటున్నాయి. సాధారణంగా మార్కెట్‌ జరిగే రోజుల్లో పలు కారణాలతో 10శాతం వరకు బేళ్ల తిరస్కరణలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో 15శాతం వరకూ పెరుగుతూ ఉంటోంది. దక్షిణాదిలోని వేలం కేంద్రాల్లో వారం రోజుల మార్కెట్‌ను తీరును పరిశీలిస్తే నిత్యం సగటున 30శాతం బేళ్ల తిరస్కరణలు ఉంటున్నాయి. అందులో లోగ్రేడ్‌వి అధికంగా ఉంటున్నాయి. వాటికి ధర లు తగ్గించి బిడ్డింగ్‌ పెట్టినా వ్యాపారులు కొనుగోలు చేయకపోతుండటంతో  పలుకేంద్రాల్లో అధికారులే నోబిడ్‌లు పెట్టాల్సి వస్తోంది. 

దక్షిణాదిలోని 11వేలం కేంద్రాల పరిధిలో 2020-21 పంట సీజన్‌కు సుమారు 71.98 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తి అంచనా వేసిన పొగాకు బోర్డు అధికారులు ఈ ఏడాది మార్చి 15న కొనుగోళ్లు ప్రారంభించారు. తొలి  పక్షం రోజులు హాట్‌హాట్‌గానే సాగిన మార్కెట్‌ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పటి వరకు సుమారు 65.17 మిలియన్‌ కిలోల పంట కొనుగోలు పూర్తవగా, సగటున కిలోకు రూ.146మేర ధర లభించింది. ఇప్పటికే రెండు, మూడు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి కాగా మరికొన్నింటిలో ఈ వారంలో ముగియనుంది. ఈ తరుణంలో రైతులు తమవద్ద ఉన్న అన్ని గ్రేడ్‌ల పొగాకును వేలం కేంద్రాలకు తెస్తున్నారు. ముగింపు దశలో కూడా వ్యాపారుల తీరులో మార్పు లేదని వారు వాపోతున్నారు. లోగ్రేడ్‌ కూడా కిలోకు రూ.100కు తగ్గకుండా కొనుగోలు చేస్తేనే తప్ప గిట్టుబాటు కాదని రైతులు గగ్గోలు పెడుతుండగా వ్యాపారులు మాత్రం అందులో స గం(రూ.50) మించి ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. చాలా కేంద్రాల్లో అధికారులు పెట్టిన బిడ్డింగ్‌ ధరకు కూడా కొనేవారు లేక భారీగా బేళ్లు నోబిడ్‌లు అవుతున్నాయి. మీడియం, మేలు రకం బేళ్లకు కూడా సరైన ధరలు లభించడం లేదని పలుచోట్ల రైతులు నిరసన తెలుపుతున్నారు. టంగుటూరులో శనివారం ఇదే విషయమై రైతులు ఆందోళనకు దిగడంతో అక్కడ వేలం నిలిచిపోయింది. మొత్తం మీద ముగింపు వేళ కూడా ధరలు రాక రైతులు అసంతృప్తిచెందుతుండగా ఏదో రకంగా వేలం పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.


 దక్షిణాదిలోని రెండు రీజియన్‌లలో వారం నుంచి రోజువారీ వేలం కేంద్రాలకు వచ్చిన బేళ్లు, తిరస్కరణల వివరాలు...

తేదీ                 వేలానికి         కొనుగోలు     తిరస్కరణ     తిరస్కరణ

                తెచ్చినబేళ్లు           చేసినవి     శాతం

జూలై 26న             9689          6785   2904      29.97

27వతేదీ         10772          7652    3120           28.96

28వతేదీ         9680         6700             2851     30.78

29వతేదీ         9006         6331             2675     29.70

30వతేదీ         10135         7231             2904     28.65

31వతేదీ         9292                 5750             3542     38.11

Updated Date - 2021-08-02T04:41:27+05:30 IST